Share News

Central Government: : జూన్‌ 25 రాజ్యాంగ హత్యా దినం

ABN , Publish Date - Jul 13 , 2024 | 04:49 AM

దేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన జూన్‌ 25వ తేదీని ‘రాజ్యాంగ హత్యా దినం’గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

Central Government:   : జూన్‌ 25 రాజ్యాంగ హత్యా దినం

  • ఎమర్జెన్సీ ప్రకటించిన జూన్‌ 25..

  • రాజ్యాంగ హత్యా దినం

  • కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం

  • బాధితులు, పోరాట వీరుల స్మరణ

  • ఇందిర.. ప్రజాస్వామ్యం గొంతునొక్కారు

  • ఆ చీకటి రోజులకు నిరసనగానే..: షా

  • అత్యవసర పరిస్థితి.. దేశ చరిత్రపై కాంగ్రెస్‌ రాసిన చీకటి అధ్యాయం

  • రాజ్యాంగాన్ని తొక్కిపెట్టారు: మోదీ

  • ఎమర్జెన్సీ ప్రకటించిన రోజుపై కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ చీకటి రోజులకు నిరసనగానే: అమిత్‌ షా

  • ఎమర్జెన్సీ.. దేశ చరిత్రపై కాంగ్రెస్‌ రాసిన చీకటి అధ్యాయం: మోదీ

న్యూఢిల్లీ, జూలై 12: దేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన జూన్‌ 25వ తేదీని ‘రాజ్యాంగ హత్యా దినం’గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటా జూన్‌ 25ను ఈ విధంగానే వ్యవహరించాలంటూ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ‘ఎక్స్‌’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘1975 జూన్‌ 25న ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ నియంతలా మారి ప్రజాస్వామ్యం గొంతునొక్కారు. మీడియాను అణచివేశారు.

కారణం లేకుండా లక్షలమందిని జైల్లో పెట్టారు. ఎమర్జెన్సీ బాధితులు, దానిపై పోరాడిన వీరులను స్మరించుకునేందుకు, ఆ చీకటి రోజులను గుర్తు చేసుకునేందుకు జూన్‌ 25ను రాజ్యాంగ హత్యా దినం (సంవిధాన్‌ హత్యా దివ్‌స)గా నిర్వహించాలని నిర్ణయించాం’’ అని పేర్కొన్నారు. షా ప్రకటన అనంతరం ప్రధాని మోదీ స్పందించారు. ‘‘ఎమర్జెన్సీ.. దేశ చరిత్రపై కాంగ్రెస్‌ పార్టీ రాసిన చీకటి అధ్యాయం. నాడు రాజ్యాంగాన్ని తొక్కిపెట్టి పరిపాలన సాగించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరినీ స్మరించుకునే రోజు’’ అని ట్వీట్‌ చేశారు.


మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ వంటి రాజ్యాంగ వ్యవస్థలను బలహీనం చేస్తోందంటూ కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ, ఇతర ప్రతిపక్షాల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఎన్నికల వేళ విపక్షాలు పెద్దఎత్తున ప్రచారం చేశాయి.

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనూ రాహుల్‌ సహా ‘ఇండియా’ ఎంపీలు పలువురు రాజ్యాంగ ప్రతులతో హాజరై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ సర్కారు జూన్‌ 25ను ‘‘రాజ్యాంగ హత్యా దినం’’గా ప్రకటించింది. ఇదిలా ఉండగా, మోదీ హయాంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, అసమానతలతో కోట్లాది ప్రజల జీవితలు ఛిన్నాభిన్నం అయ్యాయని, త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లోనైనా దేశ ప్రాథమిక ఆర్థిక అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ప్రధాని మోదీకి సూచించారు.

Updated Date - Jul 13 , 2024 | 04:49 AM