Share News

Smuggling: అంత లేదు పుష్పా!

ABN , Publish Date - Dec 28 , 2024 | 05:15 AM

స్మగ్లర్ల నుంచి ఎర్రచందనం యాంటీ టాస్క్‌ఫోర్స్‌, పోలీసులు గత పదేళ్లలో స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు తిరుపతి సమీపంలోని తిమ్మినాయుడిపాలెం గోడౌన్లలో నిల్వ ఉంచారు. సుమారు 40 ఏళ్లు పెరిగే చెట్టు నుంచి తీసే ఎర్రచందనం మొదటి రకం.

Smuggling: అంత లేదు పుష్పా!

ఎర్రచందనం వేలానికి స్పందన కరువు

  • టన్ను టెండరు రేటు రూ.70 లక్షలు

  • 50 లక్షలకే బిడ్లు వేసిన వ్యాపారులు

  • కొన్న సరుకు కూడా 30 శాతమే

  • రెడ్‌ శాండల్‌కు తగ్గిన డిమాండ్‌

  • చైనా, జపాన్‌, మలేషియా, సింగపూర్‌,

  • అరబ్‌ దేశాల్లో ఆర్థిక సంక్షోభమే కారణం

‘మంగళం శీను గాడికి అమ్మితే టన్నుకు యాభై లక్షలు.. అదే శీను అమ్మే మురుగన్‌ దగ్గరికి వెళితే టన్నుకు కోటిన్నర.. మురుగన్‌ అమ్మే దగ్గరికి మనం వెళ్లగలిగితే.. పుష్ప అంటే నేషనల్‌ అనుకుంటివా.. ఇంటర్నేషనల్‌..’ ..ఇటీవలే రిలీజైన పుష్ప-2 సినిమాలో కాబోయే ముఖ్యమంత్రి సిద్ధప్పనాయుడి(రావు రమే్‌ష)తో ఎర్రచందనం స్మగ్లర్‌ పుష్పరాజ్‌ (అల్లు అర్జున్‌) చెబుతాడు. అయితే ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖ మాత్రం అంతలేదు పుష్పా.. మా దగ్గర ఐదు వేల టన్నులు స్టాకుంది.. టన్ను 50 లక్షలకు కూడా కొనేందుకు ఎవరూ ఎవరూ ముందుకు రావడంలేదని అంటోంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

స్మగ్లర్ల నుంచి ఎర్రచందనం యాంటీ టాస్క్‌ఫోర్స్‌, పోలీసులు గత పదేళ్లలో స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు తిరుపతి సమీపంలోని తిమ్మినాయుడిపాలెం గోడౌన్లలో నిల్వ ఉంచారు. సుమారు 40 ఏళ్లు పెరిగే చెట్టు నుంచి తీసే ఎర్రచందనం మొదటి రకం. అంతకు తక్కువ కాలం పెరిగే చెట్లను నరికి తీసే ఎర్రచందనం రెండోరకం. దుంగల సైజును బట్టి మూడో రకంగా అటవీశాఖ అధికారులు వర్గీకరిస్తారు. వాటిని ఏడాదిలో రెండు సార్లు వేలం వేసి.. నాణ్యమైన మొదటి రకాన్ని కొంతమేర విక్రయిస్తారు. రెండో రకంలో సగం, మూడో రకంలో దాదారు 80 శాతం వరకూ అమ్ముడుపోదు. ఇలా పదేళ్లుగా నిల్వ ఉన్న ఎర్రచందనంలో మూడో రకమే ఎక్కువగా ఉంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. గోడౌన్‌లో ఉన్న ప్రస్తుతం 5,376 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనం ఉంది.


దాని విక్రయానికి రాష్ట్ర అటవీశాఖ కేంద్రప్రభుత్వ అనుమతి తీసుకుంది. గ్లోబల్‌ టెండర్ల ద్వారా నిరుడు కొంత ఎర్రచందనం వేలానికి ప్రయత్నించినా.. టెండర్‌దారులు ముందుకు రాలేదు. తాజాగా 905 టన్నులు విక్రయించేందుకు రాష్ట్ర అటవీశాఖ టెండర్లు ఆహ్వానించినా కొనుగోలుదారుల నుంచి స్పందన కనిపించలేదు. అది వేలం వేసే ఎర్ర చందనానికి డిమాండ్‌ లేకపోవడమే దీనికి కారణం. గత ఏడాది కాలంలో మూడు సార్లు టెండర్లు పిలిచినా.. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపలేదు. మన ఎర్రచందనం వేలంలో చైనాకు చెందిన 10-15 మంది వ్యాపారులు పాల్గొంటుంటారు. అటవీశాఖ టన్ను ధర రూ.70 లక్షలుగా నిర్ణయించింది. కానీ ఎక్కువ మంది టెండరుదారులు రూ.50 లక్షలకు మించి బిడ్లు వేయలేదు. టెండర్‌ రేటుకు బిడ్లు వేసిన ఒకరిద్దరు వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకు కూడా 30ు మించలేదు.


2022లో 500 టన్నులు వేలం వేయగా.. ఇంకా 4,900 టన్నులు మిగిలి ఉంది. అందులో 2023లో లాట్‌ల వారీగా 400-500 టన్నుల చొప్పున రెండు సార్లు ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచారు. కానీ టెండర్‌ రేటు కన్నా తక్కువ కోట్‌ చేస్తూ బిడ్లు వచ్చాయి. అనుకున్న ధరకు కాస్త అటూఇటూగా ఉన్న బిడ్లను మాత్రమే ఖరారు చేసి, మిగతా లాట్‌ల వేలాన్ని అధికారులు ఆపేశారు. అత్యధికంగా 2016-19 మధ్య టన్ను ధర రూ.70-75 లక్షలు పెట్టి వేలంలో వ్యాపారులు కొనుక్కున్నారు. కానీ గరిష్ఠంగా నాడు అమ్ముడుపోయిన ధరనే టెండర్‌ రేటుగా నిర్ణయించడంతో అంత ధరతో కొనడానికి ఇప్పుడు వ్యాపారులు ముందుకు రావట్లేదు. దీనికి కారణం చైనా, జపాన్‌, మలేషియా, సింగపూర్‌, అరబ్‌ దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉండడమేనని అధికారులు చెబుతున్నారు. ఆయా దేశాల్లో విలాసవంతమైన భవన నిర్మాణాలు, ఖరీదైన ఫర్నిచర్‌ వినియోగం తగ్గడంతో ఎర్రచందనానికి డిమాండ్‌ తగ్గిపోయిందని అంటున్నారు.


శేషాచలం ఎర్రచందనానికి భలే గిరాకీ

కలియుగ దెవం శ్రీవేంకటేశ్వరుడు వెలసిన శేషాచలం కొండల్లో మాత్రమే లభ్యమయ్యే ఎర్రచందనానికి దేశ, విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. చైనా, జపాన్‌, మలేషియా, సింగపూర్‌, అరబ్‌ దేశాల్లో సంపన్నులు ఎర్రచందనం కర్రతో ఫర్నిచర్‌ చేయించుకుని హోదా ప్రదర్శిస్తారు. ఈ కర్రతో చేసే ఫర్నిచర్‌ 50 ఏళ్లయినా చెక్కు చెదరదు. ఈ డిమాండ్‌ను గమనించిన స్మగ్లర్లు శేషాచలం కొండల నుంచి ఎర్రచందనాన్ని నరికి అక్రమంగా దేశ, విదేశాలకు సరఫరా చేసి కోట్లకు పడగలెత్తుతున్నారు. వారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అటవీ సిబ్బందిని సైతం హత్య చేసి స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను సినిమా ఫక్కీలో ఎత్తుకెళ్లేవారు.


రాష్ట్ర విభజన తర్వాత ఈ అరుదైన సంపదను ప్రభుత్వ ఆదాయ వనరుగా మార్చుకోవాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు 450 మంది సాయుధ పోలీసులు, అటవీ సిబ్బందితో రెడ్‌ శాండిల్‌ యాంటీ స్మగ్లింగ్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. 2014-19 మధ్యలో పట్టుబడిన ఎర్రచందనాన్ని తిరుపతికి సమీపంలోని తిమ్మినాయుడిపాలెంలో ఒక గోడౌన్‌లో నిల్వ చేశారు. విదేశాల్లో ప్రకటనలు ఇప్పించి అక్కడి నుంచి వ్యాపారులను రప్పించి వేలం ద్వారా విక్రయించేవారు. ఆ సొమ్ము ప్రభుత్వ ఖజానాకు జమయ్యేది. అయితే 2019లో జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ను దాదాపు నిర్వీర్యం చేసింది. ఐజీ పోస్టు తీసేసి పనిష్మెంట్‌ కింద ఒక ఎస్పీ స్థాయి అధికారిని బలవంతంగా నియమించడంతో శేషాచలంలో అరుదైన వృక్షజాతితో పచ్చగా ఉన్న అటవీ ప్రాంతం మోడు బారింది.

Updated Date - Dec 28 , 2024 | 05:15 AM