TDP: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి ఎమ్మెల్సీ!
ABN , Publish Date - Jul 26 , 2024 | 05:20 PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత వైసీపీ (YSR Congress) నుంచి ఒక్కొక్కటిగా వికెట్లు రాలిపోతున్నాయ్..! కీలక నేతలంతా వైసీపీకి గుడ్ బై చెప్పేసి ఇతర పార్టీల్లో చేరిపోతుండటంతో వైసీపీ విలవిలలాడుతున్న పరిస్థితి.!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత వైసీపీ (YSR Congress) నుంచి ఒక్కొక్కటిగా వికెట్లు రాలిపోతున్నాయ్..! కీలక నేతలంతా వైసీపీకి గుడ్ బై చెప్పేసి ఇతర పార్టీల్లో చేరిపోతుండటంతో వైసీపీ విలవిలలాడుతున్న పరిస్థితి.! ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీచేసిన నేతలు సైతం ఒక్కొక్కరుగా రాజీనామా చేయడంతో అసలేం చేయాలో తెలియక హైకమాండ్‌కు దిక్కుతోచని పరిస్థితి వచ్చి పడింది.! ఇవన్నీ ఒక ఎత్తయితే.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా.. ‘ఉండేవాళ్లు ఉండొచ్చు.. పోయే వాళ్లు పోవచ్చు.. బలవంతం ఏమీ వద్దు’ అని ఒకింత చేతులెత్తేసినట్లుగా ఒకానొక సందర్భంలో మాట్లాడటంతో ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అరకొర ఎంపీల్లో ఒకరిద్దరు కూడా జంపింగ్‌కు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఇలా వార్తలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం (MLC Zakia Khanam) బాంబ్ పేల్చారు.!
ఇదీ అసలు కథ..!
రాయచోటి నియోజకవర్గానికి చెందిన జకియా ఖానంకు వైసీపీ నుంచి ఎమ్మెల్సీని చేయడమే కాకుండా.. మండలి డిప్యూటీ చైర్ పర్సన్ పదవి కూడా కట్టబెట్టింది పార్టీ. మూడేళ్ల పాటు పార్టీలో, పార్టీ పెద్దలతో బాగానే ఉన్న జకీయా ఈ మధ్య ఎందుకో వైసీపీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీతో చెడిందని.. వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్లు వార్తలు గుప్పుమన్నాయి. సరిగ్గా ఈ నేపథ్యంలోనే మంత్రి నారా లోకేశ్‌తో జకియా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. శుక్రవారం నాడు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్సీ.. కుటుంబ సభ్యులతో కలిసి మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి మరీ అభినందించారు. సుమారు 25 నిమిషాల పాటు శాసన మండలి లాబీలో ఈ భేటీ జరిగింది. టీడీపీలో (Telugu Desam) చేరికపై ఆమె ప్రస్తావించగా.. లోకేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలియవచ్చింది. దీంతో ఇన్నాళ్లు టీడీపీలో చేరికపై వచ్చిన వార్తలకు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నట్లు అయ్యింది. త్వరలోనే టీడీపీలోకి జకియా ఖానం అంటూ అటు వైసీపీలో.. ఇటు తెలుగుదేశం పార్టీలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఎవరూ రాకున్నా..!
అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చట్టసభల్ని బహిష్కరించినా.. జకియా ఖానం మాత్రం శాసన మండలికి వస్తున్నారు. ఈ మధ్యనే మంత్రి ఫరూఖ్‌తో ఎమ్మెల్సీ భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారని మంత్రి కార్యాలయం ప్రకటించినప్పటికీ.. టీడీపీలో చేరికపైనే మంత్రి-ఎమ్మెల్సీ మధ్య జరిగిందనే నాడే మొదలైంది. ఇప్పుడిక ఏకంగా టీడీపీ అగ్రనేత, మంత్రి నారా లోకేశ్‌తోనే భేటీ కావడంతో దాదాపు వైసీపీకి గుడ్ బై చెప్పేసి పసుపు కండువా కప్పుకోబోతున్నారని కన్ఫామ్ చేసినట్లేనని వార్తలు గుప్పుమంటున్నాయ్. ఇదిలా ఉంటే.. రాష్ట్ర శాసనమండలి చరిత్రలోనే మొట్ట మొదటిసారి ఓ మైనారిటీ మహిళను డిప్యూటీ చైర్ పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అప్పట్లో ఓ రేంజిలో ఊదరగొట్టిన వైసీపీ.. కనీసం ఎందుకిలా పార్టీకి దూరంగా ఉంటున్నారు..? పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదు..? అని పిలిపించుకొని మాట్లాడకపోవడం గమనార్హం. ఇలా ఎన్నో విషయాలు నొచ్చుకున్న జకియా ఇక వైసీపీలో ఉండకూడదని ఫిక్స్ అయ్యి.. టీడీపీలో చేరాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ చేరిక ఎప్పుడు ఉంటుందో చూడాలి మరి.