Share News

AP Politics: స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి వైసీపీ తప్పుకుంటుందా..

ABN , Publish Date - Sep 16 , 2024 | 10:30 AM

2019 నుంచి 2024 వరకు వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉంది. తమకు 40 శాతానికి పైగా ఓట్లు ఉన్నాయని.. ప్రజలే తమ బలమని వైసీపీ చెబుతూ వస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ 39.7 శాతం ఓట్లను ఆ పార్టీ సాధించింది. కానీ 11 సీట్లకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో..

AP Politics: స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి వైసీపీ తప్పుకుంటుందా..
YSRCP

ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. తాము ఎంతో బలంగా ఉన్నామని ఊహించుకున్న వైసీపీకి ఓటర్లు షాక్ ఇవ్వడంతో.. ఇప్పటికీ ఆ పార్టీ కోలుకోలేదు. ప్రజల తీర్పు దెబ్బకి వైసీపీ సగం ఖాళీ అయిందనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు., కొంతమంది ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జగన్‌ను నమ్ముకోవడం వల్ల తమకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయిందని కొందరు నాయకులు తీవ్ర ఆవేదన చెందుతున్నారట. కొన్ని నియోజకవర్గాల్లో ఇటీవల ఎమ్మెల్యేలుగా వైసీపీ నుంచి పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణులకు సీనియర్ నేతలు అందుబాటులో ఉండటం లేదనే చర్చ జరుగుతోంది. దీంతో తమకు ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడంలేదని క్షేత్రస్థాయిలో స్థానిక నేతలు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతుందనేది ఆసక్తిగా మారింది. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉంది. తమకు 40 శాతానికి పైగా ఓట్లు ఉన్నాయని.. ప్రజలే తమ బలమని వైసీపీ చెబుతూ వస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ 39.7 శాతం ఓట్లను ఆ పార్టీ సాధించింది. కానీ 11 సీట్లకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 39 శాతం ఓట్లు కలిగిన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను బలంగా ఎదుర్కొగలగాలి. అయితే ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి చూస్తుంటే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి తప్పుకుంటేనే బెటర్ అనే చర్చ జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది.

Ration Mafia: తిరువూరులో రెచ్చిపోతున్న రేషన్ బియ్యం మాఫియా..


కారణాలివే..

స్థానిక సంస్థల ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉంది. వైసీపీ అప్పటిలోపు మరింత బలపడి ఎన్నికల్లో కూటమి పార్టీలను ధీటుగా ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే మాత్రం పార్టీ శ్రేణులకు అలా జరుగుతుందనే విశ్వాసం కుదరడంలేదట. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమ ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశం లేకపోలేదు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. వైసీపీ ఎప్పుడూ గెలవని స్థానాల్లోనూ ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందింది. అప్పటి ఎన్నికల ప్రక్రియపై అనేక విమర్శలు వచ్చాయి. ఇతర పార్టీలు, ఇండింపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు వైసీపీ అరాచకాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ చాలా చోట్ల ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. జనసేన, బీజేపీ విడివిడిగా పోటీచేశాయి. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి. ప్రభుత్వంపై ప్రస్తుతం ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత కనిపించడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినప్పటికీ.. తనకు ఉన్న పాలనా అనుభవంతో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు ప్రయత్నిస్తు్న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సైతం చంద్రబాబు నాయకత్వానికి అండగా నిలుస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి పట్టంకట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో తాము ఎన్నికల్లో పోటీచేసి మరోసారి ఘోర పరాజయం చవిచూడటం కంటే ఏదో ఒక కారణం చెప్పి ఎన్నికల బరిలోంచి తప్పుకుంటే బెటర్ అనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

Pedana: పెడనలో 144 సెక్షన్ విధించిన పోలీసులు


నిరాశలో కేడర్..

రాష్ట్రంలో వైసీపీ సీనియర్ నేతలు పార్టీకి దూరంగా ఉండటంతో కేడర్ తీవ్ర నిరాశతో ఉన్నారట. ఆర్థికంగా అండగా నిలిచేందుకు క్షేత్రస్థాయిలో నేతలు ముందుకు రాకపోవడం వైసీపీ వెనుకడుగు వేసేందుకు ఓ కారణంగా తెలుస్తోంది. డబ్బులు ఖర్చుపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకున్నా.. ఎమ్మెల్యే, ఎంపీ అధికార పార్టీకి చెందినవారే కావడంతో తమకు పెద్దగా కలిసొచ్చేది ఏమి ఉండదనే లెక్కల్లో సీనియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సైలెంట్‌గా ఉండటమే ఉత్తమం అనే ధోరణిలో కొందరు నేతలు ఆలోచిస్తున్నారట. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయామనే పేరు కంటే.. పోటీకి దూరంగా ఉండి పరువు నిలుపుకోవడం మంచిదనే ఆలోచనలో వైసీపీ ఉందనే చర్చ జరుగుతోంది. ఇంకా ఏడాదికి పైగా సమయం ఉండటంతో అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయి.. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.


Dr Chandrasekhar Pemmasani: ‘సమాజం కోసమే రాజకీయాల్లోకి వచ్చా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News Click Here

Updated Date - Sep 16 , 2024 | 10:30 AM