Minister Dola: జగన్ డిక్లరేషన్ ఇవ్వలేకే తిరుమల పర్యటన రద్దు: మంత్రి డోలా..
ABN , Publish Date - Sep 28 , 2024 | 07:56 PM
తిరుమల పర్యటన రద్దు చేసుకున్న మాజీ సీఎం జగన్‌పై ఏపీ సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే వైసీపీ అధినేత జగన్ పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రి ఆరోపించారు.
అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, వేంకటేశ్వరస్వామి భక్తులు, హిందూ సంఘాల నాయకులు సీరియస్‌గా ఉన్నారు. స్వామివారి ప్రసాదం విషయంలో అపచారం చేశారంటూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సహా గత టీటీడీ పాలకమండలిపైనా పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకున్న జగన్‌ను డిక్లరేషన్ ఇవ్వాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో శుక్రవారం రోజున తిరుమలకు వెళ్లాల్సిన ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి ఎన్డీయే ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. దీంతో ఫ్యాన్ పార్టీ అధినేతపై కూటమి నేతలు మండిపడుతున్నారు. డిక్లరేషన్ ఇవ్వకుండా తప్పించుకునేందుకే తిరుమల పర్యటనను జగన్ రద్దు చేసుకున్నారని పెద్దఎత్తున ఆరోపణలు చేస్తున్నారు.
అబ్దుల్ కలాం కంటే గొప్పోడా?
ఈ నేపథ్యంలో తిరుమల పర్యటన రద్దు చేసుకున్న మాజీ సీఎం జగన్‌పై ఏపీ సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.."డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే వైసీపీ అధినేత జగన్ పర్యటన రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్ ఇవ్వమని హిందూ సంఘాలు అడిగితే తన మతం మానవత్వం అంటూ జగన్ అమాయకత్వం ప్రదర్శించారు. దళితుడైన సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసినప్పుడు నీ మానవత్వం ఏమైంది?. తన తండ్రి హత్య కేసులో న్యాయం చేయాలంటూ నీ చెల్లెలు సునీతారెడ్డి కన్నీరు కార్చినప్పుడు నీ మానవత్వం ఎటు పోయింది?. అన్న క్యాంటీన్లు రద్దు చేసి పేదల పొట్ట కొట్టడమేనా నీ మానవత్వం?. మాజీ ముఖ్యమంత్రిని నన్నే తిరుమలకు రానివ్వడం లేదంటే ఇక దళితుల పరిస్థితి ఏంటని కులాల గురించి జగన్ మాట్లాడటం సిగ్గుచేటు. హిందువులుగా ఉన్న దళితులు శ్రీవారిని దర్శించుకోవడం లేదా?. టీటీడీలో నిబంధనలు కులానికి కాదు మతానికని నీకు తెలియదా?. ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ తన నీచ రాజకీయాలు మానుకోలేదు. ఎవరైనా సరే నిబంధనల్ని గౌరవిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలి. అబ్దుల్ కలాం కంటే జగన్ గొప్పోడా?. అబ్దుల్ కలామే డిక్లరేషన్ ఇచ్చినప్పుడు.. జగన్ ఎందుకివ్వరు?" అంటూ మండిపడ్డారు.
సుప్రీంకోర్టుకు వివాదం..
మరోవైపు తిరుమల లడ్డూ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. లడ్డూ వివాదంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. వీరిద్దరూ వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. అయితే ఈనెల 30న దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ విచారణ జరగనుంది. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ చేయాలని సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని సుబ్రహ్మణ్యస్వామి కోరారు. విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో గానీ, నిపుణులతో గానీ విచారణ చేయించాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.