Telugu Desam: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. మళ్లీ టీడీపీలోకి కీలక నేత!
ABN , Publish Date - Aug 25 , 2024 | 07:23 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో టీడీపీ (Telugu Desam) కూటమి ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత, సీఎం నారా చంద్రబాబు తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలుగుదేశం పుట్టి, పెరిగిన గడ్డ తెలంగాణ కావడంతో పార్టీని బలోపేతం చేయడంతో పాటు అధికారంలోకి రావడమే నెక్స్ట్ టార్గెట్‌గా సీబీఎన్ దూసుకెళ్తున్నారు..! ఈ క్రమంలోనే ప్రతి 15 రోజులకోసారి..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో టీడీపీ (Telugu Desam) కూటమి ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత, సీఎం నారా చంద్రబాబు తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలుగుదేశం పుట్టి, పెరిగిన గడ్డ తెలంగాణ కావడంతో పార్టీని బలోపేతం చేయడంతో పాటు అధికారంలోకి రావడమే నెక్స్ట్ టార్గెట్‌గా సీబీఎన్ దూసుకెళ్తున్నారు..! ఈ క్రమంలోనే ప్రతి 15 రోజులకోసారి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నేతలు, ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓ వైపు పార్టీ బలోపేతానికి వ్యూహ రచన చేస్తూనే.. మరోవైపు పార్టీలో చేరికలపైనా దృష్టి పెట్టారు బాబు. ఆ మధ్య సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పసుపు కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారనే చర్చ పెద్ద ఎత్తున నడిచిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. తాజాగా ఓ సీనియర్ నేత, మాజీ మంత్రి సైకిలెక్కడానికి సర్వం సిద్ధం చేసుకున్నారనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో గట్టిగా నడుస్తోంది.
ఇదిగో.. ఈయనే!
టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్న సీనియర్ మరెవరో కాదండోయ్ బాబు మోహన్ (Babu Mohan). సినిమాల్లో, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. కొద్దిరోజులుగా రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. అభిమానులు, అనుచరుల కోరిక మేరకు మళ్లీ యాక్టివ్ కావాలని.. అది కూడా తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన తెలుగుదేశంలో చేరి సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నారట. ఈ క్రమంలోనే ఆదివారం నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు విచ్చేసిన నారా చంద్రబాబును బాబు మోహన్ కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరినప్పుడు, టీడీపీలో ఉన్నప్పుడున్న రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకుని ఆయన చాలా ఎమోషనల్ అయ్యారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే బాబు సమక్షంలోనే పసుపు కండువా కప్పుకుంటారని తెలియవచ్చింది. అధినేత ఈసారి ట్రస్ట్ భవన్‌కు వచ్చే సమయానికి పార్టీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారనే చర్చ కూడా నడుస్తోంది. ఇదే విషయాన్ని బాబు మోహన్ అనుచరులు, వీరాభిమానులు సైతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఇదే జరిగితే ఊహించని పరిణామమే..!
టీడీపీతోనే మొదలై..!
ఉమ్మడి ఖమ్మం జిల్లా బీరోలులో జన్మించిన బాబు మోహన్.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే సినిమాలపై ఉన్న ఆసక్తితో రాజీనామా చేసి హైదరాబాద్‌కు వచ్చేశారు. ‘ఈప్రశ్నకు బదులేదీ’లో తొలిసారి నటించి ఔరా అనిపించారు. ఆ తర్వాత ‘మామగారు’ చిత్రంలో యాచకుడి పాత్రలో హాస్యనటుడిగా నటించి మెప్పించి.. మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.. వరుస అవకాశాలతో స్టార్ కమెడియన్ అయ్యారు. చిన్నప్పట్నుంచీ నందమూరి తారకరామారావు (NTR)కు వీరాభిమాని అయిన బాబు మోహన్.. టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలిసారి మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అంతేకాదు.. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పదవి దక్కించుకున్నారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన దామోదర్ రాజనర్సింహా చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల రీత్యా.. టీడీపీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో ఇదే ఆందోల్ నుంచి పోటీచేసి రాజనర్సింహాపై 3,291 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
అటు తిరిగి.. ఇటు తిరిగి!
2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ టికెట్ ఇవ్వకపోయే సరికి కారు దిగేసి కాషాయ పార్టీలో చేరిపోయారు. బీజేపీ తరఫున ఆందోల్ నుంచి పోటీచేసి బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. మూడో స్థానానికి అది కూడా 2,404 ఓట్లకే పరిమితం కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత బీజేపీ హైకమాండ్‌తో పడకపోవడం, 2023 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో 2023 ఫిబ్రవరి-07న పార్టీకి రాజీనామా చేసి.. మార్చి-04న కేఏపాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీలో చేరారు. కొద్దిరోజులు పార్టీ తరఫున హడావుడి చేసిన బాబు మోహన్ ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయి.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ప్రత్యక్షమయ్యారు. చూశారుగా.. అటు టీడీపీతో మొదలై బీఆర్ఎస్, బీజేపీ, ప్రజాశాంతి పార్టీల మీదుగా తిరిగి తెలుగుదేశంలోకే వచ్చి చేరుకోబోతున్నారన్న మాట. ఒకవేళ ఈ చేరిక నిజమైతే ఈయనకు ఏమైనా కీలక పదవి దక్కే అవకాశం ఉందా..? లేదా అనేది చూడాలి మరి.