Land Resurvey : ‘రీసర్వే’ లోపాల పుట్ట!
ABN , Publish Date - Dec 08 , 2024 | 03:26 AM
గత వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన భూముల రీసర్వే లోపాల పుట్టని తేలిపోయింది. ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఉమ్మడి కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులోనే లెక్కలేనన్ని తప్పులు దొర్లాయి.
పైలట్ గ్రామం తక్కెళ్లపాడులోనే ఎన్నో తప్పులు
దేవదాయ శాఖ జాబితాలోకి ప్రైవేటు భూములు
సర్వే నంబర్లలో భూములన్నీ నిషేధ జాబితాలోకి
ఫిర్యాదులు బుట్టదాఖలు చేసిన నాటి అధికారులు
అంతా అద్భుతమంటూ రూ.5 కోట్లతో జగన్ సభ
నేడు అదే గ్రామంలో భూ సమస్యలపై అలజడి
రెవెన్యూ సదస్సులో వెల్లువెత్తిన ఫిర్యాదులు
తగ్గిన భూమి
బ్రిటిషర్ల పాలనలో 1932లో సర్వే చేసినప్పుడు తక్కెళ్లపాడులో భూముల విస్తీర్ణం 1,539 ఎకరాలు. పైలట్‌లో రీసర్వే చేసినప్పుడు తేలిన విస్తీర్ణం 1,533.56 ఎకరాలు. ఇక్కడ మొత్తం 150 సర్వే నంబర్లు ఉంటే, రీసర్వే తర్వాత వాటిని 631కి పెంచారు. అంతకుముందు గ్రామంలో ప్రభుత్వ భూమి 272.52 ఎకరాలు ఉండగా, సర్వే తర్వాత 272.23 ఎకరాలుగా తేల్చారు. అంటే, ఉన్నదాని కంటే కొంత తగ్గింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన భూముల రీసర్వే లోపాల పుట్టని తేలిపోయింది. ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఉమ్మడి కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులోనే లెక్కలేనన్ని తప్పులు దొర్లాయి. నిండా 1,600 ఎకరాల భూములు కూడా లేని ఈ గ్రామంలో రీసర్వే పేరిట అనుభవం లేని సర్వేయర్లు నేలవిడిచి సాము చేశారు. సర్వే మొత్తం తప్పులతడకని రైతులు గగ్గోలుపెట్టినా బయటికు రాకుండా నాటి అధికారులు తొక్కిపెట్టారు. తర్వాత రూ.5కోట్ల వ్యయంతో గ్రామంలో రీసర్వే పైలట్ సక్సెస్ సభ నిర్వహించిన జగన్ సొంత భజన చేసుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు ప్రారంభించిన తొలిరోజే మొత్తం బండారం బట్టబయలైంది. ఈ గ్రామంలో భూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రైవేటు భూములను దేవదాయ శాఖ ఖాతాలో వేయడంతో పాటు ఆ మొత్తం సర్వే నంబరును నిషేధ భూముల జాబితాలో చేర్చారంటూ బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో జరిగిన సదస్సుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా హాజరయ్యారు. రీసర్వే పేరిట జరిగిన గందరగోళాన్ని రైతులు, స్థానికులు ఆయనకు విడమర్చి చెప్పారు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నవన్నీ తప్పుడు లెక్కలని తేల్చిచెప్పారు.
లాక్‌డౌన్‌లో హడావుడి
ఉమ్మడి కృష్ణాజిల్లా జగయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడు జనాభా దాదాపు 3 వేలు. ఈ గ్రామంలో 1,600 ఎకరాల భూమి ఉంది. చిన్న గ్రామం, భూముల విస్తీర్ణం కూడా తక్కువగానే ఉండటంతో రీసర్వేకు అనువుగా ఉంటుందని దీన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేశారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆరెంజ్ జోన్‌లో ఉన్న గ్రామంలో జగన్ సర్కారు హడావుడిగా ఈ ప్రాజెక్టు చేపట్టింది. భూముల కొలతలు వేయడంలో రైతులను భాగస్వామ్యం చేయలేదు. సర్వే, సరిహద్దుల చట్టం ప్రకారం రైతులకు నోటీసులు ఇవ్వకుండానే అధికారులే సొంతగా సర్వేలు చేసి రికార్డులు రూపొందించి మమ అనిపించారు. లోపాల పుట్టగా మారిన ఆ రికార్డులతో ఇప్పుడు రైతులు నానాఅవస్థలూ పడుతున్నారు.
ప్రభుత్వ భూముల్లో కోత
బ్రిటిషర్ల పాలనలో 1932లో సర్వే చేసినప్పుడు తక్కెళ్లపాడులో భూముల విస్తీర్ణం 1,539 ఎకరాలు. పైలట్‌లో రీసర్వే చేసినప్పుడు తేలిన విస్తీర్ణం 1,533.56 ఎకరాలు. ఇక్కడ మొత్తం 150 సర్వే నంబర్లు ఉంటే, రీసర్వే తర్వాత వాటిని 631కి పెంచారు. అంతకుముందు గ్రామంలో ప్రభుత్వ భూమి 272.52 ఎకరాలు ఉండగా, సర్వే తర్వాత 272.23 ఎకరాలుగా తేల్చారు. అంటే, ఉన్నదాని కంటే కొంత తగ్గింది. రీసర్వే అనంతరం 71 సర్వే నంబర్లలోని భూముల విస్తీర్ణంలో భారీగా తేడాలొచ్చాయి. రెండు నుంచి ఐదు ఎకరాల విస్తీర్ణంలో తేడాలు వచ్చిన సర్వే నంబర్లు 117 వరకూ ఉండగా, పదెకరాలకు పైగా తేడాలున్న సర్వే నంబర్లు ఏకంగా 173 ఉన్నాయి. అత్యధికంగా 3.73 సెంట్ల చొప్పున భూ విస్తీర్ణంలో తేడాలు బయటపడ్డాయి. వాస్తవాలు ఇలా ఉంటే, భూమి విస్తీర్ణంలో తేడాలపై తమకు కేవలం రెండు ఫిర్యాదులే వచ్చాయని, వాటిని కూడా పరిష్కరించామని నాటి అధికారులు సర్కారుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.
బయటపడ్డ పాత తప్పులు
తక్కెళ్లపాడులో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆర్.పి. సిసోడియాతో పాటు కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే తాతయ్య ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామంలో రీసర్వేతో భూమి రికార్డుల్లో తప్పులు వచ్చాయని 17 మంది రైతులు ఫిర్యాదు చేశారు. జగన్ పేరిట ఇచ్చిన పాస్ పుస్తకాల్లో ఉన్న విస్తీర్ణం, టీడీపీ హయాంలో ఇచ్చిన పట్టాలో ఉన్నదానికి చాలా తేడాలు ఉన్నాయని సిసోడియా దృష్టికి తీసుకెళ్లారు. ఓ సర్వే నంబరులో ప్రైవేటు, దేవదాయ శాఖ భూములు ఉన్నాయి. అయితే, రెవెన్యూ అధికారులు ఆ భూమిని మొత్తం దేవదాయ శాఖదిగా నమోదు చేశారు. అనంతరం దాన్ని నిషేధ జాబితా 22(ఏ)లో చేర్చారు. దీంతో 42 ఎకరాల మేర భూములున్న రైతులు గ గ్గోలు పెడుతున్నారు. తమకు పంట రుణాలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే దీన్ని పరిష్కరించాలని స్పెషల్ సీఎ్‌సను కోరారు. అయితే ఈ సమస్యను పరిష్కరించాలంటే గ్రామంలో మరోసారి భూముల సర్వే చేయాలని, లేకుంటే రీసర్వే రికార్డులను సవరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఆ భూములను నిషేధ జాబితా నుంచి తొలగించి దేవదాయ భూములకు సబ్‌డివిజన్ నంబర్లు కేటాయించి వాటిని మాత్రమే 22(ఏ)లో కొనసాగిస్తే సరిపోతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రెవెన్యూ సదస్సులు పూర్తయిన 45 రోజుల్లో ఈ సమస్యలను పరిష్కరిస్తామని సిసోడియా తెలిపారు.