Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు ప్రమోషన్.. టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక?

ABN , First Publish Date - 2023-07-22T18:29:41+05:30 IST

మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు టీమిండియా కెప్టెన్‌గా ప్రమోషన్ లభించే అవకాశాలున్నాయి. వచ్చే నెలలో ఐర్లాండ్‌లో పర్యటించే భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌నే కెప్టెన్‌గా నియమించనున్నారని సమాచారం. నిజానికి గత టీ20 ప్రపంచకప్ తర్వాతి నుంచి పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టును హార్దిక్ పాండ్యా నడిపిస్తున్నాడు.

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు ప్రమోషన్.. టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక?

మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు టీమిండియా కెప్టెన్‌గా ప్రమోషన్ లభించే అవకాశాలున్నాయి. వచ్చే నెలలో ఐర్లాండ్‌లో పర్యటించే భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌నే కెప్టెన్‌గా నియమించనున్నారని సమాచారం. నిజానికి గత టీ20 ప్రపంచకప్ తర్వాతి నుంచి పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టును హార్దిక్ పాండ్యా నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఐర్లాండ్ పర్యటనలో కూడా టీమిండియా కెప్టెన్‌గా హార్దికే ఉంటాడని అంతా భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం హార్దిక్ పాండ్యాకు ఐర్లాండ్ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించనున్నారట. రానున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాలో హార్దిక్ పాండ్యా కీలక ఆటగాడు కావడంతో అతనికి తగిన విశ్రాంతి కల్పించాలని సెలెక్టర్లు భావిస్తున్నారట. దీంతో వెస్టిండీస్ పర్యటన అనంతరం హార్దిక్ పాండ్యా.. ఐర్లాండ్ వెళ్లకుండా ఇంటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా గైర్వాజరీలో సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సెలెక్టర్లు భావిస్తున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఐర్లాండ్ పర్యటనకు సెలెక్టర్లు జట్టును ఎంపిక చేసే అవకాశాలున్నాయి. అప్పుడు ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా కెప్టెన్ ఎవరనేది స్పష్టం కానుంది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

కాగా ఇప్పటికే పలువురు స్టార్ ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వారంతా వన్డే ప్రపంచకప్‌లో ఆడతారో లేదో కూడా అనుమానమే. అందుకే పేస్ ఆల్‌రౌండరైనా హార్దిక్ పాండ్యా విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ జాగ్రత్త వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పైగా హార్దిక్ పాండ్యా గతంలో వెన్ను నొప్పి గాయం కారణంగా కొంత కాలం జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కు ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉంది. గత సీజన్‌లో రోహిత్ శర్మ గైర్హాజరీలో ముంబై ఇండియన్స్‌ను సూర్యకుమార్ యాదవే నడిపించాడు. కాగా ప్రస్తుతం వెస్టిండీస్‌లో ఉన్న భారత జట్టు వచ్చే నెలలో ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో టీమిండియా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఆగష్టు 18, 20, 23వ తేదీలలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Updated Date - 2023-07-22T22:06:28+05:30 IST