YS Sharmila: నేడు కడప నేతలతో షర్మిల భేటీ.. పోటీపై ప్రకటన..!
ABN , Publish Date - Mar 21 , 2024 | 07:37 AM
సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల (YS Sharmila) ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ నేడు వీడనుంది. ఇవాళ ఉదయం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో కడప జిల్లా నేతలతో షర్మిల సమావేశం కానున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల (YS Sharmila) ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ నేడు వీడనుంది. ఇవాళ ఉదయం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో కడప జిల్లా నేతలతో షర్మిల సమావేశం కానున్నారు. ఇదే సమావేశంలో తన పోటీపై క్లారిటీ ఇవ్వడంతో పాటు.. జిల్లాలోని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీలో అసంతృప్తితో ఉన్న నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. ఇంకా ఎవరైనా సీటు దొరక్క లేదా పార్టీపై అసంతృప్తితో ఉన్న బలమైన నేతలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు సంప్రదింపులు చేస్తున్నారట. కడప ఎంపీగా షర్మిల పోటీ చేయడం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన పార్లమెంట్ పరిధిలో బలమైన వ్యక్తులనే ఎమ్మె్ల్యే అభ్యర్థులుగా బరిలోకి దించాలనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు కడప కాంగ్రెస్ (Congress) నాయకులతో జరిగే సమావేశంలో అన్ని విషయాలపై క్లారిటీ వస్తుందని, మరో రెండు, మూడు రోజుల్లోనే ఏపీ మొదటి జాబితా విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది.
టార్గెట్ వైసీపీ..
రాష్ట్ర విభజనకు ముందు రాయలసీమ జిల్లాలతో పాటు.. ఏపీలో కాంగ్రెస్ బలంగా ఉండేది. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టడంతో.. రాజశేఖర్‌రెడ్డితో దగ్గరగా ఉండే నేతలంతా జగన్ పార్టీలోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న పలువురు నాయకులు సైతం వైసీపీలో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయింది. ఈదశలో హస్తం పార్టీ నేతల్లో ఎక్కువమంది వైసీపీలోకి వెళ్లారు. దీంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు జగన్ పార్టీకి బదిలీ అయింది. ఆ తర్వాత కాంగ్రెస్ 2014, 2019 ఎన్నికల్లో పోటీచేసినప్పటికి ప్రజల్లో ఆదరణ కనిపించలేదు. దీంతో ఏపీలో కాంగ్రెస్‌ను మళ్లీ బతికించాలనే లక్ష్యంతో అడుగులు వేసిన ఆ పార్టీ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించింది. దీంతో తమ పార్టీ నుంచి వైసీపీకి మళ్లిన ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు షర్మిల వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రానున్న ఎన్నికల్లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..