Share News

Tirumala: ఈ భ్రష్టత్వానికి బాధ్యత ఎవరిది జగన్‌?

ABN , Publish Date - Sep 28 , 2024 | 09:32 AM

నిజానికి, జగన్‌ పాలనలో టీటీడీ ద్వారా జరిగిన అక్రమాల పుట్టలో.. ‘లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి’ అన్నది ఒక అంశమే. లోతుగా దర్యాప్తు జరిపితే విస్తుపోయే వాస్తవాలెన్నో వెలికివస్తాయి. ఒక్క టీటీడీయే కాదు.. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలలో జరుగుతున్న లోటుపాట్లను సమీక్షించాలి. ముఖ్యంగా, దేవాదాయ శాఖపై దృష్టి పెట్టి భక్తులకు మరిన్ని సేవలు అందేవిధంగా మార్పులు తేవాలి. దేవాలయాలపై వచ్చే ఆదాయాన్ని దేవాలయాల అభివృద్ధికే ఖర్చు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.

Tirumala: ఈ భ్రష్టత్వానికి బాధ్యత ఎవరిది జగన్‌?
Tirumala

నిజానికి, జగన్‌ పాలనలో టీటీడీ ద్వారా జరిగిన అక్రమాల పుట్టలో.. ‘లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి’ అన్నది ఒక అంశమే. లోతుగా దర్యాప్తు జరిపితే విస్తుపోయే వాస్తవాలెన్నో వెలికివస్తాయి. ఒక్క టీటీడీయే కాదు.. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలలో జరుగుతున్న లోటుపాట్లను సమీక్షించాలి. ముఖ్యంగా, దేవాదాయ శాఖపై దృష్టి పెట్టి భక్తులకు మరిన్ని సేవలు అందేవిధంగా మార్పులు తేవాలి. దేవాలయాలపై వచ్చే ఆదాయాన్ని దేవాలయాల అభివృద్ధికే ఖర్చు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.


హిందూ దేవాలయాల ఆచారవ్యవహారాలలో అంతర్భాగం శౌచధర్మం. దేవుణ్ణి కొలిచే భక్తులు, పూజాదికాలు నిర్వహించే పూజారులు, నైవేద్య కైంకర్యాలు తయారుచేసేవారు విధిగా శౌచధర్మం పాటించాలని; దేవుని ఆరగింపునకు తయారు చేసే నైవేద్యం భక్తితో, పవిత్రతతో, శుచితో, మేలిమి సంగంధాలతో రూపొందించాలని శాస్త్రాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా, కలియుగ దైవంగా భావించే తిరుమల తిరుపతి వేంకటేశ్వరునికి అందించే నైవేద్య కైంకర్యాలన్నీ నిర్దిష్ట ప్రమాణాలకు లోబడిన కల్తీలేని వస్తువులతోనే తయారు చేయాలి. అంతేకాదు.. తిరుమల తిరుపతి దేవస్థానంలోని ప్రతి ఒక్కరూ ధార్మిక నిష్టను పాటించాలని శాస్త్రాలు నొక్కి చెబుతున్నాయి.


హిందూయేతర మతస్థులు ఏడుకొండల స్వామివారిని దర్శించుకోవాలంటే.. తమకు దేవుడి పట్ల నమ్మకం ఉందన్న డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలలోను, ఇతర పండుగ దినాలలో పాలకులు సతీసమేతంగా దర్శనం చేసుకొని స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీ. చారిత్రకంగా చూసినపుడు, అనాదిగా అనేక మంది రాజులు శ్రీవేంకటేశ్వరస్వామిని భక్తి ఆరాధనలతో కొలుచుకొన్నారు. 500 సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు ఏడు పర్యాయాలు తిరుమలకు యాత్రలు చేసి శ్రీ వేంకటేశ్వరస్వామికి నవరత్నఖచిత కిరీటంతో సహా ఎన్నో విలువైన వజ్రవైడూర్యాలు, బంగారు వెండి కానుకలు సమర్పించారు.


రాజుల కాలం ముగిసి దేశంలో ప్రజాపాలన మొదలైన తర్వాత కూడా ఆయా సందర్భాలలో రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పని చేసిన నాయకులు తిరుమల తిరుపతి ఆలయ పవిత్రతను కాపాడడానికి తమవంతు కృషి చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్‌.టి.రామారావుకు వేంకటేశ్వరస్వామి పట్ల ఎనలేని భక్తిప్రపత్తులు ఉండేవి. తన 60వ జన్మదిన సందర్భంగా ఎన్‌.టి.రామారావు శ్రీ వేంకటేశ్వరస్వామి పాదాల చెంత తిరుపతిలో తెలుగుదేశం పార్టీ తొలి ‘మహానాడు’ను నిర్వహించారు. అలాగే తిరుపతిలో ఎన్నికల ప్రచారం ముగించుకొని తిరుమల వెళ్లి తలనీలాలు సమర్పించి దైవ దర్శనం చేసుకొన్నారు. ఆ ఎన్నికలలో అఖండ విజయం సాధించి అధికారం చేపట్టిన తర్వాత.. తిరుమల తిరుపతిని వాటికన్‌ సిటీ తరహాలో అభివృద్ధి చేస్తానని ప్రకటించి.. అందులో భాగంగా తిరుమల తిరుపతిలో ఎన్టీఆర్‌ ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా, సామాన్య భక్తుల కోసం మహాప్రాంగణం ఏర్పాటు, ఆర్టీసీ బస్టాండ్‌, తదితర అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్‌ చొరవతోనే తిరుమలలో 1986లో భక్తులకు ఉచితంగా భోజనం పెట్టే ‘నిత్యాన్నదాన పథకం’ మొదలైంది. తిరుమల కొండమీద హిందూ సంస్కృతీ సంప్రదాయాలను; ఆచార వ్యవహారాలను నిష్టతో పాటించడానికి ఎన్టీఆర్‌ ఎన్నో మార్పులు తెచ్చారు.


తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు; ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతిలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి కొన్ని సంఘటనలను ఉదహరించాల్సిన అవసరం అనివార్యంగా ఉంది. 2004లో తెలుగుదేశం ఓటమి చెంది కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసే అనేక సంఘటనలు జరిగాయి. కొండమీద రాజకీయ కార్యకలాపాలు సాగించడానికి వీలులేదు. అలాగే, అన్యమత ప్రచార కార్యక్రమాలు చేపట్టడం నిషేధం. కానీ, 2004 తర్వాత ఆనాటి పాలకులు ఉదాసీనంగా, చూసీచూడనట్లు వ్యవహరించడంతో శ్రీవారి కొండమీద మహాపచారాలు అనేకం జరిగాయి. ఆనాడు తిరుమలలో చెట్ల చుట్టూ ఏర్పాటు చేసిన ‘ట్రీగార్డు’లలో శిలువ గుర్తు కన్పించేటట్లు చేశారు. మోటారు సైకిళ్లకు రాజకీయ జెండాలు కట్టుకొని కొండపై రాజకీయ ర్యాలీ తీశారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. తన అనుంగు సహచరుడైన కరుణాకరరెడ్డిని టీటీడీ చైర్మన్‌ చేశారు. కరుణాకర రెడ్డి నాస్తికుడిగా, కమ్యూనిస్టుగా, క్రిస్టియన్‌గా తిరుపతిలో ప్రసిద్ధుడు. టీటీడీ చైర్మన్‌గా ఆయన నియామకం మంచిది కాదని హిందూధార్మిక సంస్థల ప్రతినిధులు హెచ్చరించినా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఖాతరు చేయలేదు.


2019–2024 మధ్య వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పరిపాలనలో తిరుమలలో జరిగిన ఘోరాలు, అపచారాలు, అవినీతి కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కావు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అపచారాలకు మించిన స్థాయిలో జగన్‌ అండ్‌ కో అక్రమాలకు పాల్పడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా తన రాజకీయ అవసరాల కేంద్రంగా మార్చేశారు. టీటీడీ బోర్డుకు చైర్మన్‌గా, సభ్యులుగా ఎంపిక చేసేవారికి నేరచరిత ఉండకూడదు. కానీ, జగన్‌ పాలనలో నిబంధనల్ని, సంప్రదాయాల్ని గోదాట్లో కలిపేశారు. టీటీడీ చైర్మన్‌గా నాలుగేళ్లపాటు సొంత బాబాయిని నియమించుకున్నారు. చివరి ఏడాదిలో కరుణాకర రెడ్డిని తెచ్చారు. ఇక, టీటీడీ సభ్యులుగా లిక్కర్‌ కుంభకోణంలో ఉన్నవారిని, టీడీఆర్‌ బాండ్ల కుంభకోణానికి పాల్పడ్డ పాత్రధారులకు, స్మగ్లర్లకు చోటు కల్పించారు. పన్నెండు మంది సభ్యులు మాత్రమే ఉండాల్సిన టీటీడీ బోర్డును ఇరవైనాలుగు మంది సభ్యులతో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు. మరో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. అయితే, న్యాయస్థానం జోక్యంతో ప్రత్యేక ఆహ్వానితులకు చెల్లుచీటి పాడక తప్పలేదు. పెద్ద పదవుల్లో ఉన్నవారు తమ భవిష్యత్తు అవసరాలకు పనికొస్తారనే ముందుచూపుతో.. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌కు, సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌సూద్‌కు ‘‘మీ వాళ్లు ఎవరైనా ఉంటే చెప్పండి.. టీటీడీ బోర్టులో సభ్యులుగా నియమిస్తాం’’ అంటూ కబురు చేసిన ఘటన, అందుకు వారిద్దరూ జగన్‌ ఆఫర్‌ను నిర్ద్వందంగా తోసిపుచ్చడం సంచలనం సృష్టించింది. టీటీడీ జెఇవో పోస్టుకు రాష్ట్రంలో అధికారులే లేనట్టు వివాదాస్పదుడైన ధర్మారెడ్డిని కేంద్ర సర్వీసుల నుంచి తెచ్చుకున్నారు. అందరూ కార్టెల్‌గా మారి కొండపై వందలాది కోట్లతో నామినేషన్ల పద్ధతిన పనులను సొంతవాళ్లకు పంచేశారు. చివరకు భక్తులు సమర్పించిన తల నీలాలను కూడా ఇతర దేశాలకు అక్రమ రవాణా జరగడం సభ్యసమాజాన్ని ద్రిగ్భాంతికి గురిచేసింది.


జగన్‌ అధికారంలో ఉండగా తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసిన వారిలో మంత్రిగా పనిచేసిన ఆర్‌.కె.రోజా మొదటిస్థానంలో ఉంటారు. వారానికి ఒకటిరెండు సార్లు మందీమార్బలంతో, టిక్కెట్లు కొనకుండానే ఆర్‌.కె.రోజా దర్శనాలకు వెళ్లడాన్ని అందరూ గమనించారు. పైగా, కొండమీద రాజకీయాలు మాట్లాడకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ.. దాదాపుగా ప్రతి సందర్భంలో ఆర్‌.కె. రోజా స్వామి దర్శనానంతరం బయటకొచ్చి మీడియాతో రాజకీయాలు మాట్లాడారు. చంద్రబాబునాయుడు, పవన్‌ కళ్యాణ్‌లపై పచ్చిగా రెచ్చిపోయి మాట్లాడారు. ఇక, శ్రీవారి బంగారాన్ని సెక్యూరిటీగా చూపి అప్పులు తెచ్చుకునేందుకు కూడా ఆనాటి ప్రభుత్వం వెనుకాడలేదు. పైగా, టీటీడీ నిధుల్ని రాష్ట్ర ఖజానాకు మళ్లించే ప్రయత్నాలు జరిగాయి. జగన్‌ తాను క్రిస్టియన్‌ అని పలు సందర్భాలలో బాహాటంగా చెప్పుకున్నారు. ఎపిజే అబ్దుల్‌ కలాం దేశానికి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తిరుమలను సందర్శించిన సందర్భంలో డిక్లరేషన్‌పై సంతకం చేసి ఓ ఉన్నత సంప్రదాయాన్ని గౌరవించారు. కానీ, జగన్‌ మాత్రం తనకు నిబంధనలు, సంప్రదాయాలు పట్టనట్టు ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలలో డిక్లరేషన్‌పై మాత్రం సంతకం పెట్టకుండా నిబంధనలను ఉల్లంఘించారు. తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసిన అనేక అక్రమాలకు, అవినీతికి పాల్పడిన జగన్‌ అండ్‌ కో పాపాలకు నిష్కృతి లేదు.


నిజానికి, జగన్‌ పాలనలో టీటీడీ ద్వారా జరిగిన అక్రమాల పుట్టలో.. ‘లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి’ అన్నది ఒక అంశమే. లోతుగా దర్యాప్తు జరిపితే విస్తుపోయే వాస్తవాలెన్నో వెలికివస్తాయి. వాటన్నింటినీ ఇప్పుడు బయటకు తీయాలి. ‘దొంగే.. దొంగ దొంగ’ అనే చందంగా అరుస్తున్న వారి అక్రమాలను, అవినీతిని వెలికితీసి వారి భరతం పట్టకపోతే ప్రజల్లో నమ్మకం మరింత సడలిపోతుంది. ఒక్క టీటీడీయే కాదు.. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలలో జరుగుతున్న లోటుపాట్లను సమీక్షించాలి. ముఖ్యంగా, పరిపాలనా రంగంలో సంస్కరణలకు నాంది పలికిన చంద్రబాబునాయుడు.. దేవాదాయ శాఖపై దృష్టిపెట్టి భక్తులకు మరిన్ని సేవలు అందేవిధంగా మార్పులు తేవాలి. దేవాలయాలపై వచ్చే ఆదాయాన్ని దేవాలయాల అభివృద్ధికే ఖర్చు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలి. పాలక మండలి సభ్యుల నియామకంలో స్థానికులకే ప్రాధాన్యం కల్పించాలి. అంతిమంగా గాయపడిన భక్తుల మనోభావాలను గమనంలోకి తీసుకొని తిరుమలతోసహా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పవిత్రతను కాపాడాల్సిన తక్షణ కర్తవ్యం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఉంది.

- సి. రామచంద్రయ్య, శాసనమండలి సభ్యులు

Updated Date - Sep 28 , 2024 | 09:32 AM