AP Elections: టీడీపీ అనూహ్య నిర్ణయం.. చివరి క్షణంలో మాజీ ఎమ్మెల్యేను వరించిన అదృష్టం
ABN , Publish Date - Apr 21 , 2024 | 03:48 PM
అదృష్టం తోడుగా ఉంటే కోరుకున్నది ఏదైనా మన వెంట పరిగెత్తుకొస్తుందనే సామెత సరిగ్గా పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి వర్తిస్తుంది. గతంలో వైసీపీ నుంచి పాడేరు ఎమ్మెల్యేగా గెలిచిన గిడ్డి ఈశ్వరి ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి చేతిలో ఓడిపోయారు. అయినాసరే అప్పటినుంచి టీడీపీలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. ఈ ఎన్నికల్లో పాడేరు టికెట్ ఆశించారు. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తులు కుదరడంతో ఈ నియోజకవర్గం బీజేపీకి ఇస్తారనే ప్రచారం జరిగింది. దీంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ చివరిక్షణంలో..
అదృష్టం తోడుగా ఉంటే కోరుకున్నది ఏదైనా మన వెంట పరిగెత్తుకొస్తుందనే సామెత సరిగ్గా పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి వర్తిస్తుంది. గతంలో వైసీపీ నుంచి పాడేరు ఎమ్మెల్యేగా గెలిచిన గిడ్డి ఈశ్వరి ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి చేతిలో ఓడిపోయారు. అయినాసరే అప్పటినుంచి టీడీపీలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. ఈ ఎన్నికల్లో పాడేరు టికెట్ ఆశించారు. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తులు కుదరడంతో ఈ నియోజకవర్గం బీజేపీకి ఇస్తారనే ప్రచారం జరిగింది. దీంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ చివరిక్షణంలో తమకు పాడేరులో సరైన అభ్యర్థి లేరని, ఆ నియోజకవర్గం బదులు అరకు కావాలని బీజేపీ ప్రతిపాదించింది. అయితే అరకు అభ్యర్థిని టీడీపీ అప్పటికే ప్రకటించింది. చర్చల తర్వాత అరకును బీజేపీకి కేటాయించగా.. పాడేరును టీడీపీ తీసుకుంది.
చిగురించిన ఆశలు..
తెలుగుదేశం పార్టీకి పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం రావడంతో తనకు టికెట్ వస్తుందని గిడ్డి ఈశ్వరి ఆశించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కళ్లు వెంకట రమేష్ నాయుడికి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది. అప్పటినుంచి గిడ్డి ఈశ్వరి పార్టీపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో తాను గెలిచే అభ్యర్థిని అని.. మరోసారి పునరాలోచించాలని అధిష్టానాన్ని కోరారు. అయినా ఫలితం దక్కలేదు. తీరా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈలోపు అవసరమైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసేందుకు ఈశ్వరి సిద్ధమయ్యారు. ఈలోపు ఏమైందో ఏమో కాని తెలుగుదేశం అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకుంది. బీఫామ్‌లు ఇచ్చేరోజు గిడ్డి ఈశ్వరికి పిలుపువచ్చింది. పాడేరు బీఫామ్ తీసుకోవడానికి అమరావతి పార్టీ కార్యాలయానికి రావాలని.. దీంతో అమరావతి వెళ్లి పార్టీ అధినేత చంద్రబాబును కలిసి బీఫాం తీసుకున్నారు. పాడేరు టీడీపీ అభ్యర్థిగా గిడ్డు ఈశ్వరి పోటీచేయనున్నారు. ఎమ్మెల్యే టికెట్లను ఎంతోమంది ఆశిస్తారు. కొందరికి మాత్రమే సీట్లు దక్కుతాయి. కానీ గిడ్డి ఈశ్వరికి అదృష్టం తోడుగా ఉండటంతో ఆమెను టికెట్ వరించిందనే ప్రచారం జరుగుతోంది.
గతంలో ఎమ్మెల్యేగా..
గిడ్డి ఈశ్వరి 2014లో పాడేరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకుముందు వరకు ఆమె ప్రభుత్వ టీచర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఉపాధ్యాయ సంఘంలో కీలకంగా పనిచేయడంతో ఉమ్మడి విశాఖజిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఆమెకు ఎక్కువ పరిచయాలున్నాయి. 2014 ఎన్నికలకు ముందు ఆమె ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి ప్రవేశించారు. మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచారు. గిడ్డి ఈశ్వరికి పాడేరు ప్రాంతంలో సుపరిచితురాలు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు బంధువర్గం అధికంగా ఉంది. మరోవైపు పార్టీ బలానికి గిడ్డి ఈశ్వరి అభ్యర్థిగా ఉంటే గెలుపు అవకాశాలు ఎక్కువుగా ఉండవచ్చనే అంచనాలతోనే చివరి క్షణంలో అక్కడ అభ్యర్థిని మార్చి ఈశ్వరికి టికెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. మరోవైపు కూటమి తరపున అరకు ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత పోటీచేస్తున్నారు. పాడేరు అరకు లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. కొత్తపల్లి గీత ఈశ్వరి అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎం.విశ్వేశ్వరరాజు పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థి మార్పు టీడీపీకి కలిసి వస్తుందా లేదా అనేది జూన్4న తేలనుంది.
Ramskrishna: వెంకటగిరి టిక్కెట్టు విషయంలో టీడీపీ కీలక నిర్ణయం
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..