Amaravati: ఆదివారమైనా తగ్గేదే లే.. లోకేష్ తీరుపై ప్రజల హర్షం..
ABN , Publish Date - Jun 16 , 2024 | 03:12 PM
ప్రభుత్వం ఏర్పడింది.. ప్రజా పాలన మొదలైంది. ముందునుంచి చెబుతున్నట్లుగానే.. పాలనలో లోకేష్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఆదివారమైనా రెస్ట్ లేకుండా ప్రజా సమస్యలు తెలుసుకుని, పరిష్కరించే పనిలో నిలిచారు. అవును, మంత్రి నారా లోకేష్ ఆదివారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించారు. శనివారం నాడు తొలిరోజు ప్రజాదర్బార్ ..
అమరావతి, జూన్ 16: ప్రభుత్వం ఏర్పడింది.. ప్రజా పాలన మొదలైంది. ముందునుంచి చెబుతున్నట్లుగానే.. పాలనలో లోకేష్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఆదివారమైనా రెస్ట్ లేకుండా ప్రజా సమస్యలు తెలుసుకుని, పరిష్కరించే పనిలో నిలిచారు. అవును, మంత్రి నారా లోకేష్ ఆదివారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించారు. శనివారం నాడు తొలిరోజు ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్న లోకేష్.. ఆదివారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించారు. దీంతో మంగళగిరి ప్రజలు.. యువనేత లోకేష్‌ని కలిసి తమ సమస్యలను విన్నవించారు.
ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బృందం మంత్రి లోకేష్‌ను కలిసింది. డీఎస్సీ - 2008, జీవో నెంబర్ 39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న 2,193 మందిని రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు బృందం సభ్యులు. జగదీష్ అనే విద్యార్థి వచ్చి.. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా చెల్లించనందున తన పాలిటెక్నిక్ సర్టిఫికెట్లను నూజివీడు కాలేజీ యాజమాన్యం ఇవ్వడం లేదని చెప్పాడు. ఆ సర్టిఫికెట్లను ఇప్పించాలని మంత్రి లోకేష్‌ను విజ్ఞప్తి చేశాడు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని కోరారు. నులకపేట ఎంపీయూపీ ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యా బోధనకు అనుమతి ఇవ్వాలని లోకేష్ ను కలిశారు పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు. ఇక అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఐదు నెలల తన మేనల్లుడికి వైద్యసాయం అందించాలని మంగళగిరికి చెందిన షేక్ నజీనా కోరారు. ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.