Sim Card Rules: మల్టిపుల్ సిమ్ కార్డ్స్ ఉన్నవారిపై జరిమానా తప్పదా.. ట్రాయ్ సమాధానం ఇదే!
ABN , Publish Date - Jun 15 , 2024 | 12:24 PM
రెండు లేదా అంతకంటే ఎక్కువ సిమ్ కార్డ్స్ కలిగి ఉన్న కస్టమర్లపై ఛార్జీలు వసూలు చేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధమవుతోందని ఇటీవల..
రెండు లేదా అంతకంటే ఎక్కువ సిమ్ కార్డ్స్ (Sim Card Rules) కలిగి ఉన్న కస్టమర్లపై ఛార్జీలు వసూలు చేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) సిద్ధమవుతోందని ఇటీవల ఓ వార్త చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ట్రాయ్ స్పష్టం చేసింది. అదో అసత్య ప్రచారమని.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఆ పుకార్లను సృష్టించారని పేర్కొంది. ఇలాంటి వార్తలను నమ్మొద్దని సూచించింది.
Read Also: మా రూమ్స్‌లో ఏసీలు పెట్టండి మహాప్రభో..
‘‘పరిమిత వనరుల (సిమ్ కార్డ్స్) కేటాయింపు, వినియోగాన్ని నిర్ధారించే లక్ష్యంతో.. మొబైల్, ల్యాండ్‌లైన్ నంబర్లకు రుసుములను ప్రవేశపెట్టాలని TRAI ప్రతిపాదించినట్లు కొన్ని మీడియా సంస్థలు (ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా) నివేదించినట్లు మా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా.. మల్టిపుల్ సిమ్ కార్డ్స్/నంబరింగ్ రీసోర్సెస్ కలిగి ఉన్న వారిపై ఛార్జీలు విధించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఇదొక తప్పుడు ప్రచారం. ప్రజల్ని తప్పదోవ పట్టించేందుకే ఎవరో ఈ పుకార్లను రేకెత్తారు’’ అని ట్రాయ్ ఎక్స్ వేదికగా స్పందించింది. ఈ ప్రచారాన్ని తాము నిస్సందేహంగా ఖండిస్తున్నామని క్లారిటీ ఇచ్చింది.
అసలేం జరిగింది?
సహజ వనరుల తరహాలోనే ఫోన్ నంబర్ కూడా ఎంతో విలువైనదని, ఫోన్ నంబర్స్ అన్‌లిమిటెడ్ కాదు కాబట్టి వాటి దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు ట్రాయ్ ఓ కొత్త రూల్‌ని తీసుకొచ్చిందని ఇటీవల ఓ వార్త చక్కర్లు కొట్టింది. మల్టిపుల్ సిమ్ కార్డ్స్ కలిగి.. తక్కువ వినియోగంలో ఉన్న నంబర్ల విషయంలో టెలికాం కంపెనీలకు జరిమానా విధించాలని ట్రాయ్ యోచిస్తోందని ప్రచారం జరిగింది. ఇదే జరిగితే ఆయా కంపెనీలు యూజర్ల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఉందని రూమర్స్ వచ్చాయి. అయితే.. ఇదంతా అబద్ధమని ట్రాయ్ స్పష్టతనిస్తూ.. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామని చెప్పుకొచ్చింది.
Read Latest Business News and Telugu News