Share News

Climate scientists : వద్దంటే వానలు?

ABN , Publish Date - Sep 01 , 2024 | 05:46 AM

దేశంలో అసాధారణ వర్షాలకు వాతావరణ మార్పులే కారణమా? రుతుపవనాలు తిరోగమనం చెందాల్సిన సమయంలో.. పశ్చిమ భారతాన్ని భారీ వర్షాలు.. వరదలు గడగడలాడిస్తుండడానికి కారణమిదేనా?

 Climate scientists : వద్దంటే వానలు?

  • సెప్టెంబరు చివరి వరకూ కొనసాగే అవకాశం

  • చేతికందే పంటకు అతివృష్టితో చేటు

  • పశ్చిమానికి కదులుతున్న రుతుపవనాలు

  • అసాధారణ వర్షాలంటున్న శాస్త్రవేత్తలు

  • ఆగస్టులో సాధారణం కంటే 16% ఎక్కువ వర్షాలు

  • కొండచరియలు విరిగిపడే ముప్పు: ఐఎండీ

న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశంలో అసాధారణ వర్షాలకు వాతావరణ మార్పులే కారణమా? రుతుపవనాలు తిరోగమనం చెందాల్సిన సమయంలో.. పశ్చిమ భారతాన్ని భారీ వర్షాలు.. వరదలు గడగడలాడిస్తుండడానికి కారణమిదేనా? ఈ ప్రశ్నలకు వాతావరణ శాస్త్రవేత్తలు అవుననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ రుతుపవనాలు గణనీయ మార్పులకు లోనవుతున్నట్లు చెబుతున్నారు. గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రల్లో అసాధారణంగా కురుస్తున్న వర్షాలు.. సెప్టెంబరులో కూడా సాధారణానికి మించి వర్షపాతం నమోదవుతుందనే అంచనాలకు కారణాలను విశ్లేషిస్తున్నారు. పశ్చిమ రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నా.. ఇది రుతుపవనాల దిశాత్మక మార్పునకు సంకేతమని హెచ్చరిస్తున్నారు. గుజరాత్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడం.. రాజస్థాన్‌లో కూడా భారీ వర్షాలతో ఇలాంటి పరిస్థితే నెలకొనడాన్ని బట్టి.. రుతుపవనాల తీరు మారుతోందనే ఆందోళనలు పెరుగుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వాయవ్య దిశగా కదులుతుండడంతో బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పొడి రాష్ట్రాల్లో కూడా సాధారణం కంటే అధిక వర్షపాతైనట్లు పేర్కొంటున్నారు. ‘‘ఈ పరిస్థితులకు వాతావరణ మార్పులే కారణం.

వివిధ రాష్ట్రాల్లో అసాధారణంగా నమోదవుతున్న వర్షపాతాలు వాతావరణ మార్పులను స్పష్టంగా తెలియజేస్తున్నాయి’’ అనిస్కైమెట్‌ ఉపాధ్యక్షుడు మహేశ్‌ పలావత్‌ వ్యాఖ్యానించారు. పశ్చిమ భారతంలో భారీ వర్షాలు అనేది నాలుగైదేళ్లుగా గమనించిన మార్పులో భాగమని, ఇది వాతావరణ మార్పులు రుతుపవనాల కదలికలపై ప్రభావం చూపుతున్నాయనడానికి సంకేతంగా భావించవచ్చని వివరించారు. ఐఐటీ-రూర్కీకి చెందిన జల వనరుల అభివృద్ధి, నిర్వహణ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కాసియా పిళ్లై.ఎ్‌స.విశ్వనాథన్‌ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఈ ఏడాది బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనాలు అసాధారణంగా పశ్చిమ భారతదేశాన్ని తాకినట్లు గుర్తుచేస్తున్నారు. కాగా.. కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌, వాటర్‌(సీఈఈడబ్ల్యూ) అధ్యయనం కూడా.. నైరుతి రుతుపవనాల్లో వర్షపాతంలో 10ు కంటే ఎక్కువ పెరుగుదల ఉన్నట్లు పేర్కొంటోంది. అయితే.. ఈ పెరుగుదల సీజన్‌ మొత్తం అంతటా సమానంగా పంపిణీ కావడం లేదని వివరిస్తోంది. చాలా ప్రాంతాల్లో రుతుపవనాల తిరోగమనంలో చాలా ఆలస్యం నెలకొంటోందని చెబుతోంది.


ఆగస్టులో 16% ఎక్కువ

దేశంలో ఆగస్టులో సాధారణం కంటే 16% అధిక వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. వాయవ్య భారతంలో 253.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని.. 2001 నుంచి ఇదే అత్యధికమని వివరించింది. వర్చువల్‌గా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర ఈ వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఆగస్టులో సాధారణ వర్షపాతం 248.1 మిల్లీమీటర్లు కాగా.. ఈసారి 287.1 మిల్లీమీటర్ల మేర నమోదైనట్లు ఆయన వివరించారు.

Untitled-1 copy.jpg

‘‘జూన్‌ 1న దేశంలో రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి 749 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దేశ సాధారణ వర్షపాతం 701 మిల్లీమీటర్లే. హిమాలయాలకు దిగువనున్న అనేక జిల్లాలతోపాటు.. ఈశాన్య రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావం పడడంతో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఆగస్టులోనే ఆరు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. వాటిలో రెండే రుతుపవనాల అల్పపీడనాలు’’ అని తెలిపారు.


సెప్టెంబరులోనూ ఎక్కువే..!

సెప్టెంబరు నెలలో కూడా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు. వాయవ్య భారతంలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. బిహార్‌, ఈశాన్య ఉత్తరప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలున్నట్లు వెల్లడించారు. సెప్టెంబరులో సాధారణ వర్షపాతం 167.9 మిల్లీమీటర్లుగా ఉంటుందని, ఈ సారి మాత్రం 109 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ‘‘హిమాలయ రాష్ట్రాలు-- ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌తోపాటు.. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇది వరదలకు దారితీయవచ్చు. హిమాలయ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదాలున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి’’ అని ఆయన హెచ్చరించారు.

సెప్టెంబరులో దక్షిణాదిలో తమిళనాడు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో సాధారణంకంటే తక్కువ వర్షపాతం నమోదు కానున్నట్లు తెలిపారు. కాగా.. ఆగస్టులో తీవ్ర వర్షాభావం నెలకొన్న ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సెప్టెంబరు నెలలో మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ బులెటిన్‌ తెలిపింది. శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకానున్నట్లు వెల్లడించింది. అయితే దక్షిణ కోస్తాలోని మిగిలిన జిల్లాలు, రాయలసీమలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనావేసింది.

Updated Date - Sep 01 , 2024 | 05:46 AM