Share News

Cinema Tree: ఊపిరి పోసుకున్న సినిమా చెట్టు.. ఫలించిన ప్రయత్నాలు..

ABN , Publish Date - Oct 09 , 2024 | 04:16 PM

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద గోదావరి ఒడ్డున సినీ వృక్షం ఉంది. దాని వయస్సు సుమారు 150 సంవత్సరాలు. దాదాపు 300సినిమాలు ఆ చెట్టు వద్ద చిత్రీకరించారు.

Cinema Tree: ఊపిరి పోసుకున్న సినిమా చెట్టు.. ఫలించిన ప్రయత్నాలు..

తూర్పుగోదావరి: కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద గోదావరి ఒడ్డున ఉన్న 150ఏళ్ల వయసున్న సినీ వృక్షం(నిద్రగన్నేరు) ఆగస్టు 5న నెలకొరిగిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు సినిమా ఇండ్రస్టీ సహా కుమారదేవం గ్రామస్థులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఆ చెట్టు, ఎంతో మంది ప్రముఖులను తమ గ్రామానికి తీసుకువచ్చిన మహావృక్షం కూలిపోవడంతో గ్రామస్థులు ఆవేదనలో మునిపోయారు. అయితే ఆ చెట్టు గురించి ఇప్పుడెందుకు అనుకుంటున్నారా.. ఎందుకంటే సినిమా చెట్టు తిరిగి ఊపిరి పీల్చుకుంది. రెండుగా చీలిపోయిన ఆ మహావృక్షానికి మళ్లీ చిగురు వచ్చింది. దీంతో తాము చేసిన ప్రయత్నాలు, పూజలు ఫలించాయంటూ కుమారదేవం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tree-2.jpg


ఎలా కూలిందంటే..

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద గోదావరి ఒడ్డున సినీ వృక్షం ఉంది. దాని వయస్సు సుమారు 150 సంవత్సరాలు. దాదాపు 300సినిమాలు ఆ చెట్టు వద్ద చిత్రీకరించారు. అయితే ఈ ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు గోదావరి నదికి వరదనీరు పోటెత్తింది. ఎన్నో ప్రకృతి విపత్తులను తట్టుకున్న సినిమా చెట్టు.. భారీ వరదలకు గోదావరి ఒడ్డు కోతకు గురికావడంతో ఆగస్టు 5న రెండుగా చీలిపోయింది. దీంతో గ్రామస్థులు, సహా పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చెట్టుతో తమకున్న అనుబంధాన్ని వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లతో పంచుకున్నారు. కొంతమంది దర్శకులు, నటులు నేరుగా కుమారదేవం గ్రామానికి వెళ్లి కూలిపోయిన మహావృక్షాన్ని పరిశీలించి కనీళ్లు పెట్టుకున్నారు. అయితే 150ఏళ్లుగా 300సినిమాల్లో ఉన్న వృక్షాన్ని తిరిగి బతికించేందుకు గ్రామస్థులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు ముందుకు వచ్చారు.

Tree-3.jpg


రోటరీ క్లబ్ ప్రయత్నం..

దాదాపు 150 ఏళ్ల వయసున్న సినీ వృక్షాన్ని బతికించేందుకు గ్రామస్థులు, రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ ప్రతినిధులు ముందుకు వచ్చారు. చెట్టు ప్రాణాలు నిలబెడితే చరిత్ర నిలబడుతుందని ప్రకృతి ప్రేమికులు నమ్మారు. దీంతో దానికి పునర్జీవం పోసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ముందుగా పడిపోయిన నిద్రగన్నేరు కొమ్మలను తొలగించారు. చెట్టు కూలిపోయినా వేళ్లు బతికే ఉన్నట్లు వారు గుర్తించారు. దీంతో రోటరీ క్లబ్ ప్రతినిధులు కొన్ని రసాయనాలను చెట్టు కాండం, వేళ్లకు పూశారు. అది మళ్లీ బతికేందుకు 50రోజులు సమయం పడుతుందని అందరూ భావించారు. అయితే నెల రోజులకే మళ్లీ చిగురు వచ్చింది. ప్రస్తుతం కాండం, కొమ్మల బాగాల్లో సుమారు పది చోట్ల పచ్చని ఆకులతో చిగుళ్లు వచ్చాయి. నిత్యం ముగ్గురు వ్యక్తులు దీన్ని పర్యవేక్షించడంతోనే ఇది సాధ్యమైందని రోటరీ ప్రతినిధి రేఖపల్లి దుర్గాప్రసాద్ తెలిపారు. మరో నెల రోజుల్లో ఏపుగా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. దీంతో గ్రామస్థులు, ప్రకృతి ప్రేమికులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము చేసిన ప్రయత్నాలు ఫలించాయంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tree-3.jpg


ప్రముఖుల చిత్రాలు..

ప్రముఖ దర్శకులు బాపు, కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు సహా అనేక మంది ప్రముఖ డైరెక్టర్లు ఇక్కడ వందల కొద్దీ చిత్రాలు రూపొందించారు. అక్కినేని నాగేశ్వరావు, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలకృష్ణ, మోహన్‌బాబు వంటి అగ్రనాయకులు సైతం ఇక్కడ సినిమా తీసేందుకు ఇష్టపడేవారు. కనీసం ఒక్క సీన్ అయిన తమ చిత్రంలో ఈ చెట్టు ఉంటే హిట్ అవుతుందని చాలామంది నటులు, డైరెక్టర్లు నమ్మేవారు. అయితే మెుదటగా 1975లో వచ్చిన పాడి పంటలు చిత్రంతో దీనికి మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత శంకరాభరణం, త్రిశూలం, సీతారామయ్యగారి మనవరాలు సహా అనేక హిట్ చిత్రాలు ఇక్కడ నిర్మించారు.

Updated Date - Oct 09 , 2024 | 04:21 PM