Share News

AP Govt : ఏబీవీపై కేసుల ఉపసంహరణ

ABN , Publish Date - Dec 22 , 2024 | 04:16 AM

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ)పై జగన్‌ సర్కారు పెట్టిన కేసులను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

AP Govt : ఏబీవీపై కేసుల ఉపసంహరణ

  • రిటైర్డ్‌ అధికారికి గతంలో కోర్టులు,యూపీఎస్సీ ఇచ్చిన ఆదేశాలు వర్తించవు

  • జీవో జారీ చేసిన సీఎస్‌ నీరబ్‌ కుమార్‌

అమరావతి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ)పై జగన్‌ సర్కారు పెట్టిన కేసులను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. న్యాయశాఖ, అడ్వకేట్‌ జనరల్‌ అభిప్రాయాల మేరకు ఈ కేసులు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ శనివారం జీవో జారీ చేశారు. ఏబీవీ ఇప్పటికే రిటైర్‌ అయ్యారని, ఈ నేపథ్యంలో గతంలో కోర్టులు, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) ఇచ్చిన ఆదేశాలు చెల్లవని, చెల్లింపుల్లో కోతలు, ఇంక్రిమెంట్లు ఆపడం, పెనాల్టీలు విధించడం, కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఇతర ఆదేశాలు ఆయనకు వర్తించవని న్యాయశాఖ అభిప్రాయపడినట్టు జీవోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏబీవీ వేతనం అందుకోవడం లేదు కాబట్టి.. భవిష్యత్‌ ఇంక్రిమెంట్లను ఆపలేమని న్యాయశాఖ పేర్కొన్నట్టు వెల్లడించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఽఆర్థిక నష్టం జరగలేదని, ఎస్‌టీసీఐఎల్‌ నిధులన్నీ తిరిగిచ్చేసిందని తెలిపారు. ఏబీవీపై వచ్చిన ఆరోపణలు, ఉల్లంఘనలపై విచారణ చేసిన అధికారికి ఏబీవీ గానీ, ఆయన కుమారుడు గానీ లబ్ధిపొందినట్టు ఎలాంటి ఆధారాలూ లభించలేదని పేర్కొన్నారు. వీటన్నింటిపై ఏజీ, న్యాయశాఖ ఇచ్చిన అభిప్రాయాల ఆధారంగా కేసులు ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చీరాగానే ఏబీవీపై గురిపెట్టారు. ఆయనపై కక్షగట్టినట్టు వ్యవహరించారు. అకారణంగా ఆయన్ను సస్పెండ్‌ చేశారు. దీంతో ఆయన క్యాట్‌ను ఆశ్రయించగా సస్పెన్షన్‌ ఎత్తివేయాలని జగన్‌ ప్రభుత్వానికి క్యాట్‌ సూచించింది. దీనిపై జగన్‌ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే, క్యాట్‌ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అలా ఐదేళ్లపాటు ఏబీ వెంకటేశ్వరరావు న్యాయం పోరాటం చేశారు.

Updated Date - Dec 22 , 2024 | 04:16 AM