Yanamala: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై వైసీపీది రాద్ధాంతమే..
ABN , Publish Date - Aug 01 , 2024 | 05:11 PM
వైసీపీ నేతలు అవగాహనా రాహిత్యంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌పై విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) విమర్శించారు.
అమరావతి: వైసీపీ నేతలు అవగాహనా రాహిత్యంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌పై విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వం వల్లనే ఈ ఆర్డినెన్స్ తీసుకురావాల్సి వచ్చిందని చెప్పారు. ఐదేళ్లు పన్నులు, ఛార్జీల రూపంలో ఒక్కో కుటుంబంపై రూ.7 లక్షల మేర భారం విధించి ప్రజల రక్తాన్ని వైసీపీ పాలకులు పీల్చి లక్షల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. రూ.35 వేల కోట్ల విలువైన 1.75 లక్షల ఎకరాలను, సహజ వనరులను దోచేసి రూ.19 వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు.
2014-19 మధ్య GSDP 13.5% కాగా, 2019-24 మధ్య అది 10.5%నికి పడిపోయింది. 2014-19తో పోలిస్తే మూలధన వ్యయం జగన్ పాలనలో 60% తగ్గిందని తెలిపారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం తెలంగాణతో పోలిస్తే ఏపీకి 3.66% అధికంగా ఉండేదని అన్నారు. అలాంటిది జగన్ రెడ్డి పరిపాలన వల్ల ఏపీ కంటే తెలంగాణాకు 31.65% పెరిగిందని చెప్పారు. బడ్జెట్‌లో లేని అప్పులు, పెండింగ్ బిల్లులు, కార్పొరేషన్ ద్వారా అప్పులు వంటి విషయాలను ప్రజలకు తెలియకుండా చేసింది వైసీపీ నేతలు కాదా..? అని ప్రశ్నించారు. లక్షల కోట్లు అప్పులు చేసి ఐదేళ్లలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా జగన్ ప్రభుత్వం పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను సైతం ఉల్లంఘించి యథేచ్ఛగా రూ.10 లక్షల కోట్లుకు పైగా అప్పులు తెచ్చారని ఆరోపించారు.
2018-19లో రూ.35,465 కోట్లు ద్రవ్యలోటు ఉండగా, 2022-23 నాటికి రూ.52,508 కోట్లకు చేర్చారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములు, కార్యాలయాలతో పాటు రాష్ట్ర సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టిన ఘనుడు జగన్ రెడ్డి అని విమర్శించారు. నాలుగు సార్లు భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచి, ఉచిత ఇసుకను రద్దు చేసి పేద, మధ్యతరగతి ప్రజలకు సొంత ఇంటి కలను జగన్ ప్రభుత్వం దూరం చేసిందని ఆరోపించారు. ప్రజల సొంత ఇంటి కలను తీర్చేందుకు రూ.4 లక్షలతో గృహ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం సాయం చేస్తోందని వివరించారు. 16,347 ఉద్యోగాలకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు అండగా నిలిచామని తెలిపారు. పింఛన్‌ను రూ.4 వేలకు పెంచడంతోపాటు అన్న క్యాంటీన్లను, రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
టీడీఆర్ వ్యవహారంలో అవకతవకలు: మంత్రి నారాయణ
మరోవైపు పురసేవ కార్యక్రమం త్వరలో పునఃప్రారంభం చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీఆర్ వ్యవహారంలో చాలా అవకతవకలు జరిగాయని,, చర్యలు తప్పవని హెచ్చరించారు. టీడీఆర్ అవకతవకలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కార్పొరేషన్‌లో సంతకాల ఫోర్జరీ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్ది తన దృష్టికి తీసుకొచ్చారని గుర్తుచేశారు. కార్పొరేషన్ కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ వ్యవహారంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. 2014 నుంచి 2019 వరకు టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికందరికి ఇళ్లు అందిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.