Lok Sabha Elections: అభిషేక్‌ను కాల్చి చంపేసే వాళ్లు.. మమత సంచలన ఆరోపణ
ABN , Publish Date - Apr 23 , 2024 | 07:28 PM
అభిషేక్ బెనర్జీ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడం సంచలనం సృష్టించిన నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెక్కీ నిర్వహించిన వ్యక్తికి అభిషేక్ అపాయింట్‌మెంట్ ఇచ్చి ఉంటే తన మేనల్లుడిని వాళ్లు కాల్చి చంపేసేవాళ్లని అన్నారు.
కోల్‌కతా: అభిషేక్ బెనర్జీ (Abhisekh Benerjee) ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడం సంచలనం సృష్టించిన నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెక్కీ నిర్వహించిన వ్యక్తికి అభిషేక్ అపాయింట్‌మెంట్ ఇచ్చి ఉంటే తన మేనల్లుడిని వాళ్లు కాల్చి చంపేసేవాళ్లని అన్నారు. మంగళవారంనాడిక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడుతూ, ఈ వ్యక్తులు ప్రతి ఒక్కరిని చంపాలని, లేదా జైళ్లకు పంపాలని కోరుకుంటారని అన్నారు.
''బేజీపీలోని ఒక గద్దర్ (ద్రోహి) బాంబు పేలుతుందని మాట్లాడాడు. మీకు నామీద కక్ష ఉంటే నన్ను బాంబుతో చంపండి. మీరు అభిషేక్‌ను చంపడానికి కూడా ప్రయత్నించారు. కానీ ఈ విషయాలు మాకు ముందే తెలుస్తాయి'' అని మమతా బెనర్జీ అన్నారు. ఈ కుట్ర వెనుక బీజేపీ ఉందని కూడా ఆమె ఆరోపించారు. వాళ్లు అభిషేక్ ఇంటివద్ద రెక్కీ జరిపారని, ఫేస్ టైమ్‌కు పిలిచారని, అపాయింట్‌మెంట్ కోరారని, అభిషేక్ వాళ్లకు సమయం ఇచ్చి ఉంటే ఆయనను కాల్చిచంపేవారని సీఎం అన్నారు. బీజేపీపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ, తమకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లు సహించలేరని, చంపడమో, జైళ్లకు పంపడమే చేస్తారని ఆక్షేపించారు. ప్రజల ఓట్లు గెలుచుకోగలమని వారికి ధీమా ఉంటే ప్రజలను భయభ్రాంతులను చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
Lok Sabha Elections 2024: మోదీ, అమిత్‌షాలను 'జై-వీరు'లతో పోల్చిన హేమమాలిని
అభిషేక్ బెనర్జీ ఇంటివద్ద రెక్కీ నిర్వహించిన ముంబైకి చెందిన ఓ వ్యక్తిని కోల్‌కతా పోలీసులు సోమవారంనాడు అరెస్టు చేశారు. అతన్ని రాజారాం రేగేగా గుర్తించారు. మహారాష్ట్రలోని ఓ రాజకీయ పార్టీతో అతనికి సంబంధాలు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు డేవిడ్ హెడ్లీని కూడా రేగే కలుసుకున్నాడని వారంటున్నారు. 26/11 తరహా దాడికి కుట్ర జరిగిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
Read Latest National News and Telugu News