Hyderabad: అదానీ సంస్థకు విద్యుత్తు బాధ్యత!
ABN , Publish Date - Jun 29 , 2024 | 03:09 AM
విద్యుత్తు సంస్థలకు మోయలేని భారంగా మారుతున్న బకాయిలు, నష్టాలను తగ్గించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో భారంగా మారిన పలు సర్కిళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే యోచనలో ఉంది.
సరఫరా నుంచి బిల్లుల జారీ వరకు
నష్టాల నుంచి తప్పించుకునేందుకే..!
అప్పగించే యోచనలో ఎస్‌పీడీసీఎల్?
హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లో అమలు
ఢిల్లీలో సూచనప్రాయంగా సీఎం వెల్లడి
హైదరాబాద్ సిటీ, జాన్ 28(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు సంస్థలకు మోయలేని భారంగా మారుతున్న బకాయిలు, నష్టాలను తగ్గించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో భారంగా మారిన పలు సర్కిళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే యోచనలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో అధిక నష్టాలు మూటగట్టుకుంటున్న దక్షిణ సర్కిల్ బాధ్యతను ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీకి చెందిన సంస్థకు ఇవ్వనున్నట్లు స్పష్టమైంది. ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. హైదరాబాద్ పాత బస్తీలో విద్యుత్తు బిల్లుల వసూలును అదానీ కంపెనీకి ఇచ్చామని, భూగర్భ లైన్లు వేసి అక్కడ మొత్తం వ్యవస్థను మార్చాలని కోరామని తెలిపారు. ఈ నేపథ్యంలో నష్టాలు ఎక్కువగా వస్తున్న సర్కిళ్లను ప్రైవేటుకు అప్పగిస్తారని ఖాయమైంది. అయితే, విద్యుత్తు సరఫరా, లైన్ల నిర్వహణ, మీటర్ రీడింగ్, బిల్లుల జారీ, వసూళ్లు.. ఇలా అన్నింటిలోనూ పైవ్రేట్ వ్యవస్థను భాగస్వామ్యం చేస్తారా? బిల్లుల జారీ, వసూళ్ల వరకేనా? అన్నది తెలియాల్సి ఉంది.
బకాయిలు అధికం
గ్రేటర్ హైదరాబాద్‌లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో గృహ/వాణిజ్య విభాగంలో 60 లక్షల విద్యుత్తు కనెక్షన్లున్నాయి. ప్రతి నెల బిల్లుల రూపంలో రూ.900 కోట్లు వసూలవుతుంటాయి. గత మే నెల నాటికి రూ.380 కోట్ల బకాయిలు పేరుకున్నాయి. వీటిలో అత్యధికంగా హైదరాబాద్ దక్షిణ సర్కిల్‌లో రూ.83.4 కోట్లు, రాజేంద్రనగర్‌లో రూ.63.8 కోట్లు చెల్లించాల్సి ఉంది. హబ్సిగూడలో రూ.48.3 కోట్లు, హైదరాబాద్ సెంట్రల్‌లో రూ.45.4 కోట్లు, సైబర్ సిటీలో రూ.45.4 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటితోపాటు 41 శాతం నష్టాలు దక్షిణ సర్కిల్‌లోనే నమోదవుతున్నాయి. అయినా, వాటిని నియంత్రించడానికి విద్యుత్తు సంస్థలు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. బిల్లుల వసూళ్ల కోసం ఇళ్లకు వెళ్లిన సిబ్బందిపై దాడులు జరిగినా ఉన్నతాధికారులు పట్టించుకోరనే ఆరోపణలున్నాయి. గతంలో పలువురు ఇంజనీర్లు, సిబ్బంది దక్షిణ సర్కిల్‌లో తాము పని చేయలేం అని, బదిలీ చేయాలని లేఖలు రాయడం పరిస్థితికి అద్దం పడుతోంది.
ఇదీ హైదరాబాద్ దక్షిణ సర్కిల్ స్వరూపం
ఫ మొత్తం విద్యుత్ కనెక్షన్లు- 7.21 లక్షలు ఫ వాణిజ్య: 1.40 లక్షలు ఫ గృహ విద్యుత్తు: 5.68 లక్షలుఫ హెచ్‌టీ కనెక్షన్లు: 241 ఫ డివిజన్లు: బేగంబజార్, అస్మాన్‌ఘడ్, చార్మినార్ ఫ సబ్ డివిజన్లు: 9 ఫ సెక్షన్లు: 30 ఫ ప్రతి నెల రావాల్సిన బిల్లులు: రూ.110 కోట్ల నుంచి రూ.120 కోట్లు.