Share News

Karimanagar: సింగరేణి అక్రమాలపై.. సీబీఐ విచారణ కోరే దమ్ముందా..?

ABN , Publish Date - Jun 22 , 2024 | 04:16 AM

సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా..? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు.

Karimanagar: సింగరేణి అక్రమాలపై.. సీబీఐ విచారణ కోరే దమ్ముందా..?

  • సంస్థ ప్రైవేటీకరణపై పార్టీల దుష్ప్రచారం.. మోదీ వల్లే యోగాకు ఖ్యాతి: బండి సంజయ్‌

కరీంనగర్‌/హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ఇల్లందకుంట: సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా..? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. సింగరేణిలో అవినీతిపై సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తేలేదని ప్రధాని మోదీ ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. సంస్థలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతం ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరించడం అసాధ్యమని స్పష్టం చేశారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సంజయ్‌ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ కుటుంబం సింగరేణిలో అంతులేని అవినీతి చేసిందని.. కాంగ్రెస్‌ కూడా అదే బాటలో నడుస్తోందని సంజయ్‌ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ కృషి వల్లే అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. యోగాతో అన్ని రోగాలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. కాగా, కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంటలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం సంజయ్‌ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎ్‌సలో గూండాయిజం, కబ్జాలు చేసినోళ్లను కాంగ్రె్‌సలో చేర్చుకుంటున్నారని విమర్శించారు.


సింగరేణి ప్రైవేటీకరణకు కేసీఆర్‌ యత్నం: ఎస్‌.కుమార్‌

సింగరేణిని ప్రైవేటీకరించేందుకు మాజీ సీఎం కేసీఆర్‌ ప్రయత్నించారని.. అందులో భాగంగానే బొగ్గు గనుల వేలంలో పాల్గొనేందుకు ఆయన సింగరేణికి అనుమతి ఇవ్వలేదని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌ విమర్శించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కుమార్‌ మాట్లాడారు. కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరించబోతోందని ఎన్నికల ముందు కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల ఫలితాలపై త్వరలో సమీక్షలు నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Jun 22 , 2024 | 04:16 AM