YS Jagan: తిరుమల ఎఫెక్ట్ వైసీపీపై పడకూడదని జగన్ కొత్త డ్రామా..
ABN , Publish Date - Sep 25 , 2024 | 04:29 PM
తిరుమల లడ్డూ పవిత్రతకు భంగం వాటిల్లేలా చేసిన వైసీపీ తప్పును కప్పిపుచ్చుకునేందుకు కొత్త డ్రామాలకు తెరతీసింది. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
అమరావతి: తిరుమల లడ్డూ పవిత్రతకు భంగం వాటిల్లేలా చేసిన వైసీపీ తప్పును కప్పిపుచ్చుకునేందుకు కొత్త డ్రామాలకు తెరతీసింది. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రాజకీయాల్లోకి దేవుడ్ని లాగడమే కాకుండా తిరుమల ప్రతిష్టను సీఎం చంద్రబాబు దెబ్బతీశారని ఆరోపిస్తూ, పాపప్రక్షాళన పేరుతో జగన్ డ్రామాలు షురూ చేశారు. ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో పూజల్లో పాల్గొనాలని వైసీపీ నేతలు, కార్యకర్తలకు బుధవారం ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.
"తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వేంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, స్వామివారి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను,రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేశారు. తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో సెప్టెంబరు 28న పూజల్లో పాల్గొనాలని వైయస్సార్‌సీపీ పిలుపునిస్తోంది" అని జగన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జగన్ సర్కార్ హయాంలోనే తిరుమల లడ్డూ నెయ్యీ కల్తీ జరిగిందని కేంద్ర ల్యాబ్స్ నివేదికలిచ్చాయి. కేంద్ర నివేదికను తప్పుబడుతూ వైసీపీ నేతలు నీచ రాజకీయాలకు దిగడం గమనార్హం.
వైవీ సుబ్బారెడ్డి మరోవైపు..
శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కలవడంపై ఆరోపణల ఎదుర్కొంటున్న టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమల వివాదాల నుంచి బయటపడేందుకు బాపట్లలో వైవీ సుబ్బారెడ్డి హోమాలు, పారాయణాలు చేయించుకుంటున్నారట. టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు, నిధుల దుర్వినియోగంపై వైవి సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సమస్యలు తొలగిపోవాలని శింగరకొండ ఆంజనేయస్వామి దేవాలయంలో మన్యుసూక్త హోమం, పారాయణం జరిపారు. అనుచరుల ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయించి మరీ వైవీ సుబ్బారెడ్డి హోమం, పారాయణం చేయించినట్లు సమాచారం. ఇలా వైసీపీ నేతలు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు పూజలు, హోమాల పేరుతో నాటకాలకు తెరతీయడంపై ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
For Latest News and National News Click here