ODI Cricket: వన్డేల్లో 13వేల పరుగులు చేసిన కోహ్లీ.. సచిన్ రికార్డు బద్దలు
ABN , First Publish Date - 2023-09-11T19:05:40+05:30 IST
వన్డేల్లో అత్యంత వేగంగా 13వేల పరుగులు చేసిన ఆటగాడిగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 267 ఇన్నింగ్స్‌లలోనే కోహ్లీ 13వేల రన్స్ మార్క్ అందుకున్నాడు. దీంతో సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ 321 ఇన్నింగ్స్‌లలో 13వేల పరుగులు పూర్తి చేశాడు.
ఆదివారం నాడు తమ టీమ్‌ను వర్షం కాపాడేసిందన్న షోయబ్ అక్తర్ మాటలు అక్షరాలా నిజమే అనిపిస్తోంది. రిజర్వ్ డే రోజు పాకిస్థాన్ బౌలర్లను టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ చితక్కొట్టేశారు. ఇద్దరూ సెంచరీలు చేయడంతో పాటు రికార్డుస్థాయిలో భాగస్వామ్యం నెలకొల్పారు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 13వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 267 ఇన్నింగ్స్‌లలోనే కోహ్లీ 13వేల రన్స్ మార్క్ అందుకున్నాడు. దీంతో సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ 321 ఇన్నింగ్స్‌లలో 13వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ ఉన్నాడు. అతడు 341 ఇన్నింగ్స్‌లలో 13వేల రన్స్ అందుకున్నాడు.
ఇది కూడా చదవండి: Asia Cup 2023: అన్ని మ్యాచ్‌లు పూర్తవుతున్నాయి.. దాయాదుల మ్యాచ్‌లపైనే వరుణుడి పగ ఎందుకు?
కాగా సచిన్ టెండూల్కర్ 13వేల పరుగుల మైలురాయిని చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పైనే అందుకోగా.. విరాట్ కోహ్లీ కూడా పాకిస్థాన్‌పైనే ఈ మార్క్ సాధించడం విశేషం. అయితే సచిన్ పాకిస్థాన్‌లో పాకిస్థాన్‌పై ఈ రికార్డు సాధించగా.. కోహ్లీ మాత్రం శ్రీలంకలో పాకిస్థాన్‌పై 13వేల మార్క్ అందుకున్నాడు. మొత్తానికి చిరకాల ప్రత్యర్థిపై విరాట్ కోహ్లీ సెంచరీతో రాణించడం అభిమానులకు కిక్ ఇచ్చిందనే చెప్పాలి. షాహిన్ అఫ్రిది వేసిన 48వ ఓవర్‌లో విరాట్ కోహ్లీ క్విక్ డబుల్ తీసి వన్డేల్లో 13వేల పరుగుల మైలు రాయి అందుకున్నాడు. ఆ వెంటనే సింగిల్‌తో వన్డేల్లో మరో శతకం పూర్తి చేశాడు. కోహ్లీ వన్డే కెరీర్‌లో ఇది 47వ సెంచరీ కావడం మరో విశేషం.
కాగా విరాట్ కోహ్లీ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో మరో రికార్డు కూడా కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో ఎక్కువ సార్లు ఒకే ఏడాది 1000కి పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. కోహ్లీ ఇక ఏడాదిలో 1000కి పైగా పరుగులు చేయడం గత 15 ఏళ్లలో ఇది 12వ సారి. ఓవరాల్‌గా సచిన్ 16 సార్లు ఒకే ఏడాది వెయ్యికి పైగా రన్స్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.