Share News

Former Minister Somireddy: లోకేశ్‌కు ఆ అర్హత ఉంది..

ABN , Publish Date - Jan 20 , 2025 | 04:24 AM

మంత్రి నారా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న విజ్ఞాపనలు తెలుగుదేశం పార్టీలో ఊపందుకుంటున్నాయి.

Former Minister Somireddy: లోకేశ్‌కు ఆ అర్హత ఉంది..

  • డిప్యూటీ సీఎంగా ఆయన పేరు పరిశీలించాలి: సోమిరెడ్డి

  • నేను సైతం అదే కోరుతున్నాను: సయ్యద్‌ రఫీ

  • ఉప ముఖ్యమంత్రి ఇస్తే తప్పేముంది: వర్మ

  • తెలుగుదేశం పార్టీలో పెరుగుతున్న విజ్ఞాపనలు

అమరావతి, పిఠాపురం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): మంత్రి నారా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న విజ్ఞాపనలు తెలుగుదేశం పార్టీలో ఊపందుకుంటున్నాయి. లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌ శ్రీనివాసులురెడ్డి శనివారం కోరిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనను సమర్థిస్తున్న వారి జాబితా ఆదివారం మరింత పెరిగింది. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధులు సయ్యద్‌ రఫీ, ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ కూడా లోకేశ్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఆ పదవికి లోకేశ్‌ వంద శాతం అర్హులేనని యువగళం పాదయాత్ర ద్వారా తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారని సోమిరెడ్డి అన్నారు. టీడీపీ కేడర్‌తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆయన నాయకత్వాన్ని జై కొట్టిందన్నారు. డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాలా అర్హుడైన లోకేశ్‌ పేరును పరిశీలించాలని కోరుతున్నట్లు ‘ఎక్స్‌’లో వెల్లడించారు. టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ కూడా ‘నేను సైతం లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా నియమించాలని సీఎం చంద్రబాబును కోరుతున్నాను’ అని వెల్లడించారు. ‘లోకేశ్‌.. టీడీపీలో మూడోతరం నాయకుడిగా ముందుకొచ్చి, 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి, ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. 95,500 మెజార్టీతో విజయం సాధించి, చరిత్ర సృష్టించారు. లోకేశ్‌ కృషివల్లే టీడీపీ సభ్యత్వం కోటికిపైగా నమోదైంది. విద్యాశాఖలో సంస్కరణలు తెచ్చారు. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడుల సాధనకు కృషి చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ సమయంలో న్యాయపోరాటం చేశారు. అప్పుడే ఆయన పోరాట పటిమ పార్టీకి, ప్రజలకు తెలిసింది’ అని పేర్కొన్నారు.


డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే: మాజీ ఎమ్మెల్యే వర్మ

ప్రజలు, కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే మంత్రి లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనని... ఇది కోటి మంది కార్యకర్తలు, నాయకుల కోరిక అని పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్‌ వర్మ అన్నారు. ఇందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు కోరుతున్న విషయాన్ని ప్రస్తావించగా.. తానూ అదే కోరుకుంటున్నానని చెప్పారు. కార్యకర్తలు, నాయకుల మనోభావాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

Updated Date - Jan 20 , 2025 | 04:24 AM