Share News

Veeranjaneya Swamy:పింఛన్ల పంపిణీపై మంత్రి వీరాంజనేయ స్వామి కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jun 26 , 2024 | 10:02 PM

ఒకటి రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి దోలా బాల వీరాంజనేయ స్వామి (Veeranjaneya Swamy) కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈరోజు (బుధవారం) రాష్ట్ర సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Veeranjaneya Swamy:పింఛన్ల పంపిణీపై మంత్రి  వీరాంజనేయ స్వామి కీలక ఆదేశాలు
Minister Veeranjaneya Swamy

అమరావతి: ఒకటి రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి దోలా బాల వీరాంజనేయ స్వామి (Veeranjaneya Swamy) కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈరోజు (బుధవారం) రాష్ట్ర సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులతో సమీక్షించారు.

ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమస్యలన్నింటిపై సమగ్ర నివేదికకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ ఉద్యోగులంతా పింఛన్ల పంపిణీలో పాల్గొనాలని సూచించారు. ఊరికి దూరంగా కట్టిన సచివాలయాల మీద నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాజీనామా చేసి కూడా సెల్‌ఫోన్లు, సిమ్‌ కార్డుల స్వాధీనం చేయని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయాలు, పంచాయతీల మధ్య సమన్వయ లోపాన్ని సవరించాలని అన్నారు.


వారిపై చర్యలు తీసుకోవాలి..

‘‘జూలై ఒకటోతేదీన పింఛన్ల పంపిణీలో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదు. సచివాలయ ఉద్యోగులంతా పింఛన్ల పంపిణీలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటిదాక లక్షా 9వేల మంది వలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామా చేసి కూడా సెల్ ఫోన్లు, సిమ్‌ కార్డులు స్వాధీనం చేయని వారి సంగతేంటి..? అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. చాలాచోట్ల గ్రామ, వార్డు సచివాలయ భవనాలు ఊరికి దూరంగా, ప్రజలకు ఏవిధంగానూ అందుబాటులో లేకుండా ఉన్నాయి. అవన్నీ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. అలాంటి వాటిపై వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులందరి సెలవుల మంజూరుపై ఒక కచ్చితమైన విధానాన్ని రూపొందించాలి’’ అని మంత్రి బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.


పాత లోగోలు ఉండొద్దు..

‘‘సచివాలయాలు జారీ చేసే సర్టిఫికెట్లు, ఇతర సర్వీసు పత్రాలపై పాత లోగోలు లేకుండా జాగ్రత్త పడాలి. ఈ విషయంలో ఎక్కడైనా అలసత్వం వహించినట్లు తెలిస్తే చర్యలు తప్పవు. సచివాలయ భవనాల మీద గత ప్రభుత్వ లోగోలు, ఫొటోలు తొలగించి వాటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని ఉంచాలి. రాష్ట్రంలో చాలా చోట్ల గ్రామ సచివాలయాలకు, పంచాయతీలకు మధ్య సమన్వయం లేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఇతర శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులను సైతం సంప్రదించి అవసరమైతే ఒక కమిటీ వేసుకుని సమన్వయాన్ని సాధించాలి. గ్రామ, వార్డు సచివాలయాల రోజు వారి వ్యవహారాలను పరిశీలించేలా మండల స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలి. రక్త హీనత, ఆహార లోపం, బడి బయటి పిల్లలు, పాఠశాలల్లో మౌలిక వసతులు వంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి పెట్టి పురోగతి సాధించాలి’’ అని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు.

Updated Date - Jun 26 , 2024 | 10:02 PM