Bandi Sanjay : సీఎం కేసీఆర్ కోసం కుర్చీ వేశాం.. సన్మానించాలని శాలువా కూడా తెచ్చాం కానీ...!

ABN , First Publish Date - 2023-04-08T15:05:02+05:30 IST

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను బీజేపీ గ్రాండ్ సక్సెస్ చేసింది. ఈ టూర్‌లో భాగంగా మోదీ వందేభారత్ రైలును ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కానీ..

 Bandi Sanjay : సీఎం కేసీఆర్ కోసం కుర్చీ వేశాం.. సన్మానించాలని శాలువా కూడా తెచ్చాం కానీ...!

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను (PM Modi Telangana Tour) బీజేపీ (BJP) గ్రాండ్ సక్సెస్ చేసింది. ఈ టూర్‌లో భాగంగా మోదీ వందేభారత్ రైలును (Vande Bharat Train) ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని.. కేసీఆర్ సర్కార్‌పై ఓ రేంజ్‌లో విమర్శల వర్షం కురిపించారు. ఇప్పటి వరకూ రెండు మూడు దఫాలుగా మోదీ తెలంగాణలో పర్యటించగా సీఎం కేసీఆర్ (CMKCR) మాత్రం ఎక్కడా కనిపించలేదు. అయితే ఈసారైనా మోదీని స్వాగతించడానికి కానీ.. కనీసం అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించే సమయంలో అయినా తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరవుతారని అందరూ అనుకున్నారు. అయితే కేసీఆర్ మాత్రం అస్సలు రాలేదు. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ (Talasani Srinivas Yadav) మాత్రమే వచ్చారు. మోదీ తెలంగాణలో పర్యటనకు వచ్చినప్పుడల్లా ప్రతిసారీ తలసానిని ప్రభుత్వం పంపుతోంది. అయితే ప్రధాని కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకాకపోవడంపై మరోసారి తెలంగాణ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. రాజకీయంగా వైరం పక్కనెట్టినా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి వెళ్లొచ్చు కదా అని బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది.

శాలువా, కుర్చీ అన్నీ తెచ్చాం కానీ..!

కేసీఆర్ రాకపోవడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (TS BJP Chief Bandi Sanjay) ఓ రేంజ్‌లో విమర్శలు, ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని పర్యటన ముగియగానే పరేడ్ గ్రౌండ్స్ బయట మీడియా ప్రతినిధులు బండిని పలకరించారు. సీఎం కేసీఆర్‌ కోసం చాలాసేపు ఎదురుచూశాం.. కుర్చీ కూడా వేశాం. కేసీఆర్ వస్తే సన్మానించాలని శాలువా కూడా పట్టుకొచ్చాం కానీ.. రాలేదు. ప్రధాని కార్యక్రమానికి కేసీఆర్‌ ఎందుకు రాలేదో చెప్పాలి..?. ఇన్ని అభివృద్ధి పనులు ప్రారంభం అవుతుంటే కేసీఆర్ ఎందుకు రాలేదు..?. కేసీఆర్‌కు అంత బిజీ పనులు ఏమున్నాయ్..? సీఎం షెడ్యూల్ ఏంటో బయటపెట్టాలి. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి. తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కేసీఆరే. కేసీఆర్ అభివృద్ధి నిరోధకుడు. తెలంగాణ అభివృద్ధే బీజేపీ లక్ష్యంఅని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Chair-For-KCR.jpg

కౌంటర్ ఎటాక్..!

తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదని.. రాష్ట్రంలో కుటుంబ పాలన, అవినీతిని పెంచిపోషిస్తున్నారని ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఈ కామెంట్స్‌పై బీఆర్ఎస్ నేతలు ఓ రేంజ్‌లో కౌంటర్లు ఇస్తున్నారు. మోదీ పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేంటి..? అసలు ఆయన ఎందుకొచ్చారు..? ఏం చేశారు..? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కనీసం ఈసారైనా రాష్ట్రానికి సంబంధించి ఏదో ఒక ప్రకటన ఉంటుందని ఆశించాము కానీ మళ్లీ మళ్లీ ప్రధాని మోదీ ఉసూరు మనిపించారని గులాబీ నేతలు భగ్గుమంటున్నారు. తెలంగాణ అభివృద్ధిని బీజేపీ ఓర్చుకోవడం లేదని మండిపడుతున్నారు. నెలకోసారి ప్రధాని మోదీ, వారానికో కేంద్ర మంత్రి తెలంగాణ వచ్చి ఏం చేస్తున్నారు..? ఏం తెస్తున్నారు..? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఫైనల్‌గా ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ముఖ్య నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే.

*****************************

ఇవి కూడా చదవండి..

*****************************


Modi Hyderabad Tour : మోదీ తెలంగాణ పర్యటనలో చేసిందేంటి.. కేసీఆర్ సర్కార్‌పై ఏం మాట్లాడారు..!?


*****************************

TS Paper Leak : పేపర్ లీకేజీ తర్వాత బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఏమనుకుంటున్నాయ్.. ఇదంతా ఆయన వ్యూహమేనా.. ఫైనల్‌గా తేలేదెప్పుడు..!?

*****************************

Updated Date - 2023-04-08T16:08:27+05:30 IST