Share News

Harish Rao: భోజన బిల్లులు 5 నెలలుగా పెండింగ్‌..

ABN , Publish Date - Jul 09 , 2024 | 02:09 AM

సర్కారు బడుల్లో నెలకొన్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే.. అసలు సమస్యలే లేవన్నట్లుగా విద్యా శాఖ ప్రకటించడం సరికాదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. వాస్తవాలను మరుగున పెడితే ఎలా..? అని ప్రశ్నించారు.

 Harish Rao: భోజన బిల్లులు 5 నెలలుగా పెండింగ్‌..

  • కోడిగుడ్ల బిల్లులూ రావట్లేదు..

  • బడికి ఉచిత విద్యుత్‌ ఏమైంది?: హరీశ్‌

హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : సర్కారు బడుల్లో నెలకొన్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే.. అసలు సమస్యలే లేవన్నట్లుగా విద్యా శాఖ ప్రకటించడం సరికాదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. వాస్తవాలను మరుగున పెడితే ఎలా..? అని ప్రశ్నించారు. ఇవే సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని నిర్ధారించేందుకు తన నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన తర్వాత.. తాను గుర్తించిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు హరీశ్‌రావు వెల్లడించారు. వంట మనిషితో పాటు సహాయకులుగా పనిచేసే వారికి చెల్లించే రూ.3 వేల గౌరవ వేతనం గతేడాది డిసెంబరు వరకే వచ్చిందని.. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చ్‌, ఏప్రిల్‌, జూన్‌ నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. 9, 10 తరగతులకు సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు జనవరి వరకు మాత్రమే వచ్చాయని, ఆ తర్వాత నాలుగు నెలలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు.


ఒకటి నుంచి 8వ తరగతి వరకు సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు ఏప్రిల్‌ వరకు వచ్చాయని, జూన్‌ నెల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. కోడిగుడ్డు బిల్లులు జనవరి వరకు మాత్రమే వచ్చాయని, ఫిబ్రవరి, మార్చ్‌, ఏప్రిల్‌, జూన్‌ నెలలకు సంబంధించి బిల్లులు రాలేదని చెప్పారు. సర్వశిక్ష అభియాన్‌, ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ పర్సన్ల వేతనాలు మే వరకే వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ కోసం ప్రతి నెలా రూ.10 వేలు విడుదల చేయాలని, నిలిచిపోయిన సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని కోరారు.

Updated Date - Jul 09 , 2024 | 02:09 AM