Pawan Kalyan: జగన్‌రెడ్డిది రూపాయి పావలా ప్రభుత్వం
ABN , First Publish Date - 2023-10-04T19:54:12+05:30 IST
రాష్ట్ర సంపదను వైసీపీ నేతలు(YCP leaders) దోచేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆరోపించారు. నాలుగో విడత వారాహి యాత్ర బుధవారం పెడనకు చేరుకుంది.
కృష్ణా: రాష్ట్ర సంపదను వైసీపీ నేతలు(YCP leaders) దోచేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆరోపించారు. నాలుగో విడత వారాహి యాత్ర బుధవారం పెడనకు చేరుకుంది. ఈ యాత్రలో టీడీపీ మద్దతుదారులు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘‘ఏడాదిగా మన రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నాం. మనం ఏపీకి రావాలంటే పాస్ పోర్టు, వీసా తీసుకుని రావాల్సిన పరిస్థితి ఉంది.. దేనికి భయపడేది లేదు. పెడనలో వైసీపీ మూకలు అంబేడ్కర్ విగ్రహానికి జనసైనికులను కట్టేసి కొట్టారు. ఈ విషయాన్ని మర్చిపోం. వైసీపీ నేతల అక్రమాలను ప్రశ్నింనందుకే జనసైనికులను కొట్టారు. వాళ్లు ఉన్న ఏరియాలోకి జనసైనికులు వెళ్లకూడదంట. రాబోయే ఎన్నికల్లో జగన్‌రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడుదాం. వైసీపీ నవరత్నాల్లో చెప్పిందొకటి, చేసేదొకటి. జగన్‌రెడ్డిది రూపాయి పావలా ప్రభుత్వం. ప్రజలను తమ దగ్గరకు రప్పించుకోవడానికే వైసీపీ నేతలు రూపాయి పావలా సిద్ధాంతం వాడుతున్నారు. ఓట్లు వేయించుకోవడానికే వైసీపీ పథకాలు. వైసీపీ పథకాలు అమల్లోకి వచ్చేసరికి అంతా డొల్లాతనమే. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే జనసేన తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ భ్రష్టుపట్టిస్తోంది. జగన్‌రెడ్డివి వినాశకాలే విపరీత బుద్ధి. వైసీపీ పాలనలో అవినీతి పెరిగిపోయింది’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం
జగన్ ప్రభుత్వం ఉపాధిహామీ కూలీల పొట్టకొట్టిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ‘‘పేదలకు ఇళ్లు నిర్మించడంలో జగన్ ప్రభుత్వం విఫలం అయింది. జగన్ పాలన ఏపీకి బంగారు భవిష్యత్తు కాదు.. ఒక విపత్తు. జగన్‌ను గద్దెదింపేందుకు టీడీపీతో కలిసి పనిచేస్తాం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా పార్టీలన్నీ ఏకమవ్వాలి. విభేదాలు పాలసీల వరకే పరిమితం చేసుకోవాలి. ఉపాధి పనుల్లో దేశంలో అత్యంత అవినీతి జరిగిన రాష్ట్రం ఏపీ అని కేంద్రమే చెప్పింది. 337 కోట్లు ఉపాధి నిధులు దారి మళ్లించారు. మట్టి అక్రమాలను అడ్డుకుంటే జనసేన, టీడీపీలపై అక్రమ కేసులు పెట్టారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కువగా దేశ ద్రోహం కేసులు పెట్టారు. వైసీపీ నిజంగా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే యువత ఎందుకు టీడీపీ జనసేన సభలకు వస్తారు. మంత్రి జోగి రమేష్ డబ్బులు ఎలా తీసుకుంటారో వివరించారు. జగన్‌రెడ్డి 2 వేల ఇళ్లు కడతామని ఒక్క ఇల్లు కట్టలేదు’’ అని పవన్ తెలిపారు.
ఏపీలో కుల భావన ఎక్కువ
కృత్తివెన్ను ప్రాంతంలో వేల ఎకరాల అక్రమ రొయ్యల చెరువులు తవ్వారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘‘మడ అడవులు, కోస్టల్ రెగ్యులేటరీ జోన్‌ను ఆక్రమించి రొయ్యల చెరువులు తవ్వేశారు. 28 లక్షల ఇళ్లు కట్టాల్సి ఉండగా కేవలం 3 లక్షల ఇళ్లు మాత్రమే కట్టారు. ఇళ్ల నిర్మాణనికీ నిధుల కేటాయింపుల్లోనూ జగన్‌రెడ్డి దగా చేశారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఫ్లెక్సీలు తయారీ చేసే యువత ఉపాధిని దెబ్బతీశారు. ఏపీలో కుల భావన ఎక్కువ.. జాతి భావన తక్కువ. తెలంగాణాలో కులాలు ఉన్నాయి.. కానీ తెలంగాణా భావన ఎక్కువ. మన రాష్ట్ర ప్రజలు ఎవరి దగ్గర దేహీ అనే పరిస్థితి ఉండకూడదనే, జనసేన ప్రారంభించాను. అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనం కలిసికట్టుగా పోరాటం చేయలేక పోయాం. ఏపీకి సరైన రాజధాని కూడా లేని పరిస్థితి. చంద్రబాబును జగన్ జైలులో పెట్టించాడు. రేపు జగన్ హస్తీనకు వెళ్తున్నాడు. ఏం ప్రయోజనం. కేసుల నుంచి బయటపడేయమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వేడుకుంటాడు అంతే గానీ జగన్ రాష్ట్ర సమస్యలపై మాట్లాడడు. కులాలు, మతాల రాజకీయం చేయడం నాకు చేతకాదు.. అలా చేయను. నన్ను తిట్టించడానికి వేరే కులాల వారితో తిట్టిస్తాడు. కులాల వారీగా యువతను విడదీసి చూడలేను.’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.