Share News

Weather Report: ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న వరుణుడు.. ఇలాగే పరిస్థితి ఉంటే..!

ABN , Publish Date - Jul 13 , 2024 | 05:11 PM

రుతు పవనాల ప్రభావంతో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలు వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించడంతో వర్షాల ప్రభావం స్పష్టంగా తెలుస్తోంది. కుండపోత వర్షాలతో కొన్ని ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.

Weather Report: ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న వరుణుడు.. ఇలాగే పరిస్థితి ఉంటే..!

రుతు పవనాల ప్రభావంతో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలు వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించడంతో వర్షాల ప్రభావం స్పష్టంగా తెలుస్తోంది. కుండపోత వర్షాలతో కొన్ని ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రెండు జిల్లాల్లోనూ రోడ్లన్నీ జలమయం అయ్యాయి. గుంతల్లోకి వరద నీరు చేరడంతో పలు ప్రాంతాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.


రాజమండ్రి, రాజానగరం, చింతూరు, గోకవరం, కోరుకొండ, రంపచోడవరం ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. మోరంపూడి జంక్షన్ వద్ద సైతం నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు సైతం వర్షాలు ఇళ్లకే పరిమితం చేశాయి. అలాగే తెలంగాణ రాష్ట్రవ్యా్ప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో చిరు జల్లులు పడుతుండగా.. భద్రాచలంలో వర్షపు నీటితో పర్ణశాల నీట మునిగింది. దీంతో అధికారులు భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నారు. రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరికొన్ని రోజులపాటు ఇలాంటి పరిస్థితే కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.


ఉత్తరాది రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..!

ఇక ఉత్తర భారతదేశం విషయానికి వస్తే రుతుపవనాల దెబ్బకు ప్రజలు అల్లాడి పోతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అసోం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ముంబై, హిమాచల్, ఢిల్లీ రాష్ట్రాల్లో ప్రయాణం చేయాలంటే నకరం చూడాల్సి వస్తోంది. తాగునీటి కోసం సైతం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి నగరవాసులను సైతం వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. రెండ్రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోనూ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో వర్షాల దెబ్బకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. పర్యాటక ప్రాంతాల్లోని ప్రజలు సైతం ఎక్కడివారు అక్కడే ఇరుక్కుపోయారు. ఉత్తరాఖండ్‌లో సుమారు వేల ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నట్లు అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. బిహార్‌లో ఏడు జిల్లాల్లోని పలు ప్రాంతాలు వర్షాలకు నీట మునిగాయి. పంజాబ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గోవా, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - Jul 13 , 2024 | 06:03 PM