Share News

IND vs ENG: జోరూట్ రికార్డును బద్దలుకొట్టిన రోహిత్.. డివిలియర్స్‌తో సమంగా..

ABN , Publish Date - Feb 15 , 2024 | 10:03 PM

ఇంగ్లండ్‌తో మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుతంగా ఆడిన హిట్‌మ్యాన్ జట్టును ఆదుకున్నాడు.

IND vs ENG: జోరూట్ రికార్డును బద్దలుకొట్టిన రోహిత్.. డివిలియర్స్‌తో సమంగా..

రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుతంగా ఆడిన హిట్‌మ్యాన్ జట్టును ఆదుకున్నాడు. రవీంద్ర జడేజాతో కలిసి నాలుగో వికెట్‌కు 204 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సెంచరీతో చెలరేగిన రోహిత్ 14 ఫోర్లు, 3 సిక్సులతో 131 పరుగులు చేశాడు. టెస్టుల్లో రోహిత్‌కు ఇది 11వ సెంచరీ. అన్ని ఫార్మాట్లలో కలిపి 47వ సెంచరీ. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. జో రూట్ 46 సెంచరీలు చేయగా.. 47 సెంచరీలతో రోహిత్ అతడిని అధిగమించాడు. అలాగే 47 సెంచరీలు చేసిన దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌తో సమంగా నిలిచాడు. డివిలియర్స్ టెస్టుల్లో 22, వన్డేల్లో 25 సెంచరీలు చేయగా.. రోహిత్ శర్మ టెస్టుల్లో 11, వన్డేల్లో 31, టీ20ల్లో 5 సెంచరీలు చేశాడు. జోరూట్ విషయానికొస్తే టెస్టుల్లో 30, వన్డేల్లో 16 సెంచరీలు చేశాడు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రాజ్‌కోట్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. వరుస ఓవర్లలో యశస్వీ జైస్వాల్(10), శుభ్‌మన్ గిల్‌ను ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ పెవిలియన్ చేర్చాడు. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన్ గిల్ ఈ సారి డకౌట్ అయ్యాడు. రజత్ పటీదార్‌ను టామ్ హార్ట్‌లీ ఔట్ చేశాడు. ఇలాంటి సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, లోకల్ బాయ్ రవీంద్ర జడేజా జట్టును ఆదుకున్నారు. తొలి సెషన్‌లో వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. క్రీజులో కుదురుకున్న రోహిత్ శర్మ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. రెండో సెషన్‌లో రోహిత్ శర్మ సెంచరీ, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో చెలరేగారు. టెస్టు కెరీర్‌లో హిట్‌మ్యాన్‌కు ఇది 11వ సెంచరీ. ఈ క్రమంలో వీరి భాగస్వామ్యం కూడా 100 పరుగులు దాటింది. దీంతో రెండో సెషన్‌లో ఇంగ్లండ్‌కు ఒక వికెట్ కూడా దక్కలేదు.

మూడో సెషన్‌లో రోహిత్, జడేజాల భాగస్వామ్యం 200 దాటింది. ఇలాంటి సమయంలో సెంచరీ హిరో రోహిత్ శర్మను మార్కు వుడ్ ఔట్ చేశాడు. దీంతో 204 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 196 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 14 ఫోర్లు, 3 సిక్సులతో 131 పరుగులు చేశాడు. మొత్తంగా 237 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. వన్డే స్టైలులో చెలరేగాడు. జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించాడు. అయితే 82వ ఓవర్లో సర్ఫరాజ్ ఖాన్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. దీంతో 314 పరుగులకు టీమిండియా సగం వికెట్లు కోల్పోయింది. 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 66 బంతుల్లోనే సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగులు చేశాడు. అనంతరం రవీంద్ర జడేజా తన టెస్ట్ కెరీర్‌లో నాలుగో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 7 ఫోర్లు, 2 సిక్సులతో 198 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్నాడు. ఆ తర్వాత జడేజా, కుల్దీప్ యాదవ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. కాగా మొత్తంగా తొలి రోజు ఆట 86 ఓవర్లపాటు సాగింది.

Updated Date - Feb 15 , 2024 | 10:03 PM