Hyderabad: రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే.. ‘సింగరేణి’పై విచారణ జరిపించాలి
ABN , Publish Date - Jun 23 , 2024 | 04:07 AM
సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో జరిగిన ఆర్థిక విధ్వంసం, దోపిడీ, రాజకీయ జోక్యంపై న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
సింగరేణి దివాలాకు కేసీఆర్, ఆయన కుటుంబం కారణం
మితిమీరిన జోక్యంతో అప్పుల పాలు చేశారు
గనుల వేలాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నాం
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
సంగరేణి దివాలాకే బొగ్గు బ్లాకుల వేలం: సీపీఎం
28, 29 తేదీల్లో ధర్నాకు పిలుపు
కొత్తగూడెం, భూపాలపల్లిలో సీఐటీయూ నిరసనలు
గత పాలకుల అక్రమాలను నిగ్గు తేల్చాలి
పారదర్శకంగా గనుల వేలం: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో జరిగిన ఆర్థిక విధ్వంసం, దోపిడీ, రాజకీయ జోక్యంపై న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘‘సింగరేణిలో ఎంత భూ దోపిడీ జరిగింది..? సీఎ్‌సఆర్ నిధులు ఎక్కడెక్కడ వినియోగించారు..? సంస్థ బిల్లులు విలాసవంతమైన కార్యక్రమాలకు ఎలా వినియోగించారు..? వంటి వాటిపై సమగ్ర దర్యాప్తు జరపాలి. సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం ఉంది. కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రిగా ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తా’’ అని అన్నా రు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిం గరేణిపై కేసీఆర్ కుటుంబం మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. పదేళ్ల కిందట రూ.3,500 కోట్ల డిపాజిట్లతో ఉన్న సింగరేణిని దివాళా దశకు చేర్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. 2015లో సింగరేణికి ఒడిశాలోని నైనీ బ్లాకును మంజూరు చేస్తే ఆ రాష్ట్ర సీఎంతో ఎందుకు చర్చించలేదని కేసీఆర్‌ను నిలదీశారు.
బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టేందుకు అప్పటి ఒడిశా సీఎంతో చర్చించేందుకు సమయం ఉంటుంది గానీ.. నైనీ బ్లాక్ గురించి మాట్లాడేందుకు కేసీఆర్‌కు సమయం దొరకలేదని విమర్శించారు. ‘‘కేసీఆర్ కుటుంబం, బీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సింగరేణిలో విపరీతమైన రాజకీయ జోక్యం చేసుకున్నారు. ఎవరికి తోచినంత వాళ్లు దోచుకున్నారు. కేసీఆర్ మితిమీరిన జోక్యంతో సింగరేణిని అప్పులపాలు చేశారు. సింగరేణి అధికారులు ఫైళ్లతో కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చారు. కేసీఆర్ కుటుంబం సింగరేణిని రాజకీయ క్షేత్రంగా వాడుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రూ.30వేల కోట్లు బకాయి పడింది. ఈ పాపం బీఆర్‌ఎ్‌సదే. సింగరేణి పురోగతిపై త్వరలో సమీక్ష నిర్వహిస్తాం’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.
అంతా పారదర్శకమే..
‘‘సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా అవినీతికి తావులేకుండా, పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం వేస్తోంది. ఇప్పటి వరకు 9 రౌండ్లలో 107 బొగ్గు గనుల వేలం జరిగింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సుమారు రూ.37 వేల కోట్ల ఆదాయం వచ్చింది. గనుల వేలం ద్వారా వచ్చే రాయల్టీలో కేంద్రం రూపాయి కూడా తీసుకోదు. ఒడిశాలో ఏటా రూ.36 వేల కోట్ల చొప్పున అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ వస్తోంది. తెలంగాణలో కూడా నాలుగు సున్నపురాయి గనులకు సంబంధించి వేలం నిర్వహించాలని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని 2016 నుంచే కోరు తూ వస్తోంది. అయితే, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ ప్రక్రియను చే పట్టకపోవడం వల్ల రూ.2,500కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఆ వేలాన్ని నిర్వహించాలని కాంగ్రె స్ ప్రభుత్వాన్ని కోరాం. తెలంగాణలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సర్వే జరుపుతాం. బొగ్గు ఉత్పత్తిని పెంచుకునేలా, ఉపాధి అవకాశాలను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటాం. నీట్ పేపర్ ఎక్కడా లీక్ కాలేదు. ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
హామీలను విస్మరించిన కాంగ్రెస్..
‘‘అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగ నియామకాలు చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ విస్మరించింది. 6 గ్యారెంటీలకే గ్యారెంటీ లేకుండా పోయింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా హామీలను తుంగలో తొక్కారు. విద్యార్థి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేస్తే విచక్షణారహితంగా పోలీసులు దాడి చేయడం సరికాదు’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.
కేసీఆర్ ఇంటికి ఈడీ రాక తప్పదు: రఘునందన్
గొర్రెల పంపిణీ స్కాంలో కేసీఆర్ ఇంటికి ఈడీ రాక తప్పదని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. గొర్రెల స్కాం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇరుక్కున్న అధికారులంతా కేసీఆర్ పేరే చెబుతున్నారని తెలి పారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు కప్పర ప్రసాద్‌రావు అధ్యక్షతన శనివారం జరిగిన మీట్ ద ప్రెస్‌లో రఘునందన్ మాట్లాడారు. బీఆర్‌ఎస్.. టైటానిక్ షిప్‌లా చరిత్రలో మిగిలిపోనుందని అన్నారు. ఐటీఐఆర్ గురించి, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి అవగాహన లేదని ఆయన విమర్శించారు.
రేపు కీలక ఖనిజ గనుల మొదటి విడత బిడ్డర్ల పేర్ల వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 22: కీలకమైన, వ్యూహాత్మక ఖనిజ గనుల వేలం మొదటి విడతలో భాగంగా గనులను సొంతం చేసుకున్న బిడ్డర్ల పేర్లను కేంద్రం సోమవారం ప్రకటించనుంది. ఇలాంటి గనులకు సంబంధించిన నాలుగో విడత వేలం ప్రారంభం సందర్భంగా బిడ్డర్ల పేర్లను ప్రకటించాలని నిర్ణయించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆ శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే ఇక్కడ కీలక, వ్యూహాత్మక ఖనిజ గనుల నాలుగో విడత వేలాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమంలో మొదటి విడతలో గనులు గెలుచుకున్న బిడ్డర్ల పేర్లను ప్రకటించనున్నట్టు గనుల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. మొదటి విడతలో అమ్మకానికి పెట్టిన 20 గనుల్లో 13 గనుల వేలాన్ని ఇంతకు ముందు ప్రభుత్వం రద్దు చేసింది. ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడమే ఇందుకు కారణం. 20 గనులను వేలానికి పెట్టగా 18 గనులకు 56 ఫిజికల్, 56 ఆన్‌లైన్ బిడ్స్ వచ్చాయి. రద్దు చేసిన 11 బ్లాకుల్లోని ఏడు బ్లాకులను మూడో విడత కింద వేలానికి నోటిఫై చేశారు. ఇక రెండో విడత వేలంలో ఆరు గనులను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేశారు. కీలకమైన గనులు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధితోపాటు దేశ ఖనిజ భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయి.