Andhra Pradesh: అన్నదాతకు శుభవార్త..!
ABN , Publish Date - May 16 , 2024 | 03:37 AM
అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 31న కేరళ తీరాన్ని తాకుతాయని బుధవారం
విశాఖపట్నం, మే 15(ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 31న కేరళ తీరాన్ని తాకుతాయని బుధవారం ప్రకటించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 కేరళకు వస్తాయి. అయితే ఈ ఏడాది ఒకరోజు ముందుగా రానున్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రా తెలిపారు. గతనెలలో ఇచ్చిన నివేదిక ప్రకారం నైరుతి సీజన్‌లో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 4నెలల నైరుతి సీజన్‌లో జూన్, జూలై నెలలు అత్యంత కీలకం. ఈ నెలల్లోనే ఖరీఫ్ సాగు ఎక్కువగా సాగుతుంది.
ఈ రెండు నెలల్లో వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయని మహాపాత్రో వివరించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలో సాధారణానికి మించి వర్షా లు కురుస్తాయని కేంద్రం ప్రకటించింది. 50ఏళ్ల సగటును పరిగణనలోకి తీసుకుంటే రుతుపవనాల సీజన్‌లో సగటున 87 సెం.మీ. వర్షపాతం నమోదవుతుందని, దీనికి అనుగుణంగా ఈ ఏడాది సాధారణానికి మించి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. కాగా, ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజులు వివిధ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.