Priyanka Gandhi: స్మృతి ఇరానీపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు.. గత ఐదేళ్లలో..
ABN , Publish Date - May 19 , 2024 | 07:14 AM
కేంద్రమంత్రి, బీజేపీ అమేథీ లోక్‌సభ స్థానం అభ్యర్థి స్మృతి ఇరానీని టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లలో ఆమె అమేథీ..
కేంద్రమంత్రి, బీజేపీ అమేథీ లోక్‌సభ స్థానం అభ్యర్థి స్మృతి ఇరానీని (Smriti Irani) టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లలో ఆమె అమేథీ (Amethi) అభివృద్ధి గురించి ఎప్పుడూ ఆలోచించలేదని, అసలు ఈ ప్రాంతాన్ని బీజేపీ (BJP) ఏమాత్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఈ ఐదేళ్ల కాలంలో అమేథీ ఎన్నో కష్టాలను ఎదుర్కొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సీటు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మకు (Kishori Lal Sharma) మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆమె ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘గత ఐదేళ్లలో అమేథీ ఎన్నో కష్టాలను చవిచూసింది. ఈ ప్రాంతం చాలా నష్టపోయింది. స్మృతి ఇరాని, బీజేపీ వాళ్లు అమేథీ అభివృద్ధి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. వాళ్లు మిమ్మల్ని తప్పుదారి పట్టించడం వల్లే గత ఎన్నికల్లో (2019) రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఓడిపోయారు’’ అని ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో కిషోరి లాల్‌ను గెలిపించాలని ఆమె కోరారు. ఆయన తన జీవితమంతా ఈ అమేథీకే అంకితం చేశారని చెప్పారు. గత 40 ఏళ్లుగా కిషోరి లాల్‌కు అమేథీతో అనుబంధం ఉందని.. తన తండ్రి రాజీవ్ గాంధీతోనూ కలిసి పని చేసిన చరిత్ర ఆయనకుందని పేర్కొన్నారు. అంతేకాదు.. తన తల్లి సోనియా గాంధీతో పాటు సోదరుడు రాహుల్ గాంధీతోనూ కిషోర్ లాల్ కలిసి పని చేశారని గుర్తు చేశారు.
అమేథీ తన ఇల్లు అని, ఈ ప్రాంతం ఓ కుటుంబం లాంటిదని.. దీనికి తామెప్పుడూ దూరంగా ఉండమని ప్రియాంక గాంధీ నొక్కి చెప్పారు. తమ కుటుంబ సభ్యుల తరహాలోనే అమేథీ ప్రాంత ప్రజలను చూసుకుంటామని, అది తమ బాధ్యత అని పేర్కొన్నారు. కిషోరి లాల్‌తో పాటు రాహుల్ సైతం అమేథీ తమ కుటుంబమని చెప్తూ ఉంటారని చెప్పిన ఆమె.. తాను అమేథీతో పాటు రాయ్‌బరేలీ కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటానని మాటిచ్చారు. కాగా.. కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీలో ఆ పార్టీ ఎన్నడూ ఓటమి చవిచూడలేదు. కానీ.. 2019లో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారు. ఈసారి కిషోరి లాల్ ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
Read Latest National News and Telugu News