Share News

Chennai: రెడ్‌ అలర్ట్‌.. నేడు చెన్నై సహా 4 జిల్లాలకు సెలవు

ABN , Publish Date - Oct 16 , 2024 | 10:49 AM

ఈశాన్య రుతుపవనాల ఆగమనం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం తొమ్మిది జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ కేంద్రం ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

Chennai: రెడ్‌ అలర్ట్‌.. నేడు చెన్నై సహా 4 జిల్లాలకు సెలవు

- న్యాయస్థానాలూ పని చేయవు

- పుదువై, కారైక్కాల్‌లో విద్యాలయాలకు సెలవు

చెన్నై: ఈశాన్య రుతుపవనాల ఆగమనం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం తొమ్మిది జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ కేంద్రం ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. సోమవారం అర్ధరాత్రి నుంచి చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు(Chennai, Tiruvallur, Kanchipuram, Chengalpattu) జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిశాయి. దీంతో ఆ నాలుగు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. చెరువులు, జలాశయాల్లో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో మంగళవారం చెన్నై సహా నాలుగు జిల్లాలకే పరిమితమైన రెడ్‌ అలర్ట్‌ మరో ఐదు జిల్లాలకు కూడా ప్రకటించడంతో ఆయా జిల్లాల ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: చెన్నైలో కుండపోత.. నదుల్లా వీధులు.. చెరువుల్లా వాడలు


బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పవాయుపీడనం వాయుగుండంగా మారనుండటంతో చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, రాణిపేట, తిరువణ్ణామలై, వేలూరు, కడలూరు, విల్లుపురం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఈ జిల్లాల్లో బుధవారం ఉరుములు, మెరుపులు, పెనుగాలులతో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల్లో గంటలకు 40 నుంచి 50 కి.మీల వేగంతో పెనుగాలులు వీస్తాయని ఈ నెల 18 వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని, జాలర్లు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉత్తర సముద్రతీర జిల్లాల్లోనూ పెనుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. మన్నార్‌ జలసంధి, కన్నియాకుమారి సముద్రతీరంలో గంటకు 35 నుండి 45 కి.మీ.ల వేగంతో పెనుగాలులు వీస్తాయని వివరించారు.


చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలకు వరద ముప్పు పొంచివుందని వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే అత్యవసర సేవలందించే పోలీసు, అగ్నిమాపక, స్థానిక సంస్థలు, డైరీ తదితర శాఖలు, మెట్రో వాటర్‌ బోర్డు, ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు, బ్యాంక్‌లు, విద్యుత్‌, ఎంటీసీ, చెన్నై మెట్రోరైల్‌, ఎమ్మార్టీఎస్‌ రైల్వే, విమానాశ్రయం, పెట్రోల్‌ బంక్‌లు, హోటళ్లు, వరద సహాయక చర్యల్లో పాల్గొనే శాఖలు యధావిధిగా పనిచేయనున్నాయి. కాగా హైకోర్టుతో పాటు పైన పేర్కొన్న నాలుగు జిల్లాల్లోని న్యాయస్థానాలకూ సెలవు ప్రకటించారు. ఇదిలా వుండగా బుధవారం కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి, కారైక్కల్‌లలోని విద్యాలయాలకు అక్కడి ప్రభుత్వం సెలవు ప్రకటించింది.


డెల్టాలో నీటమునిగిన 6500 ఎకరాలు

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు డెల్టా జిల్లాలో 6500 ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి నీట మునిగింది. తంజావూరు, నాగపట్టినం, తిరువారూరు, మైలాడుదురై, పుదుకోట, తిరుచ్చి, కరూరు, అరియలూరు, పెరంబలూరు జిల్లాలో సోమవారం మధ్యాహ్నం నుండే చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం సాయంత్రానికి తీవ్ర రూపం దాల్చింది. కుండపోతగా కురిసిన ప్రాంతాలకు జనజీవనం స్తంభించింది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.

nani2.2.jpg


కంచిలో నిండిన చెరువులు..

రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు కాంచీపురం జిల్లాల్లోని ప్రధాన చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఆ జిల్లాలోని అనుమన్‌ తండలం, ఇలనగర్‌ చిత్తేరి, నందివరం, తిమ్మావరం, మధురాంతకం, అచ్చరపాకం చెరువు సహా మొత్తం 20 చెరువుల్లో నీటిమట్టం వేగంగా పెరిగింది. ఇదే విధంగా చెంబరంబాక్కం జలాశయంలోనూ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం కాంచీపురం జిల్లా కలెక్టర్‌ కళైసెల్విమోహన్‌ జలశయాన్ని నీటివనరుల శాఖ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని, దాని ప్రభావంతో మరి నాలుగైదు రోజుల వరకు ఉత్తరాది జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. చెన్నై సబర్బన్‌ ప్రాంతాల్లో మరో రెండు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన వివరించారు.


పెరంబూరులో 16.5 సెం.మీ.ల వర్షపాతం

నగరంలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు కురిశాయి. పెరంబూరు ప్రాంతంలో 16.5 సెం.మీల. వర్షపాతం నమోదైంది. కొళత్తూరులో 15.8 సెం.మీ., అన్నానగర్‌లో 15.2 సెం.మీ., అంబత్తూరు 13. సెం.మీ, బేసిన్‌బ్రిడ్జి 12.2 సెం.మీ, వేళచ్చేరి 12.2 సెం.మీ, మధురవాయల్‌, వడపళని, తండయార్‌పేటలో 10 సెం.మీల. చొప్పున వర్షపాతం నమోదైనట్లు స్థానిక వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.


ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం..

రాష్ట్రంలో మంగళవారం ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని, అవి వస్తూ భారీ వర్షాలను వెంట తీసుకువచ్చాయని చెన్నై వాతావరణ కేంద్రం దక్షిణ మండల అధికారి బాలచంద్రన్‌ ప్రకటించారు. ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి తోడు బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం బుధవారంలోగా వాయుగుండంగా మారనుండటంతో తొమ్మిది జిల్లాకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.


ఇదికూడా చదవండి: CM Revanth Reddy: సీఎం సంతకం చేసినా బదిలీల్లేవ్‌!

ఇదికూడా చదవండి: KTR: విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తున్న సర్కార్‌

ఇదికూడా చదవండి: తాళం వేస్తే కేసులు.. ఎవరి మాటల్తోనో కవ్వింపు చర్యలొద్దు

ఇదికూడా చదవండి: Gurukulas: గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించాలి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 16 , 2024 | 10:49 AM