‘బీమాపై జీఎస్టీ’ని సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘం
ABN , Publish Date - Sep 16 , 2024 | 03:25 AM
జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియాలపై జీఎస్టీని సమీక్షించి, రేట్ల సవరణకు సూచనలు ఇచ్చేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆదివారం 13 మంది సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది.
భట్టి విక్రమార్క , ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్‌కు చోటు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియాలపై జీఎస్టీని సమీక్షించి, రేట్ల సవరణకు సూచనలు ఇచ్చేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆదివారం 13 మంది సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ కమిటీకి బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన 12 మంది ఆర్థిక మంత్రులు/ఆర్థికశాఖను పర్యవేక్షిస్తున్న సీఎం/డిప్యూటీ సీఎంలను సభ్యులుగా నియమించింది. అక్టోబరు 30లోగా తుది నివేదికనివ్వాలని ఈ కమిటీని ఆదేశించింది. ఈ నెల 9న జరిగిన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాలు జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియాలపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి. మరికొన్ని రాష్ట్రాలు జీఎస్టీని 5శాతానికి తగ్గించాలని కోరాయి. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఈ కోవలోని బీమా ప్రీమియాలపై 18ు జీఎస్టీ ఉంది. కమిటీ.. ఆరోగ్య బీమాపై వ్యక్తిగత, గ్రూప్, కుటుంబ కేటగిరీల వారీగా.. జీవిత బీమా విషయంలోనూ టర్మ్, లైఫ్ ఇన్సూరెన్స్ కేటగిరీల వారీగా.. అధ్యయనం చేయనుంది. ఆ తర్వాత ఎంతమేర జీఎస్టీ నిర్ణయించాలనే అంశంపై సూచనలతో నివేదిక సమర్పించనుంది.