వరద బాధితులకు అండగా నిలుద్దాం
ABN , Publish Date - Sep 11 , 2024 | 12:20 AM
విజయవాడలో సంభవించిన వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలుద్దామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.
ఆత్మకూరు, సెప్టెంబరు 10: విజయవాడలో సంభవించిన వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలుద్దామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలో మంగళవారం ఎమ్మెల్యే స్వయంగా విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరానికి వరద సంభవించడం బాధాకరమని అన్నారు. ప్రకృతి విపత్తులను ఆపలేనప్పటికీ ఆ విపత్తుల్లో నష్టపోయిన బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఇందులో భాగంగానే శ్రీశైలం నియోజకవర్గం తరుపున రూ.కోటి విరాళాలను సేకరించాలని తాము నిర్ణయించినట్లు తెలిపారు. సమకూరిన నిధిని సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెక్కు రూపంలో త్వరలో సీఎం చంద్రబాబుకు అందజేయనున్నట్లు వివరించారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు తమనేత చంద్రబాబు నిద్రాహారాలు మాని పనిచేస్తుంటే వైసీపీ నాయకులు ఇంకితజ్ఞానం లేకుండా విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఓ వైపు వరదలతో విజయవాడ వాసులు అవస్థలు పడుతుంటే సాయం చేయాల్సిన వైసీపీ నాయకులు ఇంట్లో కూర్చోని తప్పుడు స్టేట్‌మెంట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. చివరికి పడవలతో ప్రకాశం బ్యారేజీని కూల్చాలన్న కుట్రలకు వైసీపీ నేతలు పాల్పడటం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో వైసీపీ పనిచేస్తోందని విమర్శించారు. అయితే వైసీపీ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎవరెన్ని కుట్రలు చేసిన సీఎం చంద్రబాబు వరద బాధితులకు అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ గోవిందరెడ్డి, టీడీపీ మండల, పట్టణాధ్యక్షులు శివప్రసాద్‌రెడ్డి, వేణుగోపాల్, టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు కలిముల్లా, నాయకులు రామ్మూర్తి, రామసుబ్బయ్య, నాగూర్‌ఖాన్, కొండలరావు, దినకర్, జనసేన పార్టీ నాయకులు శ్రీరాములు, శేషుకుమార్ ఉన్నారు.