TS Politics: హై కమాండ్ అలా అంటే.. నేను సిద్ధమే.. ఏఐసీసీ నేత సంపత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 02 , 2024 | 04:15 PM
పదేళ్లలో మోదీ సర్కార్ వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించిందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్( Sampath) అన్నారు. కనీసం ఇప్పుడైనా విభజన హామీలను మోదీ సర్కార్ నెరవేర్చలేదని అన్నారు.

హైదరాబాద్: పదేళ్లలో మోదీ సర్కార్ వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించిందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్( Sampath) అన్నారు. శుక్రవారం నాడు ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ...కనీసం ఇప్పుడైనా విభజన హామీలను మోదీ సర్కార్ నెరవేర్చలేదన్నారు. మూసీ నది ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి సమస్యను విన్నవించినా ప్రధాని మోదీ కనికరించలేదని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ దిగిపోతేనే విభజన హామీలు అమలవుతాయని తెలిపారు. తనకు ఎంత చేయాలో కాంగ్రెస్ అంత చేసిందని.. పార్టీకి తానే బాకీ ఉన్నానని అన్నారు. పార్టీ ఎక్కడి నుంచి ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అధిష్ఠానం సర్పంచిగా పోటీ చేయమన్నా పోటీ చేస్తానని సంపత్ కుమార్ తెలిపారు.
కేంద్ర బడ్జెట్ తెలంగాణ పాలిట శాపంగా ఉందన్నారు. తెలంగాణ బీజేపీ నాయకులకు సిగ్గు, శరం లేదని.. బడ్జెట్‌లో అన్యాయం జరిగినా కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ గడ్డపై అడుగుపెట్టే అర్హత మోదీ కోల్పోయారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరాశకు గురిచేసిందన్నారు. నిత్యవసర అంశాలపై రాయితీలను తగ్గించారని.. ఒక్క యునివర్సిటీకి కూడా బడ్జెట్ పెంచలేదని దుయ్యబట్టారు. విద్యారంగంలో కోతలు విధించారని.. నదుల అనుసంధానం లాంటి గొప్పగా చెప్పుకునే అంశాల్లో కూడా మోదీ కోతలు పెట్టారని సంపత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.