అఖిల భారత సర్వీసుల నుంచి ఖేద్కర్ అవుట్
ABN , Publish Date - Sep 09 , 2024 | 04:10 AM
వివాదాస్పద ఐఏఎస్ ప్రొబేషన్ అధికారి పూజా ఖేద్కర్‌ను ‘ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)’ నుంచి తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: వివాదాస్పద ఐఏఎస్ ప్రొబేషన్ అధికారి పూజా ఖేద్కర్‌ను ‘ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)’ నుంచి తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఐఏఎస్ (ప్రొబేషన్) నిబంధనలు 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమెపై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, యూపీఎస్సీ ఆమె ఎంపికను రద్దు చేసింది. అయితే, ఐఏఎస్ ప్రొబేషన్ అధికారిగా ఉన్న తన ఎంపికను రద్దు చేసే అధికారం యూపీఎస్సీకి లేదని పూజ వాదించారు. ఈ క్రమంలో ఖేద్కర్‌ను అఖిల భారత సర్వీసుల నుంచి తొలగిస్తున్నట్లు ఈ నెల 6న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది.