Share News

Delhi Rainfall: వివాదాస్పదం.. ఎంపీని ఎత్తుకెళ్లి కార్లో కూర్చోబెట్టారు

ABN , Publish Date - Jun 28 , 2024 | 06:36 PM

ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల్లో ప్రగల్బాలు పలికే నేతల తీరు కొన్ని సందర్భాల్లో వివాదాస్పదమవుతోంది. తాజాగా దేశ రాజధానిలో ఓ ఎంపీ వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతున్నారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో భారీ వర్షాలు(Delhi Rainfall) కురుస్తున్నాయి.

Delhi Rainfall: వివాదాస్పదం.. ఎంపీని ఎత్తుకెళ్లి కార్లో కూర్చోబెట్టారు

ఢిల్లీ: ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల్లో ప్రగల్బాలు పలికే నేతల తీరు కొన్ని సందర్భాల్లో వివాదాస్పదమవుతోంది. తాజాగా దేశ రాజధానిలో ఓ ఎంపీ వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతున్నారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో భారీ వర్షాలు(Delhi Rainfall) కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఢిల్లీలోని తన అధికారిక నివాసం లోథి ఎస్టేట్ ప్రాంతం వద్ద మోకాళ్ల లోతు కూడా లేని నీటిలో నడిచేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో సిబ్బంది ఆయన్ను మోసుకువెళ్లి కారులో కూర్చోబెట్టారు. ఇదే వివాదాస్పదమైంది. సామాన్యులు ఇదే నీటిలో నడుస్తూ కష్టాలు పడాలి, కానీ పాలకులు నీటిలో కాలు కూడా మోపరా? అని ఆయన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. సదరు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


రోడ్లన్నీ జలమయం..

వర్షాలకు ఢిల్లీ మంత్రి ఆతిశీ ఇల్లు కూడా నీటిలో మునిగిపోయింది. తన ఇంట్లో వస్తువులన్నీ పాడైపోయాయని కాంగ్రెస్ నేత శశిథరూర్‌ వెల్లడించారు. ‘‘నిద్రలేచేసరికి అన్ని గదులు నీటితో నిండిపోయాయి. కార్పెట్స్‌, ఫర్నిచర్‌ సహా నేలమీద ఉన్న సామాన్లన్నీ పాడైపోయాయి. డ్రైనేజీలు మూసుకుపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. విద్యుత్ ప్రమాదాలను అరికట్టేందుకు కొన్ని గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు’’ అని శశిథరూర్ ఆవేదన వ్యక్తం చేశారు.


ఢిల్లీకి చెందిన ఓ బీజేపీ(BJP) నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. గత రెండు రోజులుగా దేశ రాజధానికి వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో రోడ్లపై మోకాళ్ల ఎత్తులో వర్షపు నీరు నిలిచింది. వరదలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీంతో బీజేపీ కౌన్సిలర్ రవీందర్ సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన ప్రదర్శన చేపట్టారు.

వరదల్లో ఓ చిన్న పడవ నడుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశ రాజధానిలో సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థే లేదని, కేజ్రీ సర్కార్ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు."అన్ని మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాకాలం ముందు వాటిని శుభ్రం చేయలేదు. ఒకవైపు వరదలు ముంచెత్తుతుంటే ఇంకోవైపు తాగు నీటి సమస్య తలెత్తుతోంది" అని రవీందర్ సింగ్ అన్నారు.

For Latest News and Tech News click here..

Updated Date - Jun 28 , 2024 | 06:36 PM