SBI Robbery: ఆ జిల్లాలో ఎస్‌బీఐకు షాక్ ఇస్తున్న దొంగలు..
ABN , Publish Date - Aug 04 , 2024 | 11:39 AM
జిల్లాను వరస దొంగతనాలు హడలెత్తిస్తున్నాయి. భారతీయ స్టేట్ బ్యాంకే(ఎస్‌బీఐ) లక్ష్యంగా దుండగులు దాడులకు తెగబడుతూ లక్షల సొత్తును కాజేస్తున్నారు. సినిమా లెవల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
అనంతపురం: జిల్లాను వరస దొంగతనాలు హడలెత్తిస్తున్నాయి. భారతీయ స్టేట్ బ్యాంకే(ఎస్‌బీఐ) లక్ష్యంగా దుండగులు దాడులకు తెగబడుతూ లక్షల సొత్తును కాజేస్తున్నారు. సినిమా లెవల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గత రెండు నెలల వ్యవధిలో నాలుగు ఏటీఎంలపై దాడులు చేయగా.. అందులో గత వారం రోజుల వ్యవధిలో జరిగిన ఘటనలు మూడు ఉన్నాయి. అర్ధరాత్రులు గ్యాస్ కట్టర్లతో దాడులు చేస్తూ కోట్ల రూపాయలు స్వాహా చేశారు.
గత రెండు నెలల చోరీ వివరాలు..
ఆగస్టు 3న అర్ధరాత్రి..
అనంతపురం కమ్మభవన్ పక్కన ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంపై ఈనెల 3న(శనివారం) అర్ధరాత్రి దాడి చేసిన దుండగులు రూ.30లక్షలు ఎత్తుకెళ్లారు. గ్యాస్ కటర్‌తో ఏటీఎం మిషన్‌ని పగలకొట్టిన దుండగులు నగదు చోరీ చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సుమారు రూ.30లక్షలు అపహరణకు గురైనట్లు బ్యాంకు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆగస్టు 2న అర్ధరాత్రి..
గార్లదిన్నె మండలం కల్లూరులో ఈనెల 2న (శుక్రవారం) అర్ధరాత్రి సమయంలో ఎస్‌బీఐ డిపాజిట్ ఏటీఎంలోనూ చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్‌ను బద్దలుకొట్టి రూ.3,28,600లు ఎత్తుకెళ్లారు. సాంకేతిక పరిజ్ఞానంతో చోరీ విషయం తెలుసుకున్న హైదరాబాద్ హెడ్డాఫీస్ ఉద్యోగులు.. సమాచారాన్ని వెంటనే కల్లూరు బ్యాంకు మేనేజర్ రామాంజిబాబు, పోలీసులకు అందించారు. కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు రాత్రి 2.42గంటల సమయంలో చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ముసుగులు ధరించి ఉండడంతో వివరాలు తెలియలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్‌ఐ శ్రీధర్ దర్యాప్తు చేపట్టారు.
జులై 27న అర్ధరాత్రి..
అనంతపురం జేఎన్టీయూ క్యాంపస్‌కు అనుబంధంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి జులై 27న అర్ధరాత్రి సమయంలో దొంగలు ప్రవేశించారు. బ్యాంకు కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి దూరారు. సెక్యురిటీ అలారం మోగకుండా చేసి రెండు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. గ్యాస్ కట్టర్‌తో స్ట్రాంగ్ రూమ్ పగలకొట్టి రూ.39లక్షలు ఎత్తుకెళ్లారు. ఎక్కడా వేలిముద్రలు పడకుండా దొంగలు జాగ్రత్త పడ్డారు. ఉదయం బ్యాంకు సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మిగిలిన కెమెరాలను పరిశీలించిన పోలీసులు పాత నేరస్థులే దొంగతనం చేసినట్లు అనుమానిస్తున్నారు. వీరు కూడా ముఖాలు కనిపించకుండా మాస్కులు ధరించారు.
జూన్ 7న అర్ధరాత్రి..
అనంతపురం జిల్లా కూడేరు మండలంలో జూన్ 7న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంపై దాడి చేసి రూ.18,41,300లు అపహరించారు. అర్ధరాత్రి సమయంలో కూడేరులోని అనంతపురం- బళ్లారి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలో దుండగులు చోరీ చేశారు. కత్తులతో మిషన్‌ను ఓపెన్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే మిషన్ తెరిచే సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి పెద్ద శబ్దాలు రావడంతో అందిన కాడికి దోచుకుని పారిపోయారు. శబ్దాలకు స్థానికులు బయటకు రాగా నిందుతులు కారులో పరారయ్యారు. ఘటనపై సీఐ శివరాముడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.