Share News

CM Revanth Reddy: గ్రూప్ -1 ఉద్యోగుల పాపం మీదే.. సీఎం రేవంత్ విసుర్లు

ABN , Publish Date - Dec 02 , 2024 | 06:35 PM

యువత బలిదానాలతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. లక్షలాదిమంది ఉద్యమబాట పట్టి తెలంగాణను సాధించుకున్నారని అన్నారు. టీజీపీఎస్సీని సమూల ప్రక్షాళన చేశామని చెప్పారు. యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: గ్రూప్ -1 ఉద్యోగుల పాపం మీదే.. సీఎం రేవంత్ విసుర్లు

హైదరాబాద్: ప్రజాపాలనకు ఏడాది పూర్తయిందని.. తమ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆరోగ్య ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. ఆరోగ్య ఉత్సవాలను ఇవాళ(సోమవారం) సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. 213 నూతన అంబులెన్సులను ప్రారంభించారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 108 కోసం 136, 102 కోసం77 అంబులెన్స్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వేలాదిగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేశామని గుర్తుచేశారు. వైద్యాఆరోగ్య శాఖలో 7,750 మందిని నియమించామని చెప్పారు. మరో 6,496 ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. వైద్యారోగ్యశాఖ బలోపేతమైతేనే ఆరోగ్య తెలంగాణ సాధ్యమన్నారు. 16 నర్సింగ్‌ కాలేజ్‌లను ప్రారంభించుకుంటున్నామని చెప్పారు. 28 పారా మెడికల్ కాలేజ్‌లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 8 మెడికల్‌ కాలేజ్‌లకు జీఓలు ఇచ్చినా.. కనీస మౌలిక సదుపాయాల కల్పనలో చిత్తశుద్ధి చూపించలేదని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.


50 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టాం...

‘‘ఉద్యోగాల కల్పనలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైంది. మేం అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలోనే.. 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాం. దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా నియామకాలు చేపట్టాం. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి నియామకాలే చేపట్టాం. డీఎస్సీ ద్వారా 55 రోజుల్లో 11 వేలమందికి ఉద్యోగాలు ఇచ్చాం. గ్రూప్‌-1 పరీక్షపై కొందరు అనవసర రాద్ధాంతం చేశారు. పరీక్షలు ఎందుకు వాయిదా వేయలేదంటూ నన్ను తిట్టారు.ప రీక్షలు వాయిదా పడితే నిరుద్యోగుల ఆత్మహత్యలకు దారితీస్తుంది.. పరీక్షలు వద్దంటూ ఓ పార్టీ కృత్రిమ ఉద్యమాన్ని నడిపించింది. గత పదేళ్ల పాటు నిరుద్యోగులకు గ్రూప్‌-1 ఉద్యోగాలు రాలేదు. ప్రశ్నాపత్రాలు జిరాక్స్‌ సెంటర్లలో అమ్ముకున్నారు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.


యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ

‘‘యువత బలిదానాలతో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. లక్షలాదిమంది ఉద్యమబాట పట్టి తెలంగాణను సాధించుకున్నారు. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు. కానీ పదేళ్లపాటు నియామకాలు చేపట్టలేదు. ఓ కుటుంబం ఉద్యోగాలు పోయాకే యువతకు ఉద్యోగాలు వచ్చాయి. టీజీపీఎస్సీ చైర్మన్‌గా గతంలో డీజీపీ స్థాయి అధికారి ఉంటే.. ఇప్పుడు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఉన్నారు. టీజీపీఎస్సీని గతంలో పునరావాస కేంద్రంగా మార్చారు. మేము రాగానే ఉన్నత విద్యావంతులు, నిపుణులతో.. టీజీపీఎస్సీని సమూల ప్రక్షాళన చేశాం. యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించాం. అగమ్యగోచరంగా మారిన విద్య, వైద్య శాఖలను గాడిలో పెడుతున్నాం. గతంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండేదికాదు. పేదలకు మెరుగైన వైద్యం అందించిన చరిత్ర కాంగ్రెస్‌ది. పేదల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా 11 నెలల్లో రూ.830 కోట్లు ఖర్చు చేశాం’’ అని సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రకటించారు.


ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నారు

‘‘ఏడాదిలో వైద్య ఆరోగ్య శాఖలో 14 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. 7750 మంది పారామెడికల్ సిబ్బందికి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశాం. ఉద్యోగ,ఉపాధి కోసం తెలంగాణ ఉద్యమంలో యువత రోడ్లపైకి వచ్చి పోరాడారు. కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకుండా,పరీక్షలు పెట్టకుండా ప్రశ్నా పత్రాలను అమ్ముకుంది. కేసీఆర్ ఇంట్లో వాళ్లను ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేస్తే తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చాయి. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఒకే ఏడాది 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు. దేశంలో తెలంగాణ గొప్ప చరిత్ర సృష్టించింది. డీఎస్సీ వాయిదా వేయాలని రాజకీయ ప్రేరేపిత కృత్రిమ ఆందోళన చేశారు. ఎవరు అడ్డుపడినా డీఎస్సీ పరీక్షలు నిర్వహించి 55 రోజుల్లో నియామక పత్రాలు అందించాం. తెలంగాణ యువత పట్ల మాకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలని కోర్టులకు వెళ్లినా న్యాయస్థానాలు సమర్థించలేదు.2011 తర్వాత గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదు. 13 ఏళ్ల తర్వాత గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి ప్రశ్నా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  ఛైర్మన్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 563 మంది గ్రూప్ 1 అధికారులు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరుకు ఇది గీటు రాయి. మూడున్నరేళ్ల సర్వీస్ ఉన్నప్పటికి బుర్రా వెంకటేశాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా నియమించాం..గత ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను మార్చింది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. 


50 లక్షల కుటంబాలకు ఉచిత విద్యుత్‌

‘‘ఆర్ఎంపీ డాక్టర్లు, డిప్యూటీ ఎమ్మార్వో లను  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించారు..  ఉన్నత చదువులు చదువుకున్న వారిని మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించింది..పదేళ్ల పాటు రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్‌లర్లను నియమించలేదు. ఆరోగ్య శ్రీ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసింది. మా ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది..ఏడాది కాలంలో రూ. 835 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రజలకు ఇచ్చాం.. ఇదొక రికార్డు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటి వరకు కోటి 15 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. 50 లక్షల కుటంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం..  మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. రుణ మాఫీ, రైతు భరోసాతో కొంత మంది గుండెల్లో పిడుగులు పడుతున్నాయి. గత పాలకులు వరి వేసుకుంటే ఉరేనని అన్నారు. మా ప్రభుత్వం సన్న వడ్లకు రూ. 500లు బోనస్ ఇస్తోంది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.


వడ్లకు బోనస్‌

‘‘తెలంగాణ రైతులు 63 లక్షల ఎకరాల్లో కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించారు. సన్న వడ్లకు ఇస్తున్న బోనస్‌తో కౌలు రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. వచ్చే పదేళ్లు మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది.. బోనస్ కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగకు వచ్చే గంగిరెద్దుల్లా కొందరు స్థానిక సంస్థల ఎన్నికల కోసం వస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, 15 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ప్రభుత్వాన్ని బదనాం చేసేవారికి కర్రు కాల్చి వాత పెట్టాలి. ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజలదే. ప్రభుత్వం పైన జరుగుతున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలి...పదేళ్ల పాటు అధికారంలో ఉండి జయ జయహే పాటను జాతికి అంకితం చేయకపోవడం ద్రోహం కాదా... తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్‌లో పెట్టే ఆలోచన కూడా గత పాలకులకు రాలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గత పాలకులు నెరవేర్చలేదు.. తెలంగాణ ప్రభుత్వ ఏడాది విజయోత్సవాలకు ప్రజలు తరలిరావాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - Dec 02 , 2024 | 07:04 PM