Delhi Elections 2025 : స్వచ్ఛమైన రాజకీయాల గురించి మాట్లాడేవారే.. ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం చేశారు..రాహుల్..
ABN , Publish Date - Feb 05 , 2025 | 12:25 PM
దేశరాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఒకే విడతలో జరగనున్న 70 శాసనసభ స్థానాలకు ఇవాళ సాయంత్రం ఆరు వరకూ ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే రాష్ట్రపతి సహా అనేక మంది ప్రముఖ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో అందరూ భాగస్వాములు కావాలని ఢిల్లీ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆప్ పార్టీని లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటేసేటప్పుడు ప్రజలు ఈ విషయం గుర్తుచేసుకోవాలని సూచించారు..

దేశరాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఒకే విడతలో జరగనున్న 70 శాసనసభ స్థానాలకు ఇవాళ సాయంత్రం ఆరు వరకూ ఓటింగ్ జరగనుంది.ఈ ప్రజాస్వామ్య పండుగలో అందరూ భాగస్వాములు కావాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని లక్ష్యంగా చేసుకున్నారు. ఓ పక్క స్వచ్ఛమైన రాజకీయాల గురించి మాట్లాడుతూ అతిపెద్ద కుంభకోణం ఎవరు చేశారో ఓటు వేసేటప్పుడు ఢిల్లీ ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. తమ పార్టీకి ఓటు వేయడం ద్వారా ప్రజల హక్కులు తిరిగి పొందుతారని, రాజ్యాంగం బలోపేతం అయ్యి ఢిల్లీ మళ్లీ ప్రగతి పథంలో పయనిస్తుందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అన్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలోని నిర్మాణ్ భవన్ పోలింగ్ కేంద్రంలో ఉదయం కాంగ్రెస్ నాయకుడు ఓటు వేశారు.
ఢిల్లీ ఓటర్లు ఈ విషయం గుర్తుంచుకుని ఓటేయండి..
'నా ప్రియమైన ఢిల్లీ సోదర సోదరీమణులారా' అని సంభోదిస్తూ రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఢిల్లీ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 'మీరందరూ ఈరోజే వెళ్లి ఓటు వేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్‌కు వేసే ప్రతి ఓటు మీ హక్కులను కాపాడుతుంది. రాజ్యాంగాన్ని బలోపేతం చేసి ఢిల్లీని తిరిగి పురోగతి మార్గంలో నడిపిస్తుంది. ఓటు వేసేటప్పుడు, కలుషితమైన గాలి, మురికి నీరు, చెడిపోయిన రోడ్లకు ఎవరు బాధ్యులో గుర్తుంచుకోండి. స్వచ్ఛమైన రాజకీయాలు చేయడం గురించి మాట్లాడుకుంటూ ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడింది ఎవరు? అనేది గుర్తుంచుకోండి' అని తెలిపారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 13,766 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఒకే విడతలో మొత్తం 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 70 నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచి 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. నేడు జరుగుతున్న పోలింగ్‌లో ఈ నేతల భవితవ్యాన్ని ఢిల్లీ ఓటర్లు తేల్చనున్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. పాలనా రికార్డు, సంక్షేమ పథకాలే ఆధారంగా వరుసగా మూడవసారి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది ఆప్. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలని ఆశిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు దేశ రాజధానిలో రాజకీయ ముఖచిత్రానికి కొత్త రూపురేఖలు ఇవ్వగలదని అంతా భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..