Nara Lokesh: సైకో జగన్ అనావృష్టికి అన్నయ్య లాంటివాడు
ABN , First Publish Date - 2023-10-23T14:19:39+05:30 IST
మంగళగిరి అన్నా క్యాంటీన్ ఆరంభమై 500 రోజులు అయ్యింది. టీడీపీ హయాంలో ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్లను జగనాసురుడనే పెత్తందారుడు మూసేసి పేదల ఉసురు పోసుకున్నాడు. నిరుపేదల క్షుద్బాధ తీర్చేందుకు నా సొంత
అమరావతి: సీఎం జగన్‌పై (Cm jagan) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సైకో జగన్ అనావృష్టికి అన్నయ్య లాంటివాడని వ్యాఖ్యానించారు. పార్టీ ముఖ్యనేతల సమావేశంలో లోకేశ్ మాట్లాడారు. ‘‘చూపు పడితే పచ్చని పంట పొలాలు ఎండిపోతాయి. అడుగుపెడితే నిండుగా ఉన్న డ్యాముల గేట్లు కొట్టుకుపోయి ఖాళీ అయిపోతాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కరవుకి బ్రాండ్ అంబాసిడర్, దరిద్రానికి కేరాఫ్ అడ్రస్ సైకో జగన్. వందేళ్ల చరిత్రలో అతి తక్కువ వర్షపాతం నమోదై రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తోంది. సాగునీరు మహాప్రభో అని రైతులు గగ్గోలు పెడుతుంటే.. తాడేపల్లి కొంపలో నీరో చక్రవర్తిలాగా ఇసుక-లిక్కర్ లెక్కలు వేసుకుంటూ.. రాజకీయ కక్ష సాధింపుల్లో మునిగితేలుతున్నారు జగన్. ఒక్క చాన్స్ ఇచ్చిన ఖర్మానికి వరి వేసిన రైతుకి ఉరి, పంటలు వేసిన అన్నదాతలకు మిగిలింది గుండె మంటలు. కృష్ణా పశ్చిమ డెల్టాలో ఎండిన పంట చూసి ఆందోళనతో చేలోనే ఉరి వేసుకుంటామంటోన్న రైతుల గోడు వినపడదా!, కర్నూలు జిల్లా ఉరుకుంద దగ్గర సాగునీటి కోసం అధికారుల కాళ్లపై పడిన రైతులు ఆందోళన పట్టదా!, శ్రీకాకుళం జిల్లా గార మండలంలో వర్షాభావ పరిస్థితులు, తెగుళ్లతో ఎండిన వరి పంటకి నిప్పు పెట్టిన రైతన్నల ఆగ్రహ జ్వాలలు కనపడవా! తాడేపల్లి నీరో చక్రవర్తికి..!.’’ అంటూ లోకేశ్ మండిపడ్డారు.
‘‘మంగళగిరి అన్నా క్యాంటీన్ ఆరంభమై 500 రోజులు అయ్యింది. టీడీపీ హయాంలో ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్లను జగనాసురుడనే పెత్తందారుడు మూసేసి పేదల ఉసురు పోసుకున్నాడు. నిరుపేదల క్షుద్బాధ తీర్చేందుకు నా సొంత నిధులతో మంగళగిరి నియోజకవర్గ కేంద్రంలో అన్నా క్యాంటీన్ ఆరంభించాను. పిచ్చి జగన్ సైకో సైన్యం నానా అడ్డంకులు సృష్టించారు. మన సంకల్పం ముందు సైకోలు ఓడిపోయారు. నేటితో మా మంగళగిరి అన్నా క్యాంటీన్ 500 రోజులు పూర్తి చేసుకుంది. లక్షలాది మంది ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్ నిర్వహణకి విరాళాలు ఇచ్చిన దాతలు, బాధ్యతలు చూస్తోన్న వలంటీర్లు, సహకరిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు.’’ తెలియజేస్తున్నానని లోకేశ్ వ్యాఖ్యానించారు.