Street Dogs: వీధి కుక్కల దాడి.. నాలుగేళ్ల బాలుడి మృతి
ABN , Publish Date - Aug 10 , 2024 | 03:21 AM
వీధి కుక్కలు ప్రాణాలు తోడేస్తున్నాయి. వీధి కుక్కల దాడిలో గాయపడిన ఓ నాలుగేళ్ల బాలుడు 26 రోజులు పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ప్రాణం వదిలాడు.
26 రోజులుగా ఆస్పత్రిలోనే.. రేబి్‌సతో మృత్యువాత
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి) : వీధి కుక్కలు ప్రాణాలు తోడేస్తున్నాయి. వీధి కుక్కల దాడిలో గాయపడిన ఓ నాలుగేళ్ల బాలుడు 26 రోజులు పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ప్రాణం వదిలాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు గ్రామంలో ఈ విషాదం జరిగింది. రాయపోలుకు చెందిన ఉడుగుల శివగౌడ్, మాధురి దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు క్రియాన్స్ గౌడ్(4) ఉన్నారు. క్రియాన్స్ స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు.
అయితే, జూలై 12న క్రియాన్స్ పాఠశాల వరండాలో ఉండగా వీధికుక్కలు దాడి చేశాయి. పాఠశాల సిబ్బంది అప్రమత్తమై క్రియాన్స్‌ను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. చికిత్స కోసం క్రియాన్స్‌ను తొలుత హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రికి అక్కడ నుంచి నిలోఫర్‌కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, రేబిస్ సోకడంతో పరిస్థితి విషమించి గురువారం రాత్రి రియాన్స్ మరణించాడు.