Mallikarjuna Kharge: తెలంగాణలో లోక్‌సభ సీట్లెందుకు తగ్గాయ్..!?
ABN , Publish Date - Jun 20 , 2024 | 03:39 AM
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రె్‌సకు అంచనాల కంటే తక్కువ సీట్లు రావడానికి గల కారణాలను విశ్లేషించేందుకు నిజనిర్ధారణ కమిటీని ఏఐసీసీ నియమించింది. పార్టీ జాతీయ నాయకులు పీజే కురియన్, రఖిబుల్ హుసేన్, పర్గత్‌సింగ్‌లను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది.
నిజనిర్ధారణ కమిటీని నియమించిన ఏఐసీసీ
హైదరాబాద్, జూన్ 19(ఆంధ్రజ్యోతి): ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రె్‌సకు అంచనాల కంటే తక్కువ సీట్లు రావడానికి గల కారణాలను విశ్లేషించేందుకు నిజనిర్ధారణ కమిటీని ఏఐసీసీ నియమించింది. పార్టీ జాతీయ నాయకులు పీజే కురియన్, రఖిబుల్ హుసేన్, పర్గత్‌సింగ్‌లను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఛత్తీ్‌సగఢ్, ఒడిసా, కర్నాటక, తెలంగాణ, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో పార్టీ పనితీరు పేలవంగా ఉందని ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్దారణకు వచ్చారు. ఈ పేలవమైన పనితీరు పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో వైఫల్యానికి గల కారణాలను ఆరా తీసేందుకు నిజనిర్థారణ కమిటీలను నియమిస్తూ బుధవారంనాడు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే తెలంగాణకు సైతం త్రిసభ్య కమిటీని నియమించింది. వాస్తవానికి తెలంగాణలో 14 సీట్ల వరకూ వస్తాయని ఏఐసీసీ పెద్దలు అంచనా వేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లను దక్కించుకున్న టీ కాంగ్రెస్.. అంచనాలను అందుకోలేక పోయింది. అయితే బీఆర్‌ఎస్... వివిధ నియోజక వర్గాల్లో తన ఓటు బ్యాంకును భారీ ఎత్తున బీజేపీకి బదిలీ చేసిందని, అందుకే ఈ మేరకు ఫలితాలు వచ్చాయని అధిష్ఠానానికి రాష్ట్ర నాయకత్వం వివరణ ఇచ్చింది. అయితే, పార్టీ సంప్రదాయం ప్రకారం నిజానిజాలను తేల్చేందుకు కమిటీలను ఏఐసీసీ నియమించింది.