MLC Kavitha : కేబినెట్ భేటీలో కేసీఆర్ అనూహ్య నిర్ణయం.. సమావేశం మధ్యలోనే ఇద్దరు మంత్రులు బయటికొచ్చి..!
ABN , First Publish Date - 2023-03-09T20:02:02+05:30 IST
తెలంగాణ కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ (CM KCR) అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సమావేశం జరుగుతుండగానే...
తెలంగాణ కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ (CM KCR) అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సమావేశం జరుగుతుండగానే మహిళా మంత్రులను (Lady Ministers) ఢిల్లీకి (Delhi) పంపించాలని నిర్ణయించారు. ఈ మేరకు మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy), సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) ఇద్దర్నీ ఢిల్లీ వెళ్లాలని సూచించారు. కేసీఆర్ ఆదేశాలతో మంత్రులిద్దరూ సమావేశం మధ్యలోనే బయటికొచ్చి ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఇవాళ రాత్రికే మంత్రులిద్దరూ బయల్దేరనున్నారు. మంత్రులతో పాటు పలువురు మహిళా ఎమ్మెల్యేలు కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు(Women’s Reservation Bill) కోసం హస్తిన(Delhi) జంతర్ మంతర్(Jantar Mantar) దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC K Kavitha) దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ దీక్షలో తెలంగాణ నుంచి వెళ్లే మహిళా మంత్రులు పాల్గొననున్నారు. దీక్షలో భాగంగా మంత్రులు ప్రసంగాలు చేయనున్నట్లు సమాచారం.
ఎవరెవరు పాల్గొనబోతున్నారు..!?
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ (BJP) ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి రేపు (మార్చి-10న) జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవితే (MLC Kavitha) దగ్గరుండి చూస్తున్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) దీక్షను ప్రారంభించనున్నారు. గురువారం సాయంత్రం ఏచూరి ఇంటికెళ్లిన కవిత.. ఆయన్ను కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. మరోవైపు.. దీక్షా కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విపక్ష పార్టీలకు చెందిన నేతలు పాల్గొంటారు. కవిత దీక్షకు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మద్దతు పలికారు. దీక్ష ముగింపునకు సీపీఐ కార్యదర్శి డి. రాజా (D Raja) హాజరుకానున్నారు. ఈ దీక్షకు సంఘీభావంగా దేశంలోని 18 పార్టీలకు చెందిన నేతలు, ఆయా పార్టీల బృందాలు పాల్గొననున్నాయి. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి వివిధ మహిళా సంఘాలు, మహిళా హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు పాల్గొనబోతున్నాయి. ముఖ్యంగా కవిత చేపట్టిన ఈ దీక్షకు రాజ్యసభ సభ్యుడు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ప్రత్యేకంగా హాజరుకానున్నారు.
పోటాపోటీగా..!
ఇదిలా ఉంటే.. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం (Women Reservation Bill) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేస్తున్న నిరాహార దీక్షకు తెలంగాణ బీజేపీ (TS BJP) కౌంటర్ దీక్షకు రెడీ అయింది. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ‘మహిళా గోస- బీజేపీ భరోసా’ పేరుతో కౌంటర్ దీక్ష చేయనున్నారు. బెల్ట్‌షాపులు, మహిళలపై అత్యాచారాలను నిరసిస్తూ బీజేపీ దీక్ష చేపట్టనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ దీక్ష కొనసాగుతుందని బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలో.. లిక్కర్ స్కామ్‌కు (Delhi Liquor scam) వ్యతిరేకంగా ఢిల్లీ బీజేపీ నేతలు చేయాలనుకున్న ధర్నా జంతర్‌మంతర్ నుంచి దీన్‌దయాళ్ మార్గ్‌కు మారింది. దీన్‌దయాళ్ మార్గ్‌లోని ఆంధ్రా స్కూల్ దగ్గర బీజేపీ ధర్నా నిర్వహించనుంది. దీంతో రేపు ఢిల్లీలో బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ నిరసనలు నిర్వహించనున్నాయి.