Share News

Poonam Pandey: పూనమ్ పాండే నువ్వు సూపర్.. బాలీవుడ్ నటిపై ప్రశంసలు

ABN , Publish Date - Feb 03 , 2024 | 02:17 PM

ఈ శుక్రవారం బాలీవుడ్ నటి పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయిందంటూ అంతటా వార్తలు వచ్చాయి. కొంతకాలంగా సర్వైకల్ న్యాన్సర్‌తో బాధపడుతున్న 32 ఏళ్ల పూనమ్ పాండే గురువారం రాత్రి మరణించినట్టు వార్తలు వైరల్‌గా మారాయి.

Poonam Pandey: పూనమ్ పాండే నువ్వు సూపర్.. బాలీవుడ్ నటిపై ప్రశంసలు

ఈ శుక్రవారం బాలీవుడ్ నటి పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయిందంటూ అంతటా వార్తలు వచ్చాయి. కొంతకాలంగా సర్వైకల్ న్యాన్సర్‌తో బాధపడుతున్న 32 ఏళ్ల పూనమ్ పాండే గురువారం రాత్రి మరణించినట్టు వార్తలు వైరల్‌గా మారాయి. శుక్రవారం ఉదయం ఆమె మెనేజర్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. దీంతో ఆమె అభిమానులు విషాదంలో మునిగిపోయారు. కానీ ఇంతలోనే శనివారం రోజున తాను బతికే ఉన్నానంటూ పూనమ్ పాండే ఒక వీడియోను విడుదల చేసింది. నానాటికీ ప్రమాదకరంగా మారిన సర్వైకల్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించేందుకే తాను ఇలా చేసినట్టు చెప్పుకొచ్చింది. శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో పూనమ్ పాండే ఏం చెప్పిందంటే.. ‘‘మీ అందరితో ఒక విషయం పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను ఎక్కడికి వెళ్లలేదు. బతికే ఉన్నాను. సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోలేదు. కానీ దాని వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాదు. దీనిని నివారించడం సాధ్యమే. దీనికి హెచ్‌పీవీ వ్యాక్సిన్ లేదా ముందస్తుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. సర్వైకల్ క్యాన్సర్‌తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా ఉండే మార్గాలున్నాయి. అందరికీ అవకాహన కల్పిద్దాం’’ అని చెప్పుకొచ్చింది.


దీంతో పూనమ్ పాండే చేసిన ఈ సాహసంపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. తన కెరీర్‌ను రిస్క్‌లో పెట్టి మరి ఆమె ఇలా చేసిందని కొనియాడుతున్నారు. పూనమ్ పాండే చర్యతో ప్రస్తుతం సర్వైకల్ క్యాన్సర్ అనేది పెద చర్చగా మారిందని చెబుతున్నారు. దీంతో సదరు క్యాన్సర్‌పై అందరికీ అవగాహన కల్గిందని అంటున్నారు. అనేక మంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షించబడతారని చెబుతున్నారు. కాగా పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయిందనే వార్తలు వచ్చినప్పటి నుంచి మీడియా, వార్తా పత్రికలు, డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో ఈ వ్యాధి గురించి విస్తృతంగా చర్చ సాగుతోంది. అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎలా సోకుతుంది. వ్యాధి లక్షణాలు ఏంటి? నివారణ మార్గాలు ఏంటనే విషయాలు అంతటా వైరల్‌గా మారాయి. దేశంలోని ప్రముఖ వార్తా సంస్థలన్నీ సర్వైకల్ క్యాన్సర్‌పై కథనాలు ప్రచురించాయి. దీంతో చాలా మంది ఈ వ్యాధి గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలోనే దీనంతటికి కారణమైన పూనమ్ పాండేను చాలా మంది ప్రశంసిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా పూనమ్ పాండేపై ప్రశంసలు కురిపించాడు. తన ఎక్స్ ఖాతా వేదికగా ఓ పోస్ట్ చేశాడు. ‘హేయ్.. పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌పై దృష్టిని మరల్చడానికి నువ్వు అవలంభించిన విధానం కొంత విమర్శలకు దారితీయవచ్చు. కానీ ఈ బూటకంతో నువ్వు సాధించిన దానిని, నీ ఉద్దేశాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్‌పై సర్వత్ర చర్చ నడుస్తోంది. ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. నీ ఆత్మ కూడా నీ అంత చాలా అందంగా ఉంది. నువ్వు చాలా ఎక్కువ కాలం, సంతోషంగా జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తున్నాను’’ రాసుకొచ్చాడు.

అయితే ఇదే సమయంలో పలువురి నుంచి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. పూనమ్ పాండే చేసిన పనిపై పలువురు మండిపడుతున్నారు. కాగా భారతీయ మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్‌ది రెండో స్థానం. ప్రపంచవ్యాప్తంగా ఇది 8వ స్థానంలో ఉంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 6,61,044 సర్వైకల్ క్యాన్సర్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,48,186 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా మహిళల్లో గర్భాశయం దిగువ భాగాన్ని సర్విక్స్ అని అంటారు. ఈ భాగంలో తలెత్తే క్యాన్సర్‌ను సర్వైకల్ క్యాన్సర్ అని పిలుస్తారు. క్యాన్సర్‌కు ముందు సర్విక్స్‌లోని కణాలు కొన్ని మార్పులు చెందిన క్యాన్సర్ కణాలుగా మారతాయి. చివరకు అవి సర్విక్స్‌ లోతుల్లోకి విస్తరించి వ్యాధి బారిన పడేలా చేస్తాయి. లైంగికంగా సంక్రమించే హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ-HPV) కారణంగా ఈ క్యాన్సర్ వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం లైంగికంగా యాక్టివ్‌గా ఉండే వారు ఏదో ఒక సమయంలో హెచ్‌పీవీ వైరస్‌ల బారిన పడతారు. మొత్తం 200 రకాల హెచ్‌పీవీ వైరస్‌లు ఉన్నాయి. సాధారణంగా ఈ వైరస్‌లను రోగనిరోధక శక్తి సులభంగానే నిరోధిస్తుంది. కానీ ప్రమాదకరమైన హెచ్‌పీవీ 16 లేదా హెచ్‌పీవీ 18 వైరస్‌ల బారినపడ్డ సందర్భాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇతర హెచ్‌పీవీ వైరస్‌‌లు మాత్రం క్యాన్సర్‌ను కలగచేయవు.

Updated Date - Feb 03 , 2024 | 02:24 PM