Gold prices: పసిడి ప్రియులకు భారీ షాక్.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Oct 22 , 2024 | 07:20 AM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో నిన్న 24క్యారెట్ల పసిడి ధర 10గ్రాములకు రూ.220పెరిగి రూ.79,640కి చేరింది. నేడు తులానికి రూ.10మేర పెరిగి రూ.79,650కి చేరుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి పండగ వేళ బంగారం ధరలు చూస్తుంటే మహిళలకు భారీ షాకే తగిలినట్లు అనిపిస్తోంది. వెండి, బంగారం ధరలు గత కొన్ని రోజులుగా ఎగబాకుతూ కొన్నాలా వద్దా.. అనే ఆలోచనలో పడేస్తున్నాయి. దీపావళి ముందు వచ్చే ధంతేరాస్ రోజున బంగారం కొనడం భారతీయ మహిళలకు ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి రేట్లు చూస్తుంటే మాత్రం పసిడి కొనేందుకు సిద్ధపడినా.. కొనాల్సిన దాని కంటే తక్కువ కొనే అవకాశాలూ మెండుగా కనిపిస్తున్నాయి. ప్రతి రోజూ ధరలు చుక్కలను తాకుతున్నాయి.
నిన్న ఆల్ టైం రికార్డు..
నిన్న(సోమవారం) దేశీయంగా బులియన్ ధరలు సరికొత్త ఆల్‌టైం రికార్డు నెలకొల్పాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ డేటా ప్రకారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర రూ.750 పెరిగి రూ.80,650కి చేరింది. అలాగే 10 గ్రాముల పసిడి రూ.80,000 స్థాయిని దాటింది. వెండి ధర అయితే ఏకంగా రూ.5,000 పెరిగి రూ.99,500కు చేరుకుంది. మరోవైపు హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.220 పెరుగుదలతో రూ.79,640కి, 22 క్యారెట్ల రేటు రూ.200 పెరిగి రూ.73,000 చేరకున్నాయి. కిలో వెండి రూ.2వేలు ఎగబాకి రూ.1,09,000 ధర పలికింది.
నేటి బంగారం ధరలు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో నిన్న 24క్యారెట్ల పసిడి ధర 10గ్రాములకు రూ.220పెరిగి రూ.79,640కి చేరింది. నేడు తులానికి రూ.10మేర పెరిగి రూ.79,650కి చేరుకుంది. అలాగే నిన్న 22 క్యారెట్ల రేటు తులానికి రూ.200 పెరిగి రూ.73,000కు చేరగా.. నేడు 10గ్రాములకు రూ.10మేర పెరిగి రూ.73,010కి చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ అదే రేట్లు కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల 10గ్రాముల రేటు రూ.73,010ఉండగా, 20క్యారెట్ల 10గ్రాముల ధర రూ.79,650గానే ఉంది. ఇక వెండి విషయానికి వస్తే.. హైదరాబాద్ మార్కెట్‌లో నిన్న కిలోకు రూ.2వేలు పెరిగి రూ.1,09,000లకు చేరింది. నేడు కిలోకు రూ.100లు పెరిగి రూ.1,09,100కు ఎగబాకింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ వెండి ధరలు ఇదే రేటు పలుకుతున్నాయి.
అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర నిన్న రూ.73,150 ఉండగా నేడు తులానికి రూ.10పెరిగి రూ.73,160కి చేరింది. 24క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.79,790 ఉండగా.. నేడు 10గ్రాములకు రూ.10 పెరిగి రూ.79,800కు చేరింది. అలాగే నిన్న వెండి ధర రూ.1,01,000 పలకగా.. నేడు కిలోకు రూ.100 పెరిగి రూ.1,01,100కి చేరింది.