Vijayawada: ప్రకాశం బ్యారేజీ నుంచి రెండో బోటు బయటకి.. వివరాలు ఇవే..
ABN , Publish Date - Sep 20 , 2024 | 08:21 AM
ప్రకాశం బ్యారేజీ వద్ద బోల్తా పడిన బోట్లలో రెండో దానిని ఇంజినీరింగ్ అధికారులు గురువారం సాయంత్రం ఒడ్డుకు చేర్చారు. మొదటి బోటు మాదిరిగానే దీన్నీ పున్నమి ఘాట్ సమీపానికి చేర్చారు. మొదటి దాన్ని ఒడ్డుకు చేర్చడానికి 11రోజుల సమయం పట్టగా, రెండో బోటును కేవలం రెండ్రోజుల్లోనే తీసుకొచ్చారు.
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురిసిన భారీ వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి ఐదు ఇనుప బోట్లు కొట్టుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిని బయటకు తీసేందుకు అధికారులు చేసిన విశ్వప్రయత్నాలు మెున్నటి వరకూ విఫలమయ్యాయి. భారీ వరద నేపథ్యంలో పడవలు వెలికితీసేందుకు కుదరలేదు. గ్యాస్ కట్టర్ల సహాయంతో కట్ చేసి బయటకు తీసేందుకు పయత్నాలూ విఫలం అయ్యాయి. అయితే వరదలు తగ్గుముఖం పట్టడంతో వాటిని కావడి విధానంలో ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. మెుదటి బోటు తీసేందుకు దాదాపు 11రోజులు పట్టగా రెండో పడవను కేవలం రెండ్రోజుల్లోనే ఒడ్డుకు చేర్చారు.
ఒడ్డుకు చేర్చాలిలా..
ప్రకాశం బ్యారేజీ వద్ద బోల్తా పడిన బోట్లలో రెండో దానిని ఇంజినీరింగ్ అధికారులు గురువారం సాయంత్రం ఒడ్డుకు చేర్చారు. మొదటి బోటు మాదిరిగానే దీన్నీ పున్నమి ఘాట్ సమీపానికి చేర్చారు. మొదటి దాన్ని ఒడ్డుకు చేర్చడానికి 11రోజుల సమయం పట్టగా, రెండో బోటును కేవలం రెండ్రోజుల్లోనే తీసుకొచ్చారు. బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకుపోయిన మూడు బోట్లలో ఒక దాన్ని రెండ్రోజుల క్రితం కావడి విధానం ద్వారా పున్నమి ఘాట్ వద్దకు చేర్చారు. రెండో బోటును బుధవారం తీయడానికి ప్రయత్నించగా, నీటిలో మునిగిపోయింది. దీంతో ఈ బోటును తొలగించడానికి మొదటి బోటు మాదిరిగానే 11రోజుల సమయం పడుతుందని భావించారు. అయితే, బెకమ్ కంపెనీ, సీ లయన్ కంపెనీ, కాకినాడ అబ్బులు టీం సమన్వయంతో గురువారం సాయంత్రానికే పున్నమి ఘాట్ వద్దకు తీసుకొచ్చారు. మొదటి బోటును లాగడానికి ప్రత్యేకంగా నాలుగు బోట్లు ఏర్పాటు చేయగా, రెండో బోటును మాత్రం కావడి విధానంలో రెండు బోట్లతోనే ఒడ్డుకు చేర్చడం విశేషం.
మెుత్తం ఐదు బోట్లు..
సెప్టెంబర్ 1న వరదల సమయంలో ఐదు బోట్లు ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకుని వచ్చి ప్రకాశం బ్యారేజీని బలంగా ఢీకొన్న విషయం తెలిసిందే. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ఐదు బోట్లలో ఒకటి దిగువకు కొట్టుకుని వెళ్లిపోయింది. మరో మూడు బ్యారేజీ గేట్లకు చిక్కుకుని ఉండిపోయాయి. వాటిలో ప్రస్తుతం రెండింటిని అధికారుల బృందం తీవ్రంగా శ్రమించి బయటకు తీసింది. మరో బోటును ఇవాళ(శుక్రవారం) సాయంత్రానికి బయటకు తీసే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. మిగిలిన మరో బోటు నీటిలో మునిగిందా, నీళ్లలో కొట్టుకుని వెళ్లిపోయిందా అనే విషయం ఇంకా తెలియరాలేదు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Chandrababu: ప్రకాశం జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన.
Live Updates: రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్‌ను విచారిస్తున్న పోలీసులు!