IPL 2024 Auction: యువీ రికార్డు బద్దలవుతుందా?.. అత్యధిక ధర పలికిన టాప్ 5 ఇండియన్స్ వీళ్లే!
ABN , Publish Date - Dec 19 , 2023 | 11:07 AM
IPL 2024: మరికాసేపట్లో ఐపీఎల్ మినీ వేలం ప్రారంభంకానుంది. మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొంటున్న ఈ వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు అన్ని ఫ్రాంచైజీల దగ్గర కలిపి రూ.262 కోట్లు ఉన్నాయి.
దుబాయ్: మరికాసేపట్లో ఐపీఎల్ మినీ వేలం ప్రారంభంకానుంది. మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొంటున్న ఈ వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు అన్ని ఫ్రాంచైజీల దగ్గర కలిపి రూ.262 కోట్లు ఉన్నాయి. 333 మంది ఆటగాళ్లు వేలంలోకి దిగుతున్నప్పటికీ అన్ని ప్రాంచైజీలకు కలిపి 77 మంది ఆటగాళ్లను కొనుగులు చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. అది కూడా స్వదేశీ ఆటగాళ్లను 47 మందిని, విదేశీయులను 30 మందిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ సారి వేలంలో భారీ ధర దక్కించుకునే ఆటగాళ్లు ఎవరనే ఆసక్తి నెలకొంది. ప్రతి సీజన్‌లో భారీ ధరతో ఎవరో ఒక ఆటగాడు ట్రెండింగ్‌లో ఉంటాడు. ఈ సీజన్‌లో ఏ ప్లేయర్ ట్రెండింగ్‌లో ఉండనున్నాడో చూడాలి. ముఖ్యంగా అత్యధిక ధర పలికే భారత ఆటగాడు ఎవరనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్ 5 భారత ఆటగాళ్లను ఒక సారి పరిశీలిద్దాం.
16 ఏళ్ల ఐపీఎల్ వేలం చరిత్రలో స్వదేశీ ఆటగాళ్ల పరంగా అత్యధిక ధర పలికిన రికార్డు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పేరు మీద ఉంది. 2015 వేలంలో యువరాజ్ సింగ్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది. 2022 వేలంలో రూ.15.25 కోట్ల ధర పలికిన యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 2022 మెగా వేలంలో భారీ ధర వెచ్చించి కిషన్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. కాగా అంతకుముందు సీజన్లలో కూడా ఇషాన్ కిషన్ ముంబై జట్టులోనే ఉన్నాడు.
రూ.14.9 కోట్లు పలికిన టీమిండిమా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ ధరకు 2011 వేలంలో గంభీర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. కేకేఆర్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన గంభీర్ 2012, 2014 సీజన్లలో ట్రోఫి గెలిపించాడు. టీమిండియా యువ పేసర్ దీపక్ చాహర్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 2022 వేలంలో దీపక్ చాహర్‌ను రూ.14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. రూ.12.50 కోట్లు పలికిన టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. 2014 వేలంలో ఈ ధరకు దినేష్ కార్తీక్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ కొనుగోలు చేసింది. కాగా ఈ సారి వేలంలో భారీ ధర పలికే భారత క్రికెటర్ ఎవరవుతారో తెలియాలంటే మరి కొద్ది గంటలు ఎదురుచూడాల్సిందే.