Share News

Hyderabad: రూ.250 కోట్ల సంస్థను కాజేసేందుకు యత్నించారు..

ABN , Publish Date - Jul 05 , 2024 | 04:41 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో జైల్లో ఉన్న టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావును జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనను బెదిరించి, కొట్టించి రూ.250కోట్ల విలువైన సంస్థను రాయించుకునే ప్రయత్నం చేసినట్లు బాఽధితుడు చెన్నుపాటి వేణుగోపాల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Hyderabad: రూ.250 కోట్ల సంస్థను కాజేసేందుకు యత్నించారు..

  • రాధాకిషన్‌పై క్రియా హెల్త్‌ కేర్‌ డైరెక్టర్‌ ఫిర్యాదు

  • ఆయన సహా 9మందిపై కేసు

హైదరాబాద్‌ సిటీ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో జైల్లో ఉన్న టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావును జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనను బెదిరించి, కొట్టించి రూ.250కోట్ల విలువైన సంస్థను రాయించుకునే ప్రయత్నం చేసినట్లు బాఽధితుడు చెన్నుపాటి వేణుగోపాల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రాధాకిషన్‌ రావును పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకొని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్‌ విధించడంతో తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. తన సంస్థలోని సహ డైరెక్టర్లతో కలిసి రాధాకిషన్‌ రావు తనను అక్రమంగా నిర్బంధించి షేర్లు బదిలీ చేయించుకున్నారంటూ క్రియా హెల్త్‌ కేర్‌ సంస్థ వ్యవస్థాపకుడు చెన్నుపాటి వేణుగోపాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఈ మేరకు టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావుతోపాటు మరో 8మందిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 2011లో క్రియా హెల్త్‌కేర్‌ను వేణుగోపాల్‌ ప్రారంభించారు. అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో కలిసి 165హెల్త్‌కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఐదేళ్లలో సంస్థ టర్నోవర్‌ను రూ.250 కోట్లకు చేర్చారు. ఉత్తరప్రదేశ్‌ హెల్త్‌కేర్‌ సెంటర్ల ప్రాజెక్ట్‌ వచ్చిన సమయంలో సీఈవోగా బాలాజీ అనే వ్యక్తిని.. పార్ట్‌టైం డైరెక్టర్‌లుగా గోపాల్‌, రాజ్‌, నవీన్‌, రవిని నియమించుకున్నారు. కొన్నాళ్లకు వారందరూ ఏకమై సంస్థ షేర్లు తమపేరున మార్చాలని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.


సమస్యను పరిష్కరించుకోవడానికి తనకు పరిచయమున్న చంద్రశేఖర్‌కు షేర్లు విక్రయించానని, కానీ అతడు సంస్థ డైరెక్టర్లతో కుమ్మక్కై కంపెనీని స్వాధీనం పరుచుకునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. అప్పటి టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాఽధాకిషన్‌రావు ఎస్సైల సాయంతో తనను కిడ్నాప్‌ చేశారని, సంస్థ షేర్లు తన పేరున రాయించుకునేందుకు చిత్ర హింసలకు గురిచేశారని ఫిర్యాదులో వెల్లడించారు. మీడియాకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారని, రూ.10 లక్షలు టాస్క్‌ఫోర్స్‌ బృందానికి ఇచ్చానని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు రాధాకిషన్‌ రావును అరెస్ట్‌ చేయడంతోపాటు, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Updated Date - Jul 05 , 2024 | 04:41 AM